Aroori Ramesh: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారతీయ జనతా పార్టీకి గట్టి షాక్ తగిలింది. పార్టీ కీలక నేత, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ (Aruri Ramesh) బీజేపీకి రాజీనామా చేశారు. త్వరలోనే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లో చేరనున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు ఆరూరి రమేష్ విడుదల చేసిన ప్రకటనలో బీజేపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రయాణంలో తనకు సహకరించిన బీజేపీ పెద్దలు, నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
త్వరలో బీఆర్ఎస్‌లోకి
భారతీయ జనతా పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. ఇన్ని రోజులు నాకు అండగా నిలిచిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు. భారత రాష్ట్ర సమితి అధిష్టానం నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు నా ఇంటి పార్టీ అయిన బీఆర్ఎస్‌లోకి త్వరలో నా అనుచరులు, అభిమానులు, పలువురు నాయకులతో కలిసి భారీ ఎత్తున చేరాలని నిర్ణయించుకున్నాను అని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆరూరి రమేష్ నిర్ణయం బీజేపీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది.
Also Read: Telangana Govt: జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. సామాన్య పరిపాలన శాఖ నుంచి కొత్త జీవో రిలీజ్!
బీజేపీకి ఇది తీవ్ర ఎదురుదెబ్బ
ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతానికి ప్రయత్నిస్తున్న బీజేపీకి ఇది తీవ్ర ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, బీఆర్ఎస్‌కు ఇది కీలక బలంగా మారుతుందని చెబుతున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో ఆరూరి రమేష్‌కు ఉన్న రాజకీయ పట్టును దృష్టిలో ఉంచుకుంటే, ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉందని సమాచారం. దీని ప్రభావం రాబోయే మున్సిపల్ ఎన్నికలపై స్పష్టంగా పడనుందని అంచనా. మొత్తానికి, ఎన్నికల వేళ చోటుచేసుకున్న ఈ రాజకీయ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. బీజేపీ నుంచి బీఆర్ఎస్‌కు జరుగుతున్న ఈ కీలక మార్పు రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణాలను ఎలా మార్చబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read: Satyam Scam: సత్కం స్కాంలో బినామీ సునామీ.. స్వేచ్ఛ కథనాలతో బయటకొస్తున్న బాధితులు!

