Jagan vs RRR: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి షాకులు మీద షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన నేతలు ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతుండటంతో జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటీవల జగన్ ఇలాకా అయిన పులివెందుల పంచాయతీ ఎన్నికల్లోనూ ఘోర ఓటమి చవిచూడటం వైసీపీని తీవ్రంగా నిరాశ పరిచింది. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న జగన్ & కోను మరింత దెబ్బతీసేలా.. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో బై ఎలక్షన్స్ అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి.
‘ఈసారి అర్హత కోల్పోయినట్లే’
సెప్టెంబర్ మూడో వారం నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. కనీసం రెండువారాల పాటు సమావేశం జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఈసారైన అసెంబ్లీకి వస్తారా? అన్న చర్చ మరోమారు తెరపైకి వచ్చింది. దీనిపై తాజాగా స్పందించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తే ఎమ్మెల్యే పదవికి అర్హత లేనట్లే భావించాలని ఆయన అన్నారు. అదే జరిగితే పులివెందులకు బై ఎలక్షన్ వచ్చే అవకాశముందని అంచనా వేశారు.
Also Read: Hyderabad: ట్యాంక్ బండ్ వద్ద గణనాథుల జోరు.. ఇప్పటికే లక్షన్నరకు పైగా విగ్రహాల నిమజ్జనాలు
‘అందని ద్రాక్ష కోసం ఆరాటం తగదు’
వైసీపీ గత కొంతకాలంగా పట్టుబడుతున్న ప్రతిపక్ష హోదా గురించి కూడా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పందించారు. వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభకు రాకుండా అందని ద్రాక్ష కోసం ఆరాటపడటం సమంజసం కాదని అన్నారు. మాజీ సీఎం జగన్ శాసనసభ సమావేశాలకు రావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. ‘గతంలో సిద్ధం సిద్ధం అని పోస్టర్లు వేశారు. ఇప్పుడు రావడానికి సిద్ధంగా లేమంటున్నారు. అసెంబ్లీకి ఎమ్మెల్యేలు అందరూ రావాలని కోరుకోవడం నా బాధ్యత. 11 మందికి బై ఎలక్షన్ వచ్చింది అనుకుందాం. 11 మంది వారే గెలిచారు అనుకుందాం.. అయినా అది 18 అవ్వదు కదా’ అని రఘురామ సెటైర్లు వేశారు.
Also Read: Strange incident: హుండీ దోచేసిన వారికి.. చుక్కలు చూపించిన అమ్మవారు.. దెబ్బకు తిరిగిచ్చేసిన దొంగలు!
ఈసారి 11 కాదు ఒకటే కష్టం
మరోవైపు భీమవరం, ఉండి నియోజకవర్గాల మధ్య త్రాగునీరు సమస్యపైన కూడా రఘురామకృష్ణంరాజు స్పందించారు. ’50 కుటుంబాలు తాగునీరు లేక చాలా ఇబ్బంది పడుతుంటే భీమవరం నుంచి ఉండిలోని విస్సాకోడేరుకు నీరు సరఫరా చేసాం. నీటి సరఫరాకు డబల్ రేట్ కట్టాము. దీనిపై వైసీపీ వారు నిరాహార దీక్ష చేస్తా అంటే చేయండి. నిరాహార దీక్ష భగ్నం చేయడానికి ఎవరూ రారు. విస్సా కోడేరులో 50 కుటుంబాలకు మంచినీరు ఇవ్వలేమని ప్రకటించి దీక్ష చేయండి. గతంలో విస్సాకోడేరు భీమవరంలో ఉండేది. భీమవరం నీళ్లు విస్సాకోడేరు వెళ్ళటానికి వీల్లేదని చెప్పే నీచులు బతకడానికి అనర్హులు. ఈసారి 11 కాదు ఒకటే కష్టం’ అంటూ రఘురామ చెప్పుకొచ్చారు.