Ajit Pawar Funeral: విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు ముగిశాయి. బారామతిలోని విద్యా ప్రతిష్టాన్ మైదానంలో అజిత్ పవార్ అంతిమ సంస్కారాలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్, ఉపముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే సహా పలువురు మంత్రులు, రాజకీయ ప్రముఖులు హాజరై అజిత్ పవార్ కు నివాళులు అర్పించారు. మరోవైపు తమ ప్రియతమ నేతను చివరి చూపు చూసుకునేందుకు భారీ ఎత్తున ఎన్సీపీ శ్రేణులు, అభిమానులు తరలి రావడంతో విద్యా ప్రతిష్టాన్ మైదానం కిక్కిరిసిపోయింది.
పార్థివ దేహానికి ఊరేగింపు..
అంతకుముందు ఉదయం 9 గంటల ప్రాంతంలో అజిత్ పవార్ పార్థివ దేహాన్ని ఊరేగింపుగా విద్యా ప్రతిష్టాన్ మైదానానికి తీసుకొచ్చారు. ఈ ఊరేగింపులో వేలాది మంది అభిమానులు, ఎన్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. ‘అజిత్ దాదా అమర్ రహే’ నినాదాలతో మార్మోగించారు. మైదానానికి వెళ్లే క్రమంలో బారామతిలోని ఐదు కీలక ప్రాంతాల గుండా అజిత్ పవార్ దేహాన్ని తీసుకెళ్లాలని తొలుత ఆయన కుటుంబ సభ్యులు భావించారు. అయితే విమాన ప్రమాదంలో శరీరం బాగా దెబ్బతినడంతో.. త్వరితగతిన అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు
విద్యా ప్రతిష్టాన్ మైదానంలో జరిగిన అంత్యక్రియలకు భారీగా తరలివచ్చిన అభిమానులు
అజిత్ పవార్ చితికి నిప్పంటించిన కుమారులు పార్థ్, జయ్
Ajit Pawar's funeral concludes at Vidya Pratishtan Maidan https://t.co/658e7Aa8nF pic.twitter.com/aiBxc4ye9t
— BIG TV Breaking News (@bigtvtelugu) January 29, 2026
మరణంపై అనుమానాలు..
మరోవైపు అజిత్ పవార్ విమాన ప్రమాదంపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ అనుమానాలు వ్యక్తం చేశారు. అజిత్ పవార్ మరణం నేపథ్యంలో నివాళులు అర్పిస్తే సరిపోదని.. ప్రమాద ఘటనపై బహిరంగ దర్యాప్తు జరిపించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా పదే పదే జరుగుతున్న చార్టర్ విమాన ప్రమాదాలను ఈ సందర్భంగా సంజయ్ రౌత్ ఎత్తిచూపారు. ఈ ఘటనలకు సాంకేతిక సమస్యలు, రాడర్ వైఫల్యం కారణమవుతున్నాయా? ఇంకేమైనా ఉందా? అని తేల్చాలని పట్టుబట్టారు.
Also Read: Tirumala Controversy: తిరుమల శ్రీవారి చెంత.. హద్దు దాటిన కొత్త జంట.. భక్తుల తీవ్ర ఆగ్రహం
విమాన ప్రమాదం..
బుధవారం ఉదయం బారామతి విమానాశ్రయంలో సమీపంలో జరిగిన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం చెందారు. విమానం రన్ వేపై దిగేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో సాంకేతిక సమస్య తలెత్తి ఒక్కసారిగా కుప్పకూలినట్లు తెలుస్తోంది. దీంతో భారీగా మంటలు చెలరేగి.. అందులో ప్రయాణిస్తున్న డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా ఆరుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం ముంబయి నుంచి బారామతి వస్తున్న క్రమంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
అజిత్ పవార్.. రాజకీయ నేపథ్యం
అజిత్ పవర్ విషయానికి వస్తే.. ఆయన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మేనల్లుడు. జులై 22, 1959లో మహారాష్ట్ర అహ్మద్ నగర్ లోని డియోలాలి ప్రవారా గ్రామంలో జన్మించారు. 1982లో సర్కారి సహకార సంఘాల (సుగర్ కోఆపరేటివ్ మొదలైనవి) బోర్డు సభ్యుడిగా రాజకీయ ప్రయాణం మెుదలు పెట్టారు. తరువాత పూణే డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడిగా 16 సంవత్సరాలు సేవలందించారు. 1991లో మొదటిసారిగా బారామతి నుంచి మహరాష్ట్ర శాసన సభకు (MLA) ఎన్నికయ్యారు. ఆ తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వంలో అనేక కీలక పదవులు అనుభవించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అత్యధికసార్లు (6 సార్లు) పని చేశారు.

