Earthquake : తెలంగాణలోని పలు జిల్లాల్లో భూకంపం సంభవించింది. కరీంనగర్ (Karimnagar), సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో స్వల్పంగా భూమి కంపించింది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, గంగాధర, చొప్పదండి, రామడుగు, కమ్మర్‌పల్లి, మోర్తాడ్ తదితర ప్రాంతాల్లో రెండు సెకన్లపాటు భూమి కంపించింది. రెండుసార్లు ఇలా భూ ప్రకంపనలు రావడంతో భయపడిన ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్‌పై 3.9గా తీవ్రత నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. సరిగ్గా సోమవారం సాయంత్రం 6:50 నిమిషాల 28 సెకన్ల నుంచి 30 సెకన్లపాటు భూమి కంపించింది. మరోవైపు జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 10 సెకన్ల పాటు భూమి కంపించగా.. ఒక్కసారిగా భవనాలు ఊగిపోయాయి. దీంతో జిల్లా ప్రజలు వణికిపోయారు. అసలేం జరుగుతోందో తెలియక చిన్నా, పెద్ద భయంతో ఇళ్లలో నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. అయితే భూకంప తీవ్రత, భూకంప కేంద్ర సమాచారం ఇంకా తెలియరాలేదు. జిల్లాలోని మెట్‌పల్లి, కోరుట్ల పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు ఎక్కువగా సంభవించాయి. నిర్మల్ జిల్లాలోని కడెం, జన్నారం, ఖానాపూర్, లక్ష్మణ్‌చాందా మండలాల్లో 2 నుంచి 5 సెకన్ల పాటు భూమి కంపించగా, తీవ్రత 3.8గా నమోదైంది. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కాగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం భూకంప తీవ్రత ఉంది. కోరుట్లలోనూ ఇదే పరిస్థితి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సైతం భూమి కంపించింది.
Read Also- Kesineni Nani: చిన్నిపై ‘లిక్కర్’ బాంబ్ పేల్చిన కేశినేని నాని.. సీఎం చంద్రబాబు నెక్స్ట్ స్టెప్ ఏంటో?
భాగ్యనగరంలో పరిస్థితి ఇదీ..
హైదరాబాద్ (Hyderabad) మహానగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది. సోమవారం రాత్రి 7.30 గంటల నుంచి మాదాపూర్, కొండాపూర్, మణికొండ, జూబ్లీహిల్స్, బంజరాహిల్స్, ఫిల్మ్‌నగర్, పంజాగుట్టతో పాటు పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీవర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. ఉప్పల్, చిలుకానగర్, కంటోన్మెంట్, బోడుప్పల్, మేడిపల్లి ప్రాంతాల్లోనూ భారీగానే వర్షం కురిస్తున్నది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరిపోయాయి. దీంతో ఆఫీసులు, ఇంటి నుంచి బయటికొచ్చిన వాహనదారులు తిరిగివెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, గాలి వానలు సంభవించే అవకాశముందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. కాగా, కొన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు, పిడుగులు, తుఫానుగాలులు (40-50 కిమీ వేగంతో), వడగండ్ల వానలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. మొత్తానికి చూస్తే అటు భూకంపం, ఇటు భారీ వర్షం థాటికి రాష్ట్ర ప్రజలు భయంతో వణికిపోయారు.
Read Also- Singer Pravasthi: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ ప్రవస్తి.. ఒక్క దెబ్బకి అందరికీ ఇచ్చిపడేసిందిగా..!