Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్ నిబంధనలు-2025లో కీలక సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జారీ చేసిన జీవో 252లో సవరణలు చేస్తూ, సామాన్య పరిపాలన శాఖ జీవో 103ని విడుదల చేసింది. ఈ కొత్త సవరణల ద్వారా డెస్క్ జర్నలిస్టులకు, వివిధ కేటగిరీల పత్రికలకు పెద్ద ఊరట లభించనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ప్రియాంక సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా మహిళా జర్నలిస్టులకు ఈ కొత్త నిబంధనల్లో పెద్దపీట వేశారు. ప్రతి మీడియా సంస్థ తమ డెస్క్ జర్నలిస్టుల విభాగంలో తప్పనిసరిగా 33 శాతం మహిళలను నియమించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్రిడిటేషన్ కార్డుల కేటాయింపులో కూడా మహిళా జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
సర్క్యులేషన్ ఆధారంగా కార్డులు
రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్ కమిటీలో ‘ప్రెస్ క్లబ్ హైదరాబాద్’ ప్రతినిధితో పాటు, ‘బిగ్ డైలీ న్యూస్ పేపర్’ నుంచి డెస్క్ జర్నలిస్ట్ ప్రతినిధికి కూడా సభ్యత్వం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పత్రికల సర్క్యులేషన్ ఆధారంగా అదనపు కార్డులను కేటాయించనున్నారు. 2.5 లక్షల కంటే ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రికలకు, 1.50 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న మండలాల్లో ఒక అదనపు అక్రిడిటేషన్ కార్డు మంజూరు చేస్తారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో స్పోర్ట్స్, కల్చర్, ఫిల్మ్ విభాగాల్లో అదనపు కార్డులు లభించనున్నాయి. గత జీవోలో ఉన్న మీడియా కార్డ్ అనే పదాన్ని ఇకపై ‘అక్రిడిటేషన్ కార్డ్’గా వ్యవహరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉర్దూ పత్రికల కేటగిరీలోనూ కీలక సవరణలు చేశారు.
Also Read: Telangana Govt: విద్యుత్ సబ్సిడీల్లో అన్నదాతదే అగ్రభాగం.. వ్యవసాయ రంగానికి రూ.13,499 కోట్లు!

