Earthquake: తెలుగు రాష్ట్రాలను భూకంపం (Earthquake) భయపెడుతోంది. సోమవారం సాయంత్రం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించగా.. మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ను (Andhra Pradesh) భూ ప్రకంపనలు భయపెట్టాయి. ప్రకాశం జిల్లాలోని (Prakasam District) దర్శిలో స్వల్ప భూకంపం సంభవించింది. రెండు సెకన్ల పాటు దర్శి, కురిచేడు, ముండ్లమూరు మండలాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో అసలేం జరుగుతోందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇళ్లల్లో నుంచి జనాలు రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు కూడా వచ్చాయని ఆయా ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. కాగా, ప్రకాశం జిల్లాలో భూకంపాలు రావడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో పలుమార్లు భూకంపాలు సంభవించాయి. అయితే తాజాగా వచ్చిన ఈ భూకంపానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. భూకంప కేంద్రాన్ని ఇంతవరకూ అధికారులు గుర్తించలేదు.
Read Also- వణికిపోయిన కరీంనగర్, హైదరాబాద్
భూకంపం ఎలా వస్తుంది?
కాగా, భూమి లోపలి టెక్టోనిక్ ప్లేట్లు కదలడంతో తెలుగు రాష్ట్రాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయని నిపుణులు వెల్లడించారు. ఈ ప్లేట్లు ఒకదానికి మరొకటి రాసుకుంటూ వెళ్ళినప్పుడు లేదా ఒకదాని కిందికి మరొకటి జారినప్పుడు, భూమిలో ఒకరమైన శక్తి విడుదల అవుతుంది. ఇలా జరగడం వల్ల ఒక్కసారిగా భూమి కంపించి భూకంపాలు సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇండియా మొత్తం నాలుగు భూకంప మండలాలుగా విభజించబడితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తక్కువ ముప్పు ఉన్న జోన్ 2 లో ఉండటం కాస్త ఊపిరిపీల్చుకునే విషయమేనని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాలు జోన్ 3 లో కూడా ఉండటంతో మధ్యస్థ భూకంపాలు సంభవించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Read Also- YS Jagan: వైసీపీ కోఆర్డినేటర్లు, ముఖ్య నేతలకు వైఎస్ జగన్ కీలక ఆదేశాలు
ఇలా చేయండి..
కాగా, భూకంపాలు వచ్చినప్పుడు భయపడకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలని నిపుణులు చెబుతున్నారు. అయితే భయాందోళనకు గురైతే మాత్రం సరైన నిర్ణయాలు తీసుకోలేరని, ఇలాంటి సమయాల్లో చాకచక్యంగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇంటి లోపల ఉంటే బల్ల లేదా డెస్క్ వంటి గట్టి వస్తువుల కిందికి వెళ్లి, దాన్ని గట్టిగా పట్టుకోవాలని ప్రజలకు నిపుణులు సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా తల, మెడను చేతులతో కప్పుకోవాలని, కిటికీలు, అద్దాలు, భారీ ఫర్నిచర్, గోడలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఒకవేళ భూకంపం సంభవించినప్పుడు భవనం పైఅంతస్తులో ఉంటే, కింది అంతస్తుకు వెళ్లడానికి వీలైనంతవరకూ ప్రయత్నించాలి. ఈ సమయంలో పొరపాటున కూడా లిఫ్ట్‌ను ఉపయోగించవద్దని, మెట్ల మార్గాన్ని మాత్రమే వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ బయట ఉంటే మాత్రం భవనాలు, విద్యుత్ స్తంభాలు, చెట్లు, ఇతర ప్రమాదకరమైన ప్రదేశాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. వాహనాల్లో ఉంటే, సురక్షితమైన స్థలాల్లో ఆపి, భూకంపం ఆగే వరకు వాహనంలోనే ఉండేందుకు ప్రయత్నించాలి. వంతెనలు, ఫ్లైఓవర్ల మీద వాహనం ఆపొద్దని నిపుణలు సూచిస్తున్నారు.
Read Also- Pawan Kalyan: స్నేహపూర్వకంగా పరిష్కరించాలి.. పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన
తెలంగాణలో ఇలా..
సోమవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో భూకంపం సంభవించింది. కరీంనగర్ (Karimnagar), సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో స్వల్పంగా భూమి కంపించింది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, గంగాధర, చొప్పదండి, రామడుగు, కమ్మర్‌పల్లి, మోర్తాడ్ తదితర ప్రాంతాల్లో రెండు సెకన్లపాటు భూమి కంపించింది. రెండుసార్లు ఇలా భూ ప్రకంపనలు రావడంతో భయపడిన ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్‌పై 3.9గా తీవ్రత నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. సరిగ్గా సోమవారం సాయంత్రం 6:50 నిమిషాల 28 సెకన్ల నుంచి 30 సెకన్లపాటు భూమి కంపించింది. మరోవైపు జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 10 సెకన్ల పాటు భూమి కంపించగా.. ఒక్కసారిగా భవనాలు ఊగిపోయాయి. దీంతో జిల్లా ప్రజలు వణికిపోయారు. అసలేం జరుగుతోందో తెలియక చిన్నా, పెద్ద భయంతో ఇళ్లలో నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. అయితే భూకంప తీవ్రత, భూకంప కేంద్ర సమాచారం ఇంకా తెలియరాలేదు. జిల్లాలోని మెట్‌పల్లి, కోరుట్ల పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు ఎక్కువగా సంభవించాయి. నిర్మల్ జిల్లాలోని కడెం, జన్నారం, ఖానాపూర్, లక్ష్మణ్‌చాందా మండలాల్లో 2 నుంచి 5 సెకన్ల పాటు భూమి కంపించగా, తీవ్రత 3.8గా నమోదైంది. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కాగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం భూకంప తీవ్రత ఉంది. కోరుట్లలోనూ ఇదే పరిస్థితి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సైతం భూమి కంపించింది.
Read Also- Singer Pravasthi: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ ప్రవస్తి.. ఒక్క దెబ్బకి అందరికీ ఇచ్చిపడేసిందిగా..!