బెంగళూరు, స్వేచ్ఛ: గతేడాది కర్ణాటకలో సంచలనం సృష్టించిన ముడా (మైసూర్ అర్భన్ డెవలప్‌మెంట్ అథారిటీ) (Muda) భూముల కేటాయింపులో అవకతవకల వ్యవహారంలో బుధవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం సిద్ధరామయ్య (Cm Siddaramaiah), ఆయన సతీమణి పార్వతితో పాటు మరో ఇద్దరికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని కర్ణాటక లోకాయుక్త ప్రకటించింది. ముడా వ్యవహారంలో ఆరోపణలు ప్రైవేటుపరమైనవని, క్రిమినల్ ప్రొసీడింగ్స్ అవసరం లేదని స్పష్టం చేసింది. ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు తగిన రుజువులు లభ్యం కాలేదని, చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘించినట్టు తేలలేదని పేర్కొంది. ‘‘ముడా భూముల వ్యవహారంలో సీఎం సిద్ధరామయ్య, ఇతరులు ఐపీసీ, అవినీతి నిరోధక, బీనామీ లావాదేవీల చట్టం, కర్ణాటక భూసేకరణ చట్టంలోని పలు నిబంధనలను అతిక్రమించారంటూ పిటిషనర్ ఆరోపించారు. కానీ, నేరపూరిత చర్యలకు పాల్పడినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ వ్యవహారంపై తుది నివేదికను న్యాయస్థానానికి అందించనున్నాం’’ అని లోకాయుక్త తన రిపోర్టులో పేర్కొంది. ఈ మేరకు బీ-రిపోర్టుకు త్వరలోనే న్యాయస్థానానికి సమర్పించేందుకు లోకాయుక్త సన్నద్ధమవుతోంది. ముడా భూముల కేటాయింపుల్లో భారీ అవినీతి చోటుచేసుకుందంటూ ఆరోపించిన సామాజిక ఉద్యమకారుడు, జర్నలిస్టు అయిన స్నేహమై కృష్ణకు లోకాయుక్త నోటీసులు పంపించింది. తమ నివేదికను సవాలు చేసేందుకు వారం రోజుల గడువు ఇస్తున్నట్టు పేర్కొంది. ఏమైనా ఆధారాలు ఉంటే వారం రోజుల్లోగా సమర్పించవచ్చని, తమ నివేదికను సంబంధిత మేజిస్టేట్ ముందు సవాలు చేయవచ్చని వివరించింది. అయితే, క్లీన్ చిట్ ఇస్తున్నప్పటికీ 2016-2024 మధ్యకాలంలో ముడా భూముల కేటాయింపును నిశితంగా పరిశీలించనున్నామని పేర్కొంది. ఈ కేసుకు అనుబంధ దర్యాప్తు కొనసాగుతోందని, తదుపరి నివేదికను న్యాయస్థానానికి సమర్పించనున్నట్టు పేర్కొంది. లోకాయుక్త రిపోర్టుపై పిటిషనర్ కృష్ణ స్పందిస్తూ రాజకీయ ప్రభావంతో అందరికీ క్లీన్ చిట్ ఇచ్చారని ఆరోపించారు. సత్యానికి సమాధి కట్టేందుకు సీఎం సిద్ధరామయ్య చేసిన ప్రయత్నాలు విజయవంతం కావని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. న్యాయం ఆలస్యం కావచ్చు కానీ తిరస్కరణకు గురవ్వదని, చివరికి సత్యమే జయిస్తుందని స్నేహమై కృష్ణ వ్యాఖ్యానించారు.
