Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రమైన తమిళనాడు మత్స్యకారులపై శ్రీలంకకు చెందిన సముద్రపు దొంగలు దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో గాయపడిన 17 మంది జాలర్లు ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర డిప్యూటీ సీఎం, జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బంగాళాఖాతంలో జరిగిన ఐదు వేర్వేరు సంఘటనలలో తమిళనాడుకు చెందిన 24 మంది భారతీయ మత్స్యకారులకు సంబంధించిన సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ‘ఎక్స్’లో తెలిపారు. నాగపట్నం జిల్లాకు చెందిన ఈ మత్స్యకారులు సముద్రంలో జరిగిన ఘర్షణలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కొందరు గాయపడటం బాధాకరమన్నారు. మత్స్యకారుల జీవనోపాధి కూడా ప్రభావితమైందని ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశం-శ్రీలంక మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న స్నేహపూర్వక సంబంధాల దృష్ట్యా, పునరావృతమయ్యే ఈ సంఘటనలను గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు, ఈ సమస్యలను సౌమ్యంగా, ద్వైపాక్షిక సమన్వయంతో, స్నేహపూర్వకంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరుతూ ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ పోస్టు చేశారు. భారత్, శ్రీలంక ప్రభుత్వాలు పరస్పర సహకార స్ఫూర్తితో ఈ సమస్యలను పరిష్కరించడానికి నిర్మాణాత్మక చర్చలు చేయడం అత్యవసరమని భావిస్తున్నట్లు జనసేనాని సూచించారు. ఇరువైపులా మత్స్యకారుల భద్రత, సముద్ర సరిహద్దుల పట్ల గౌరవం బలోపేతానికి నిరంతర ప్రయత్నాలు చేయాలన్నారు. జాలర్ల భద్రతపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రెండు దేశాల మత్స్యకారుల రక్షణ అంశాన్ని కూడా పవన్ తన ట్వీట్‌లో ప్రస్తావించారు. ఈ తరహా ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూసేలా చర్యలు తీసుకొని, తీరప్రాంత ప్రజల జీవనాధారాలు సురక్షితంగా ఉండేలా ప్రభుత్వాలు కట్టుబడి పనిచేయాలని పవన్ కళ్యాణ్ కోరారు.
Read Also- YS Jagan: వైసీపీ కోఆర్డినేటర్లు, ముఖ్య నేతలకు వైఎస్ జగన్ కీలక ఆదేశాలు
అసలేం జరిగింది?
కాగా, శుక్రవారం కోరమండల్ కోస్తా సమీపంలో సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్లిన తమిళనాడు నాగపట్టినం జిల్లాకు చెందిన 30 మందికి పైగా జాలర్లపై ఆరుగురు శ్రీలంక సముద్రపు దొంగలు పదునైన ఆయుధాలతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 17 మంది మత్స్యకారులకు గాయాలయ్యాయి. అంతటితో ఆగకుండా చేపల వలలు, లూటీ చేసి, పడవలపైనా దాడి చేశారు. అనంతరం జీపీఎస్ పరికరాలను దోచుకెళ్లారు. ఈ ఘటనలో సుమారు రూ.10 లక్షల వస్తువులను దోచుకున్నట్లుగా తెలుస్తున్నది. గాయపడినవారిని ఒడ్డుకు తెచ్చిన తర్వాత జిల్లా ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారని మత్స్యకారుల ద్వారా సమాచారం అందినది. ఈ దాడి సముద్రజలాల్లోనే జరగడం గమనార్హం. ఈ దాడి ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని జాలర్లు వేడుకుంటున్నారు. ప్రభుత్వాలే తమను ఆదుకోని, ఇంటికి క్షేమంగా చేర్చాలని మత్స్యకారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే, తాము ప్రస్తుతం సమ్మెలో ఉన్నామని, ఇలాంటి దాడులు కొనసాగితే నిరవధిక సమ్మెకు వెళ్తామని మత్స్యకారులు హెచ్చరిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో కూడా ఇలాంటి ఘటనే జరగ్గా ముగ్గురు తమిళనాడు మత్స్యకారులు గాయపడ్డారు. అయితే ఐదు నెలల వ్యవధిలోనే తాజాగా మరో ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
Read Also-Hero Nani: ఆ ఒక్క రాత్రి చాలా భయమేసింది.. రక్తంతో నా బాడీ తడిసిపోయింది.. హీరో నాని
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
The recent incidents involving 24 Indian fishermen from Tamil Nadu, reported across five separate occurrences in the Bay of Bengal, are a matter of deep concern. It is distressing to learn that these fishermen from Nagapattinam district have faced hardships and sustained…
— Pawan Kalyan (@PawanKalyan) May 5, 2025