– బస్సులన్నీ ఫుల్.. ఎర్రబస్సుకు కొత్త కళ
– ‘ఉచితం’తో 35 శాతం పెరిగిన ప్రయాణికులు
– చార్జీల బాధ తప్పిందని మహిళల ఆనందం
– చిరు వ్యాపారులు, చిన్న ఉద్యోగులకు మేలు
– స్కూళ్లు, కాలేజీ విద్యార్థులకు ఉపయోగకరం
– వారాంతాల్లో పెరుగుతున్న రద్దీ
A Free Journey Where Restrictions are Gone Aspiration is Brought : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఈ పథకం లక్షలాది గృహాల బడ్జెట్‌కు ఆర్థికంగా చేయూతగా ఉండటమే కాకుండా మహిళా చైతన్యానికి బూస్ట్‌గా మారింది. ఈ పథకం దండగనీ, ఈ పథకంతో ఆర్టీసీ మూలబడటం ఖాయమనీ, ఆటోవాలాలంతా రోడ్డున పడతారంటూ విపక్షాలు విమర్శలకు దిగాయి. కానీ, ఈ పథకం వల్ల ఆర్థికంగా, సామాజికంగా, విద్యా ఉపాధుల పరంగా వస్తున్న మార్పులు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. 2023 డిసెంబరు 9న ప్రారంభమైన ఈ పథకం అమలుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో ప్రయాణించే మహిళల సంఖ్య 12 – 13 లక్షలుగా ఉండగా, నేడు అది 18 లక్షలకు చేరువగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్‌లో గతంలో రోజుకు 5 లక్షలమంది ఆర్టీసీలో ప్రయాణిస్తుండగా, నేడు వారి సంఖ్య 6. 30 లక్షలకు పెరిగింది. సిటీ బస్సుల్లో సగానికి పైగా మహిళా ప్రయాణికులే కనిపిస్తున్నారు. ద్విచక్రవాహనాలు, ఆటోల్లో కాలేజీలకి, ఆఫీసులకు వెళ్లే యువతులు, మహిళలంతా నేడు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణిస్తున్నారు.
దేవాలయాల ఆదాయంలో పెంపు..
సొంత వాహనాలు వాడే మహిళలు పెద్ద సంఖ్యలో మహిళలు ఆర్టీసీని ఆశ్రయించటంతో కాలుష్యం తగ్గి పర్యావరణానికీ మేలు జరుగుతోంది. ఉచిత బస్ ప్రయాణాల వలన ఆలయాలు, టూరిజం ప్రదేశాలకు ఆదాయం భారీగా పెరుగుతోంది. 2023 జనవరి నుంచి డిసెంబర్ 30వ తేదీ వరకు యాదాద్రికి వచ్చిన ఆదాయంరూ.147.36 కోట్లు కాగా, ఫ్రీ జర్నీ ఆరంభించిన రోజు(డిసెంబరు 9) నుంచి డిసెంబరు 31 నాటికి రూ.38.16 కోట్లు యాదాద్రి హుండీకి చేరాయి. దీనికి తోడు ఆలయ పరిసరాల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి ఆదాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఇది మరింత ఎక్కువ.
మానవ సంబంధాల్లో మార్పు..
కూలీ నాలీ చేసుకునే వారు, చిరుద్యోగి కుటుంబాల మహిళలు గతంలో దూరాభారాన ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు ఇళ్లలో జరిగే శుభకార్యాలకి వెళ్లేందుకు చార్జీల భయంతో ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వచ్చేది. కానీ, ఫ్రీ జర్నీ రాకతో చాలామంది మహిళలు దూరాభారాలను లెక్కచేయకుండా తమవారి వద్దకు వెళ్లి, వారి మంచి చెడుల్లో భాగస్వాములు కాగలుగుతున్నారు. ఏ రకంగా కూడా మహిళలకు ఉచిత ప్రయాణం నష్టం కాదు.
Read Also : అష్టదిగ్బంధం, కేసీఆర్ కుటుంబంపై ఈడీ కత్తి..!
మహిళా శక్తికి ఊతం..
ఈ పథకం వల్ల అటు గ్రామాలు, మండలాల స్థాయిలో శ్రమలో మహిళా భాగస్వామ్యం పెరుగుతోంది. పట్టణ, నగర శివారు ప్రాంతాల్లోని చిన్న చిన్న మాన్యుఫాక్చరింగ్ యూనిట్లలో పనిచేసే మహిళలకు నెలకు పదివేల వరకు వేతనం లభిస్తోంది. కానీ, ఇంతకు మునుపు ఇలాంటి ఉద్యోగాలకి వెళ్లేందుకు రోజుకు రూ. 60 నుంచి రూ. 70 వరకు రవాణా చార్జీలకే పోయేది. ఇలా నెలకు సుమారు రెండున్నర వేల రూపాయలు ఖర్చయిపోయేవి. ఉచిత బస్సు రాకతో ఈ మొత్తం వారికి మిగలటేమే గాక మరికొందరు గృహిణులు ఉపాధి అవకాశాలను వెతుక్కునేందుకు ముందుకు వస్తున్నారు. అలాగే, గ్రామాల్లోని మహిళలు తమ పొలాల్లోని పండ్లు, ఆకుకూరలు, కూరగాయలను సమీపంలోని టౌన్‌లకి తరలించి అమ్ముకునేందుకు ఫ్రీ జర్నీ ఒక అవకాశంగా మారింది.
పెరిగిన ఆర్టీసీ ఆదాయం
ఈ పథకానికి ముందు బస్సుల్లో సీట్ల భర్తీ నిష్పత్తిని తెలిపే ఓఆర్ (ఆక్యుపెన్సీ రేషియో) 65-68 శాతం ఉండేది, ఇప్పుడు తరచూ 100 శాతం దాటేస్తోంది. 2024 ఫిబ్రవరి 19వ తేదీన ఏకంగా 114.28 శాతం ఓఆర్ నమోదవ్వగా, ఫిబ్రవరి 20 న 108.38 శాతం నమోదైంది. గతంలో ఆదాయ లక్ష్యాన్ని చేరుకోని వారికి, టికెట్ లేకుండా ప్రయాణించే వారు దొరికినప్పుడు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు జరిమానాలుండేవి. ఇప్పుడంత ఒత్తిడి లేదు. దీంతో డ్రైవర్లు రిలాక్స్‌గా, గౌరవప్రదంగా డ్రైవింగ్ చేస్తున్నారు. దీనికి తోడు కొత్త ప్రభుత్వం ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్‌మెంట్ ఇవ్వటంతో సిబ్బందికి సంస్థ భవిష్యత్తు పట్ల ఉన్న భయాలూ తొలగిపోయాయి. గత పదేళ్లుగా ఆర్టీసీ బస్టాండ్లలోని షాపుల్లో వ్యాపారం చేసేందుకు చాలామంది ఆసక్తి చూపలేదు. ఫ్రీ జర్నీ పథకంతో బస్టాండ్లన్లీ ప్రయాణికులతో కళకళలాడటంతో ఇప్పుడు ఆ షాపులకు గిరాకీ పెరిగి, తద్వారా ఆర్టీసీకీ ఆదాయం చేకూరటమే గాక ఆ పరిసరాల్లో చిన్న వ్యాపారుల సంఖ్య పెరిగి, పలువురికి స్వయం ఉపాధి లభిస్తోంది. ఆటోలు, జీపులు, టాటా ఏస్ వంటి వాహనాల వల్ల గతంలో ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయింది. కానీ, ఫ్రీ జర్నీ వల్ల మహిళా ప్రయాణికులతో బాటు వారి పురుష కుటుంబ సభ్యులూ ఆర్టీసీలోనే కలిసి ప్రయాణిస్తుండటంతో ఆదాయమూ పెరుగుతోంది.
సామాజిక మార్పుకు ఉదాహరణ
గత ప్రభుత్వం భారంగా భావించిన ఆర్టీసీ నేడు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్ఈపీ) ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మారుతోంది. మహిళలకు, పర్యావరణానికి అపారమైన మద్దతునిచ్చే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు మీడియంగా ఇది మారింది. మహిళలకు ఉచిత ప్రజా రవాణా అందించే ఈ మహాలక్ష్మి పథకం తప్పక కొనసాగాల్సిన అవసరముంది. గత పదేళ్లుగా ఆర్టీసీ బస్సు ఎక్కని మహిళా ఉద్యోగులు నేడు ఫ్రీ జర్నీని చక్కగా వాడుకుంటున్నారు. గుడిమల్కాపూర్ మార్కెట్‌లో పూలు అమ్ముకునే మహిళలు, దూరప్రాంతాల్లో అపార్టమెంట్లలో పనిమనుషులుగా, భవన నిర్మాణంలో కూలీలుగా పనిచేసే మహిళలు సైతం నేడు ఆధార్ కార్డు పట్టుకుని దర్జాగా ఆర్టీసీ బస్సును ఆపుతున్నారు. నగర శివారుల్లోని ఇంజనీరింగ్ కాలేజీ అమ్మాయిలు ఏటా తాము కడుతున్న రూ. 18 వేల బస్సు ఫీజు మిగుల్చుకోగలుగుతున్నారు. ఇంటర్, డిగ్రీ కాలేజీకి వెళ్లే ఆడపిల్లలకు గతంలోని స్టూడెంట్ పాస్ డబ్బులు పాకెట్ మనీగా ఉపయోగపడుతున్నాయి. ఈ పథకం వల్ల సామాజిక సమానత్వం స్పష్టంగా కనబడుతోంది. మన మంత్రులు, అధికారులు కూడా ఇలా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును ఆశ్రయిస్తే మరింత బాగుంటుంది. ‘సామాజిక, ప్రజా తెలంగాణ’కు నాంది పలికే చర్యల్లో ఖచ్చితంగా ఫ్రీ జర్నీ ఒక చోదక శక్తిగా నిలుస్తోంది.
Read Also : నగదు తనిఖీలతో సామాన్యుల పరేషాన్
– డాక్టర్ లుబ్నా సర్వత్. ఫౌండర్-డైరెక్టర్, సెంటర్ ఫర్ వెల్‌బీయింగ్ ఎకనామిక్స్,
గ్రామీణ, పేద, మధ్యతరగతి మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఉండదు. బాల్యంలో తండ్రి, పెళ్లి అయ్యాక భర్త, వృద్ధాప్యంలో కన్న బిడ్డలపై ఆధారపడి ఉండాలి. ఏ అవసరానికి ఎక్కడికి వెళ్లాలన్నా ముందే మొర పెట్టుకోవాల్సిందే. ఆర్థిక పరిస్థితి అనుకూలించి అవసరమైన డబ్బులు ఉంటేనే ఆడవారు ఇంట్లో నుంచి వెళ్లగలుగుతారు. ఈ బానిస బంధాన్ని ఉచిత ప్రయాణం బద్దలు కొట్టింది. మహిళలు రాష్ట్రమంతా స్వేచ్ఛగా ప్రయాణించడానికి గ్యారంటీ ఏర్పడింది. ప్రయాణం చైతన్యానికి మొదటి మెట్టు.
– కె. సౌజన్య, పీవోడబ్యూ రాష్ట్ర కమిటీ మెంబర్