Telangana Govt: రాష్ట్రంలో అమలు అవుతున్న వివిధ విద్యుత్ సబ్సిడీ పథకాల్లో వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నది. రాష్ట్ర ఖజానా నుంచి విద్యుత్ రాయితీల కోసం వెచ్చిస్తున్న నిధుల్లో సింహభాగం రైతులకు ఉచిత విద్యుత్ అందించడానికే కేటాయిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో విద్యుత్ సబ్సిడీలకు సంబంధించి ఆసక్తికరమైన గణాంకాలు వెల్లడయ్యాయి. తాజాగా వెల్లడైన గణాంకాల ప్రకారం, ప్రభుత్వం మొత్తం రూ.15,946 కోట్లను విద్యుత్ సబ్సిడీల కోసం ఖర్చు చేయగా అందులో కేవలం వ్యవసాయ రంగానికే రూ.13,499 కోట్లు(సుమారు 85 శాతం) కేటాయించడం విశేషం. సాగును పండుగ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకం రైతులకు కొండంత అండగా నిలుస్తున్నది. గత ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం, పెరిగిన విద్యుత్ వినియోగానికి అనుగుణంగా ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సిన సబ్సిడీ భారం కూడా పెరిగింది. అయినప్పటికీ, రైతులపై పైసా భారం పడకుండా ప్రభుత్వం ఈ భారీ మొత్తాన్ని భరిస్తున్నది.
Also Read: Telangana Govt: విద్యుత్ రంగంలో భారీ సంస్కరణలు.. మూడో డిస్కమ్‌కు సర్కార్ గ్రీన్ సిగ్నల్!
8 రకాల పథకాలకు రూ.2,447 కోట్ల ఖర్చు
వ్యవసాయ రంగం కాకుండా, రాష్ట్రంలో అమలు అవుతున్న మరో 8 రకాల విద్యుత్ రాయితీ పథకాలకు కలిపి ప్రభుత్వం రూ.2,447 కోట్లు ఖర్చు చేసింది. గృహ జ్యోతి ద్వారా పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. హెయిర్ సెలూన్లకు, ధోబీ ఘాట్లకు, లాండ్రీ షాపులు, స్పిన్నింగ్ మిల్లులు, పవర్ లూమ్స్, ప్రభుత్వ విద్యాసంస్థలకు, గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్‌ను అందజేస్తున్నది. మొత్తం విద్యుత్ రాయితీ కింద రూ.15,946 కోట్లు ఖర్చు చేయగా అందులో వ్యవసాయానికే రూ.13,499 కోట్లు వెచ్చించింది. మిగిలిన నిధులను విద్యుత్ శాఖ ఇతర ప్రాధాన్యత పథకాలకు సర్దుబాటు చేస్తున్నది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాను కొనసాగించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిధులను కేటాయిస్తున్నది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలకమైన వ్యవసాయ రంగాన్ని నిలబెట్టేందుకు ప్రభుత్వం ఇంత భారీ మొత్తంలో విద్యుత్ రాయితీలు ఇస్తుండటంపై రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే, పెరుగుతున్న సబ్సిడీ భారాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ వినియోగంలో పొదుపు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read: Telangana Govt: మహిళా సంఘాలకే విత్తన బాధ్యతలు? ఆర్ధికంగా ప్రోత్సహించాలనే యత్నం!

