Tirumala Controversy: దేశంలోని అతి పవిత్రమైన పుణ్య క్షేత్రాల్లో తిరుమల శ్రీవారి ఆలయం ఒకటి. ప్రపంచం నలుమూలల నుంచి శ్రీవారి భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామి వారికి మెుక్కులు చెల్లించుకుంటారు. కలియుగ వైకుంఠంగా పిలువబడే శ్రీవారి ఆలయ పరిసరాల్లో భక్తులు ప్రవర్తించాల్సిన తీరుకు సంబంధించి టీటీడీ ఇప్పటికే కొన్ని నిబంధనలు విధించింది. అయితే అవి తరుచూ ఉల్లంఘనలకు గురికావడం భక్తులను తీవ్ర ఆగ్రహానికి లోను చేస్తోంది. తాజాగా ఓ కొత్త జంట.. శ్రీవారి ఆలయం ముందు హద్దుమీరి ప్రవర్తించడం విమర్శలకు తావిస్తోంది.
అసలేం జరిగిందంటే?
తిరుమలలో కొందరు భక్తులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. టీటీడీ నిబంధనలను బేఖాతరు చేస్తూ.. పవిత్రమైన పుణ్యం స్థలంలో తమ ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారు. తాజాగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ కొత్త జంట.. ఆలయం ముందుకు ఫొటో షూట్ నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. బుధవారం ఉదయం పెళ్లి దుస్తుల్లో ఉన్న ఓ జంట.. స్వామివారి గొల్ల మండపానికి అతి సమీపంలో ఫొటోలు దిగింది. నుదిటిపై ముద్దులు పెట్టుకుంటూ ఫొటోలు, వీడియోలకు ఫోజు ఇచ్చారు. అంతటితో ఆగకుండా ప్రత్యేక లైట్ల వెలుగులో గొల్లమండపం నుంచి అఖిలాండం వరకూ ఫొజులు ఇచ్చుకుంటూ నడుస్తూ.. తోటి భక్తులను ఇబ్బందులకు గురిచేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Couple Caught Kissing During Photo Shoot Outside #Tirumala Temple
తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఫొటో షూట్, రీల్స్ చేయడం నిషిద్ధం. భక్తులకు వివిధ రూపాల్లో టీటీడీ అవగాహన కల్పిస్తోంది. అయినప్పటికీ కొందరు పట్టించుకోవడం లేదు. తాజాగా బుధవారం ఓ నూతన జంట ఆలయం ముందు ఫొటో షూట్ చేశారు.… pic.twitter.com/nGWaophW5k
— Milagro Movies (@MilagroMovies) January 29, 2026
నెటిజన్లు ఫైర్..
సాధారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఇలాంటి ఫొటో షూట్స్, రీల్స్ చేయడంపై నిషేధం అమల్లో ఉంది. అలాగే రాజకీయ ప్రసంగాలను సైతం టీటీడీ (TTD) గతంలోనే నిషేధించింది. అయినప్పటికీ కొందరు హద్దు మీరి ఇలా ప్రవర్తించడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జంట ఫొటో షూట్ వైరల్ కావడంతో.. నెటిజన్లు సైతం మండిపడుతున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో ఒక్కరు కూడా ఈ ఫొటో షూట్ అడ్డుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా టీటీడీ, విజిలెన్స్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Medaram Maha Jatara 2026: మేడారానికి పోటెత్తిన భక్తులు.. బైక్పై తిరిగిన మంత్రులు.. ఏర్పాట్లు పరిశీలన
గతంలో దువ్వాడ జంట సైతం..
2024 అక్టోబర్ నెలలో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట సైతం ఈ విధంగానే ఫొటో షూట్ నిర్వహించి తీవ్ర విమర్శల పాలైంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం దువ్వాడ జంట.. అక్కడే మాడ వీధుల్లో తిరుగుతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. రీల్స్ సైతం చేశారు. ఆ వీడియోలు నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యాయి. అంతటితో ఆగకుండా ఆలయ పరిసరాల్లోనే మీడియాతో మాట్లాడి.. తమ వ్యక్తిగత వివరాలను పంచుకున్నారు. శ్రీవారి గుడిలో వ్యక్తిగత విషయాలు మాట్లాడటం, ఫోటో షూట్ చేయడంపై ఆంక్షలు ఉన్న నేపథ్యంలో.. అప్పట్లోనే తిరుమల వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో వీరిపై కేసు కూడా నమోదైంది.

