Dalit Welfare Land: మేడ్చల్ 297 సర్కిల్ పరిధిలోని ఇందిరా నగర్ కాలనీలో గల సామూహిక అంబేద్కర్ భవనానికి కేటాయించిన భూమిని కబ్జా చేయకుండా కాపాడాలని కాలనీవాసులు అధికారులను కోరారు. 1992లో అప్పటి మేడ్చల్ సర్పంచ్ శ్రీ చీదు దేవేందర్ రెడ్డి(Dhevendar Reddy) గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి దళితుల అభ్యున్నతి కోసం గ్రామ కంఠంలో 345 గజాల స్థలాన్ని డా. బాబాసాహెబ్ అంబేద్కర్ భవనం కోసం కేటాయించారు. అనంతరం 1997లో 80 గజాల విస్తీర్ణంలో ప్రభుత్వ నిధులతో శాశ్వత భవనం నిర్మించగా, అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి దేవేందర్ గౌడ్ భవనాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి మండలంలోని దళితులు వివిధ సమావేశాలు, కార్యక్రమాలకు అంబేద్కర్ భవనాన్ని వినియోగించుకుంటూ వస్తున్నారు. 345 గజాల స్థలంలో భవన నిర్మాణం చేపట్టిన తరువాత మిగిలిన స్థలాన్ని కాలనీవాసులు పెళ్లిళ్లు, శుభకార్యాలు తదితర కార్యక్రమాలకు ఉపయోగించుకుంటున్నారు.
అక్రమార్కులు కబ్జా..
గత కొన్ని రోజులుగా కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలతో ఆ స్థలం తమదేనని పేర్కొంటూ జేసీబీ(JCB)తో స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించగా, కాలనీవాసులు వారిని అడ్డుకొని వెనక్కి పంపించారు. ఈ ఘటనపై స్పందించిన కాలనీవాసులు మాట్లాడుతూ, దళితుల అభివృద్ధి కోసం కేటాయించిన భూమిని అక్రమార్కులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కబ్జాకు ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకొని అంబేద్కర్ భవనానికి సంబంధించిన స్థలాన్ని రక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కాలనీవాసులు మేడ్చల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ,మేడ్చల్ డివిజన్ డిప్యూటీ కమిషనర్, మేడ్చల్ తహసిల్దార్ భూపాల్ కు వినతి పత్రం అందజేశారు. దళితుల అభ్యున్నతి కోసం కేటాయించిన భూమిని సంరక్షించాలని వారు కోరారు. అధికారులు స్పందిస్తూ త్వరలోనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీడిపల్లి శివ, రామకృష్ణ, డి. రాములు, నర్సింగరావు, మల్లేష్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పరశురాం, ఆనంద్, విగ్నేష్, మైపాల్, శ్రీను, మహేష్, రావల్ కోల్ మహేష్, నాగరాజు తదితర కాలనీవాసులు పాల్గొన్నారు.
Also Read: CPI Party: ఎదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో.. సీపీఐ పార్టీ ఒంటరిగానే బరిలోకి : మొహమ్మద్ మౌలానా!

