GHMC Plans: గ్రేటర్ హైదరాబాద్ విస్తీర్ణం ఎప్పటికపుడు పెరుగుతున్నా, దానికి తగినట్టుగానే వాహానాల సంఖ్య కూడా పెరుగుతుండటం, రోడ్లపై అక్రమ పార్కింగ్ లు రావటంతో మహానగరంలో పార్కింగ్ సమస్య తీవ్ర రూపం దాల్చుతుంది. ఇంట్లో నుంచి వెహికల్ తీసుకుని బయటకొస్తే ఎక్కడికి వెళ్తున్నామన్నా విషయం కన్నా మనం వెళ్లే చోట వాహానాల పార్కింగ్ ఎక్కడ అందుబాటులో ఉంది? అన్న విషయంపైనే ముందుగా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ప్రైవేటు పార్కింగ్ ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా ఛార్జీలు వడ్డిస్తుండటంతో వాహనదారులు బేజారవుతున్నారు.
పార్కింగ్ కాంప్లెక్స్ లను నిర్మించాలి
పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ అన్ని మార్గాల్లో ఆలోచన చేస్తుంది. తొలుత సిటీలోని రద్దీ ప్రాంతాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ లను నిర్మించాలని నిర్ణయించింది. కానీ ఖాళీ స్థలాలు అందుబాటులో లేకపోవటంతో కేబీఆర్ పార్కు వద్ద జీహెచ్ఎంసీ సరి కొత్త ఆలోచనతో మెకనైజ్డ్ మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెల్సిందే. కేవలం 405 గజాల స్థలంలో ఏకంగా 72 కార్లను పార్కింగ్ చేసుకునేలా ఆటోమెటిక్ మెకనైజ్డ్ పార్కింగ్ వ్యవస్థ అందుబాటులోకి రావటం, విజయవంతంగా పని చేస్తుండటంతో అలాంటి పార్కింగ్ వ్యవస్థలను నగరంలోని కొన్ని పార్కులు, మరి కొన్ని షాపింగ్ మాల్స్ తో పాటు జస సంచారమెక్కువగా ఉండే మార్కెట్లు వంటి ప్రాంతాలతో పాటు మొత్తం 30 ప్రాంతాల్లో అందుబాటులోకి తేవాలని జీహెచ్ఎంసీ నిర్ణయించినట్లు సమాచారం.
మల్టీ లెవెల్ పార్కింగ్
ఇందులో భాగంగా కొద్ది నెలల క్రితం అధికారులు దోమల్ గూడలోని ఇందిరాపార్కు, మాసాబ్ ట్యాంక్ లోని చాచా నెహ్రూపార్క్ లో ఇలాంటి పార్కింగ్ వ్యసస్థలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. దీనికి తోడు చార్మినార్ కు సమీపంలోని ఖల్వత్ ప్రాంతంలో కూడా ఇలాంటి పార్కింగ్ వ్యసస్థలను అందుబాటులోకి తేవాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నట్లు సమాచారం. ఖిల్వత్ లో మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని జీహెచ్ఎంసీ సుమారు రెండు దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు. శాశ్వత పార్కింగ్ కాంప్లెక్సు నిర్మించేందుకు అవసరమైన స్థలం లభ్య కాకపోవటంతో పెండింగ్ లో ఉన్న ఈ ప్రతిపాదనను కేబీఆర్ పార్కు వద్ద ఏర్పాటు చేసిన మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థ కిందకు బదలాయించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మూడు ప్రాంతాల్లో స్థలాలు ఖరారు చేసిన అధికారులు మిగిలిన మరో 27 ప్రాంతాల్లో స్థలాల అన్వేషణలో ఉన్నట్లు తెలిసింది.
ఎలాంటి ఆర్థిక భారం లేకుండా
ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితుల దృష్టా కార్పొరేషన్ పై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా బిల్ట్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ పోర్ట్ (బీఓటీ) పద్దతిలో ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ పై గానీ, సర్కారుపై గానీ పైసా ఆర్థిక భారం పడకుండా వీటిని ఏర్పాటు చేసేలా జీహెచ్ఎంసీ ప్రతిపాదనలను సిద్దం చేసింది. జీహెచ్ఎంసీకి చెందిన లేక పార్కుల్లోని స్థలాలను కొంత మేరకు ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే బీఓటీ పద్దతిలో ఏర్పాటు చేసి రానున్న పది, పదిహేనేళ్ల వరకు నిర్వహణ బాధ్యతలను కూడా సదర సంస్థ చేపట్టి, ఆ తర్వాత జీహెచ్ఎంసీకి అప్పగించే అవకాశమున్నందున సిటీలో రోజురోజుకి పెరుగుతున్న పార్కింగ్ సమస్యకు ఇదో చక్కటి పరిష్కార మార్గంగా అధికారులు భవిస్తున్నారు. సెన్సార్లు, ఆటోమేటెడ్ లిఫ్ట్ సిస్టమ్స్ వంటి టెక్నాలజీతో వాహనాలను తక్కువ సమయంలో పార్క్ చేసే వీలుంటుంది.
నాంపల్లిలో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్ రెడీ
నగరంలో పార్కింగ్ సమస్య పరిష్కారానికి హైదరాబాద్ మెట్రో రైల్ చేసిన ప్రయత్నం ఫలించింది. పూర్తి ఆటోమేటెడ్, కంప్యూటరైజ్డ్ మల్టీ లెవల్ కార్ పార్కింగ్ పనులు దాదాపుగా పూర్తయి, ప్రారంభానికి సిద్దంగా ఉంది. నగరంలో అత్యంత ట్రాఫిక్ సమస్య నెలకున్న నాంపల్లి లో ఈ పార్కింగ్ కాంప్లెక్స్ ను పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్ (పీపీసీ) విధానంలో ఈ ప్రాజెక్టుని రూ. 80 కోట్ల ప్రైవేట్ పెట్టుబడితో నిర్మించారు. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో మన దేశంలో ప్ర్రపధమంగా జర్మన్ పార్కింగ్ విధానంలో, తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలు పార్కింగ్ చేసేలా ఈ కాంప్లెక్స్ ను నిర్మించారు. నాంపల్లి మెట్రో రైల్ స్టేషన్ కు సమీపంలో హెచ్ యం ఆర్ కు చెందిన అర ఎకరం స్థలంలో 15 అంతస్తులుగా ఈ కాంప్లెక్స్ ను నిర్మించారు.
200 ద్విచక్రవాహనాలు పార్కింగ్ చేసే అవకాశం
ఇందులో 10 అంతస్తుల్లో వాహనాల పార్కింగ్ సౌకర్యం, ఐదు అంతస్తుల్లో కమర్షియల్ షాపులు, రెండు స్ర్కీన్ లతో కూడిన ఒక ఫిల్ము థియేటర్ ఉన్నాయి. మొత్తం ఒక లక్ష నలభై నాలుగు వందల చదరపు అడుగుల నిర్మిత ఏరియాలో 68 శాతం పార్కింగ్ కోసం, మిగిలిన 32 శాతం వాణిజ్య సదుపాయాలకు కేటాయించినట్లు తెలిసింది. పార్కింగ్ జాగాలో 250 కార్లు, 200 ద్విచక్రవాహనాలు పార్కింగ్ చేసే అవకాశం ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. పీపీపీ విధానంలో ఓ ప్రైవేటు కంపెనీ 50 సంవత్సరాల రాయితీ కాలంతో ఈ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టినట్లు తెలిసింది. కోవిడ్ తీవ్రత, డెట్ ఫైనాన్సింగ్ సమస్యలు, గ్లోబల్ సప్లయ్ చైన్ అంతరాయాలు తదితర కారణాల వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగినా, ప్రస్తుతం ప్రారంభానికి సిద్దమైనట్లు సమాచారం. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదగా ఈ ఆధునిక పార్కింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు మెట్రో రైలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.
Also Read: GHMC: స్టాండింగ్ కమిటీ ముహూర్తం ఖరారు చేసేందుకు.. పాలక మండలి మల్లగుల్లాలు

