rekha-gupta
జాతీయం

Rekha Gupta: సీఎం పీఠంపై ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే… రేఖా గుప్తాకే దక్కిన చాన్స్

న్యూఢిల్లీ, స్వేచ్ఛ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గ్రాండ్ విక్టరీ సాధించిన 11 రోజుల తర్వాత తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆ పార్టీ సీనియర్ మహిళా నేత, షాలీమార్ బాగ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తా ఖరారయ్యారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం జరిగిన బీజేపీ శాసన సభాపక్ష నేతగా ఆమె ఎన్నికయ్యారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో తీసుకున్న నిర్ణయాన్ని శాసనసభాపక్ష సమావేశంలో ప్రకటించగా ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన 48 మంది ఎమ్మెల్యేలు తమ సమ్మతిని తెలియజేశారు. ఈ సమావేశానికి బీజేపీ అగ్రనేతలు రవిశంకర్ ప్రసాద్, ఓం ప్రకాష్ ధన్‌ఖడ్ పరిశీలకులుగా వ్యవహరించారు. తొలిసారి గెలుపుతోనే ముఖ్యమంత్రి అవకాశం దక్కడంతో రేఖా గుప్తా ఇంటి వద్ద ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఆమె నివాసానికి చేరుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు. బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. బీజేపీ శాసనసభా పక్ష నేతగా, ఢిల్లీ ముఖ్యమంత్రి అవకాశం కల్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పరిశీలకులుగా వ్యవహరించిన రవిశంకర్, ధన్‌ఖడ్, ఇతర పార్టీ కార్యకర్తలు, తనను ఆశీర్వదించిన ప్రతిఒక్కరికీ రేఖా గుప్తా ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందించారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం కార్యక్రమం ఇవాళే (గురువారం) జరగనుంది. రామ్‌లీలా మైదానంలో ఉదయం 10 గంటలకు ఆమె ప్రమాణస్వీకారోత్సవం జరగనుందని బీజేపీ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్ వీకే సక్సెనా రానున్నారు. వీరితో పాటు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, అతిశీలకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి. అలాగే పలు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కొందరు కేంద్ర మంత్రులు కూడా హాజరు కానున్నారు.

ఢిల్లీకి 4వ ‘లేడీ సీఎం’ :

రేఖా గుప్తా ఎంపికతో ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న నాలుగవ మహిళగా ఆమె నిలవనున్నారు. ఢిల్లీలో బీజేపీ చివరిసారి అధికారం చేపట్టిన 1998లో మహిళా ముఖ్యమంత్రి సుష్మా స్వరాజ్ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ తరపున షీలా దీక్షిత్, అనంతరం అనూహ్య పరిణామాల మధ్య ఆప్ తరపున అతిశీ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ప్రస్తుతం 18 రాష్ట్రాలలో బీజేపీ-ఎన్డీయే సారధ్యంలో ప్రభుత్వాలు కొలువై ఉండగా, వాటిలో ఏకైక మహిళా ముఖ్యమంత్రి రేఖా గుప్తా కావడం విశేషం. ఇతర పార్టీల తరపున ఏకైక మహిళా సీఎంగా టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కొనసాగుతున్నారు.

ఎవరీ రేఖా గుప్తా?
రేఖా గుప్తా తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటికీ, ఢిల్లీ రాజకీయాల్లో ఆమెకు సుధీర్ఘ అనుభవం ఉంది. ఢిల్లీ బీజేపీ నేతల్లో కీలక నేతగా ఆమె కొనసాగుతున్నారు. విద్యార్థి దశలోనే ఆమె రాజకీయ అరంగేట్రం మొదలైంది. దౌలత్ రామ్ కాలేజీ స్టూడెంట్ ప్రెసిడెంట్‌గా (1994-95), ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్‌గా (1996-97) కూడా వ్యవహరించారు. బీజేపీలో తన రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే బీజేపీ యువ మోర్చా ఢిల్లీ విభాగానికి సెక్రటరీగా (2003-2004), ఆ తర్వాత బీజేపీ యువమోర్చా నేషనల్ సెక్రటరీగా (2004-2006) క్రియాశీలకంగా వ్యవహరించారు. 2007లో ఢిల్లీలోని ఉట్టారి పిటాంపురం కౌన్సిలర్‌గా గెలిచిన తర్వాత ఆమె రాజకీయ కెరీర్‌లో ఎదుగుదల వేగం పుంజుకుంది. కౌన్సిలర్‌గా వ్యవహరిస్తున్న సమయంలో ఢిల్లీ ఉమెన్ వెల్ఫేర్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ కమిటీ సభ్యురాలిగా వరుసగా రెండేళ్లపాటు పనిచేశారు. ఆ తర్వాత 2009లో బీజేపీలో తన స్థానాన్ని మరింత పెంచేలా బీజేపీ ఢిల్లీ మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ అవకాశం దక్కింది. 2010లో నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఎంపికయ్యారు. ఆ తర్వాత బీజేపీ ఢిల్లీ జనరల్ సెక్రటరీగా రేఖా గుప్తాకు అవకాశం దక్కింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ ఎమ్మేల్యేగా ఆమె గెలిచారు. ఉమెన్ వెల్ఫేర్ కమిటీలో ఉన్నప్పుడు ఆర్థికంగా వెనుకబడి ఉన్నత విద్య అభ్యసించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళా స్టూడెంట్స్‌కు సాయం చేసేందుకుగానూ ‘సుమేధా యోజన’ అనే పథకాన్ని రేఖా గుప్తా ప్రారంభించారు. మహిళా సాధికారత కోసం ఆమె విశేషంగా కృషి చేశారు. వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళల అభ్యున్నతి కోసం పాటుపడ్డారు.

ఇవీ చదవండి :

Cm Yogi: స్నానమే కాదు.. తాగొచ్చు; మృత్యుకుంభ్ వ్యాఖ్యలపై సీఎం యోగి

Delhi Railway Station Stampede: రూల్స్ పాటించి ఉంటే తొక్కిసలాట జరిగేదా?

Cm Siddaramaiah: నో ఎవిడెన్స్… సిద్ధూకి క్లీన్‌చిట్!

 

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?