– రూ. 50 వేలు మించిన నగదు సీజ్
– అత్యవసర సేవలకు దక్కని మినహాయింపు
– అవగాహన లేమితో జనం ఇక్కట్లు
– భారీ బ్యాంకు లావాదేవీలపైనా ఈసీ నజర్
– తిరిగి పొందాలంటే జిల్లా కేంద్రానికి పోవాల్సిందే
Common people’s Confusion With Cash Cheques : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు ఇప్పటికే ఎన్నికల సంఘం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈసీ ఆదేశంతో తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల అధికారులు నిఘా పెంచారు. పట్టణాలు, మండలాల సరిహద్దుల్లో పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. ఏ ఆధారాలు లేకుండా రూ. 50 వేలకు మించి తీసుకుపోతున్న నగదును పోలీసులు సీజ్ చేస్తున్నారు. ఈ నియమాల వివరాలు తెలియని సామాన్యులు నెత్తి నోరు బాదుకున్నా, ఆధారాలు చూపితే గానీ తిరిగా ఇవ్వటం జరగదు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలొచ్చే జూన్ 4 వరకు నగదు విషయంలో ప్రజలు కింది నియమాలను దృష్టిలో ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈసీ నిబంధనల ప్రకారం వ్యక్తులు రూ. 50 వేల రూపాయలకు మించి నగదును వెంట తీసుకుపోవటం కుదరదు. ఒకవేళ అత్యవసరాలకు అంతకు మించిన నగదు తీసుకుపోవాల్సి వస్తే, అందుకు సంబంధించిన రసీదును వెంట ఉంచుకోవాలి. దుకాణాలలో కొన్న సరుకు లేదా వస్తువులకు చెల్లించేందుకు నగదు తీసుకుపోయే వ్యాపారులు ఆ కొనుగోలు తాలూకూ ముందస్తు కొటేషన్‌ను దగ్గర ఉంచుకోవాలి. నగల వ్యాపారులైతే, తమతో ఉన్న నగల ఆర్డర్ కాపీ, తరలింపు పత్రం చూపించాల్సిందే. ఒకవేళ మీరు ఆసుపత్రిలో జరుగుతున్న చికిత్సకు డబ్బు కట్టేందుకు వెళుతుంటే, ఆ ఆసుపత్రి బిల్లులు, ఓపీ పత్రాలు దగ్గర ఉంచుకోవాలి.కాలేజీలో ఫీజు కట్టేందుకు డబ్బు తీసుకుపోయేవారు కాలేజీ గుర్తింపు కార్డు, గత సంవత్సరం ఫీజు రసీదు దగ్గర ఉంచుకోవాలి.
Read More: ఎందుకు.. ఏమిటి.. ఎలా..?
పెళ్లిళ్లు, ఫంక్షన్ల నిమిత్తం కొనుగోళ్లకు వెళ్లే వారు బ్యాంకు నుంచి నగదు విత్‌డ్రా చేసినప్పటి రసీదును, వ్యక్తిగత ఐడెంటిటీ కార్డు వంటివి వెంట ఉంచుకోవాల్సిందే. ధాన్యం విక్రయించగా రైతులు పొందిన డబ్బును తీసుకుపోతున్న సందర్భంలో మార్కెట్ యార్డు రసీదు లేదా ప్రైవేటు వ్యాపారులిచ్చే రసీదును చూపాలి. భూమి విక్రయించిన సొమ్ము అయితే వాటి రసీదు, దస్తావేజులు చూపాలి. వేతనాల చెల్లింపుకోసం తరలించే నగదైతే కంపనీ శాలరీ షీట్, గుర్తింపు కార్డులు దగ్గరుంచుకోవాలి. ఒకవేళ వ్యాపారుల వద్ద పెద్దమొత్తంలో డబ్బు పట్టుబడితే, డబ్బు సీజ్ చేయటమే గాక ఐటీ, జీఎస్టీ అధికారులు కూడా రంగంలోకి దిగుతారు. వాటికి సంబంధించి కచ్చితమైన ఆధారాలు చూపిస్తేనే తిరిగి ఇస్తారు.
తగిన ఆధారాలు లేకుండా దొరికిన నగదును పోలీసులు, ఎన్నికల అధికారులు సీజ్ చేస్తారు. ఆ మొత్తాన్ని జిల్లాస్థాయిలో ఉండే కమిటీకి అప్పగిస్తారు. జిల్లా పరిషత్ సీఈవో నేతృత్వంలోని ఉన్నతాధికారులు ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. ఒకవేళ మీరు తగిన ఆధారాలు చూపగలిగితే, ఈ కమిటీ మీ నగదును మీకు తిరిగి ఇస్తుంది. మరోవైపు బ్యాంకుల్లో జరుగుతున్న భారీ నగదు లావాదేవీల మీద, డిపాజిట్, విత్ డ్రా చేస్తున్న అకౌంట్ల మీద ఈసీ నిఘా పెడుతోంది. రోజూ లక్షకు మించిన బ్యాంకు లావాదేవీల వివరాలను తమకు ఇవ్వాలని ఇప్పటికే ఈసీ రాష్ట్రాలకు లేఖ రాసింది. అలాగే అభ్యర్థులు, వారి బంధువులు, సన్నిహితుల బ్యాంకు అకౌంట్లలో జరిగే లావాదేవీలను గురించి కూడా ఈసీ ఆరా తీస్తోంది.