– లిక్కర్ కేసులో కుమార్తె అరెస్ట్
– అత్యంత విశ్వసనీయులపై ఫోన్ ట్యాపింగ్ కేసు
– ఒకే రోజు రెండు కేసుల్లో సోదాలతో ఉక్కిరిబిక్కిరి
– అల్లుడు అనిల్‌ని ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చని వార్తలు
– అవసరమైతే కేసీఆర్‌కి నోటీసులిచ్చి సాక్షిగా పిలిచే ఛాన్స్?
– లిక్కర్ పెట్టుబడుల్లో మూలాలు సంతోష్ రావు వరకు ఉన్నాయా?
– ఫోన్ ట్యాపింగ్‌లో మరో బ్రాంచ్‌గా పత్రిక అధిపతి
– ప్రభాకర్ రావు కుటంబ సభ్యుల పాత్రపై నిఘా
– ఇప్పటికే పార్టీని వీడుతున్న కీలక నేతలు
– మసకబారుతున్న బీఆర్ఎస్ ప్రాభవం
Octave, ED knife on KCR Family : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ ప్రాభవం మసకబారుతోంది. ఓవైపు పార్టీ నుంచి కీలక నేతలంతా జంప్ అవుతున్నారు. ఇంకోవైపు వరుసగా కేసులు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్ అయ్యారు. ఆమె భర్త అనిల్ కూడా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం నుంచి కేసీఆర్ బంధువుల ఇళ్లపై దర్యాప్తు సంస్థలు సోదాలకు దిగాయి. ఒకవైపు కవితను విచారించిన ఈడీ, ఆమె భర్త అనిల్ ఆర్థిక లావాదేవీలపై గురి పెట్టింది. అనిల్ రావు సోదరి అఖిల, వారి బంధువులైన మేక చరణ్ ఇళ్లలో సోదాలు నిర్వహించింది. లిక్కర్ పాలసీ ద్వారా వచ్చిన సొమ్మును, పంజాబ్, గోవా ఎన్నికలకు ఎలా చేరవేశారనే ఆధారాల కోసం సోదాలు నిర్వహించారు అధికారులు. ఇదే క్రమంలో తెలంగాణ మాజీ సీఏం కేసీఆర్‌ని ఈడీ సాక్షిగా కొన్ని ప్రశ్నలకు వివరణ అడిగేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కేజ్రీవాల్ విచారణ తర్వాత ఈ పక్రియ కొనసాగనుందని అంటున్నారు. అల్లుడు అనిల్‌తో పాటు, ఆ రోజుల్లో నగదు సర్దుబాటు చేసిన సంతోష్ రావు అత్యంత సన్నిహితుడు శ్రీనివాస్ రావుకి సంబంధాలు ఉన్నట్లు అప్పట్లో ఈడీ ఆరా తీసింది. ఇప్పుడు కవిత, ఆమె భర్త అనిల్, అల్లుడు చరణ్ పాత్రలు కళ్లముందు కనిపిస్తుండటంతో దర్యాప్తు మరింత ఆసక్తికరంగా మారుతోంది.
ఫోన్ ట్యాపింగ్‌లో ఇంకో లైన్‌ని టచ్ చేస్తారా?
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ చేసి చట్ట విరుద్ధ పనులకు వాడిన లింకులు చాలానే ఉన్నాయి. విచారణలో ప్రణీత్ రావు చెప్పింది గోరంత సమాచారమేనని తెలుస్తోంది. ఐ న్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్ రావు ఒక వైపు మిస్ యూజ్ చేస్తే, మరోవైపు పేపర్ ఓనర్ అప్పటి యువరాజ కోసం మరో లైన్‌ని వాడకం జరిపారని సమాచారం. అందుకు ప్రభాకర్ రావు బావమరిది అశ్విన్ రావుతో పాటు కుటుంబ సభ్యులు ఉన్నారని విచారణలో తేలుతోంది. మరో లైన్‌లో మన రాష్ట్రం-మన పత్రిక అంటూ అప్పటి ప్రభుత్వానికి గుమాస్తా గిరి చేసిన ఓనర్ పాత్రపై విచారణ జరిపిస్తే మరిన్ని రహస్యాలు, చేసిన అరాచకాలు బయటపడే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. సొంత కుటుంబ సభ్యులు, భార్యల ఫోన్స్ ట్యాపింగ్ కూడా ఈ బ్రాంచ్ నుంచే జరిగాయని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శ్రవణ్ రావు లండన్ వెళ్లిపోగా అతని మామతో పాటు మాజీ పోలీస్ అధికారులు ప్రభాకర్ రావు, రాధాకృష్ణ రావు అమెరికా వెళ్లినట్ల్లు గుర్తించారు. ప్రభాకర్ రావుని విచారిస్తే అప్పటి ముగ్గురు రావులు, అప్పటి బీసీ మంత్రి పాత్రపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Read More: నగదు తనిఖీలతో సామాన్యుల పరేషాన్
అమెరికా నుంచి ప్రణీత్ కుటుంబానికి ఫోన్స్
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు సస్పెండ్ కాగానే అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారు. ఆ వెంటనే ఐ న్యూస్ శ్రవణ్ మామతో పాటు మాజీ పోలీస్ అధికారి రాధాకృష్ణ అమెరికాకు చెక్కేశారు. అయితే, ప్రణీత్ రావుని నేరుగా కాంటాక్ట్ అయ్యేందుకు అతని తండ్రికి ఫోన్స్ చేస్తున్నారు. ప్రణీత్ తండ్రి కిషన్ రావు గతంలో ఫింగర్ ప్రింట్స్ డిపార్ట్మెంట్‌లో చేసి ఉద్యోగ విరమణ చేశారు. ఇప్పుడు తమ పేర్లు ఎక్కడ చెబుతారో, రెండో బ్రాంచ్‌ని టచ్ చేసి విచారిస్తే కుటుంబాలే చిన్నాభిన్నం అవుతాయని, సమాచారాన్ని కిషన్ రావుకి ఫోన్ చేసి మాట్లాడుతున్నట్టు సమాచారం.
బిక్కుబిక్కుమంటున్న అప్పటి సన్నిహితులు
ప్రభుత్వం ఉన్నప్పుడే పైసలు సంపాదించుకోవాలనే అత్యాశ, ఇప్పుడు వారి కుటుంబాలను నిద్ర లేకుండా చేస్తున్నాయి దర్యాప్తు సంస్థలు. కేసీఆర్‌ని ఆయన పార్టీ నేతలను అష్టదిగ్బంధం చేయనున్నట్లు సమాచారం. డబ్బులు, రియల్ ఎస్టేట్ వాటాలతో చాలామంది నేతలు బాగా సంపాదించారు. వారందిరిపై దర్యాప్తు సంస్థలు ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అంతేకాదు, కేసీఆర్‌కు దగ్గరగా ఉండే కంపెనీలపైనా దృష్టి సారించినట్టుగా సమాచారం.
– దేవేందర్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్)