Telangana Govt: తెలంగాణ సీడ్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ త్వరలో మరో కీలక నిర్ణయం తీసుకోబోతుంది. మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వ విత్తనాలను విక్రయించే బాధ్యతను అప్పగించనున్నట్లు సమాచారం. గ్రామాల్లో విక్రయకేంద్రాలు ఏర్పాటు చేయించి అమ్మితే కొంత కమిషన్ సైతం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే కార్పొరేషన్ సైతం విత్తనాల విక్రయించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో మహిళలను ఆర్థికంగా బలోపేతానికి మహిళా సంఘాలు కీలక భూమిక పోషిస్తున్నాయి.
రైతులు సైతం కొనుగోలు చేసే అవకాశం
ప్రస్తుతం సుమారు65 లక్షల మంది మహిళలు మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వివిధ రంగాల్లోనూ రాణిస్తున్నారు. దీనిని పరిగణలోకి తీసుకొని విత్తనాభివృద్ధి సంస్థ ప్రభుత్వ సీడ్స్ ను విక్రయించాలని భావిస్తుంది. ప్రభుత్వ సీడ్స్ నాణ్యతను వివరించడంతో పాటు రైతులు సైతం కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మహిళా సంఘాల్లోని సభ్యులంతా రైతు కుటుంబానికి చెందినవారే ఉండటంతో ప్రభుత్వం నిర్దేశించిన సీడ్స్ విక్రయ టార్గెట్ ను సైతం రీచ్ అయ్యే అవకాశం ఉంటుందని సమాచారం. అంతేగాకుండా ప్రైవేట్ సీడ్ కు ధీటుగా ప్రభుత్వ సీడ్ సైతం దిగుబడి వస్తుంది. అయినా ప్రచారం సరైన రీతిలో లేకపోవడంతో ప్రైవేటు వైపు రైతులు మొగ్గుచూపుతున్నారు.
ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం
దానికి చెక్ పెట్టాలంటే మహిళా సంఘాలకు ఆ బాధ్యతను అప్పగిస్తేనే సరైనదని భావించి అందుకోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఆమోదంరాగానే విక్రయ బాధ్యతను అప్పగించబోతున్నట్లు తెలిసింది. మహిళా సంఘాలు విత్తనాలను విక్రయిస్తే కమిషన్ సైతం ఇచ్చేందుకు కార్పొరేషన్ సిద్ధమవుతుంది. ప్రైవేటు డీలర్లకు ఏవిధంగానైతే విక్రయిస్తే కమిషన్ ఇస్తుందో అదే విధంగా మహిళా సంఘాలకు సైతం కమిషన్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఎంత కమిషన్ ఇవ్వాలనేదానిపై కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
Also Read: Telangana Govt: గ్రామీణ వైద్యులకు గుడ్ న్యూస్.. ఏజెన్సీల్లో పనిచేసే డాక్టర్లకు స్పెషల్ ఇన్సెటీవ్ !
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం
ఇది సైతం మహిళలకు ఆర్థికచేయూత ఇచ్చినట్లు అవుతుందని కార్పొరేషన్ భావిస్తుంది. గ్రామాల్లోనే విక్రయకేంద్రాలు ఏర్పాటు చేసి ఆ బాధ్యతను అప్పగించబోతున్నట్లు సమాచారం.ఇప్పటికే రైతులను దృష్టిలో ఉంచుకొని పీఏసీఎస్, డీసీఎంఎస్, ఎఫ్పీఓ లతో విక్రయాలు చేయిస్తున్నప్పటికీ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం చేరడం లేదని సమాచారం. 8శాతం డిస్కౌంట్ ఇస్తున్నప్పటికీ డీలర్లు విక్రయాలు చేయడం లేదని ప్రభుత్వ దృష్టికి వచ్చింది. దీంతో మహిళా సంఘాలతో విక్రయిస్తేనే మేలని, రైతులు సైతం ప్రభుత్వ సీడ్స్ సాగుచేస్తే నష్టాలు రావని, ప్రభుత్వ భరోసా ఉంటుందని విస్తృత ప్రచారం సైతం చేయించబోతున్నట్లు సమాచారం. మహిళా సంఘాలు విక్రయిస్తే కమిషన్ సైతం నేరుగా వారి ఖాతాల్లో జమచేయనున్నట్లు తెలిసింది.
పెట్రోల్ బంకులను కూడా నడిపే స్థాయికి ప్రభుత్వం
ఇప్కపటికే కాంగ్రెస్ ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం వివిధ వివిధ పథకాలను ప్రవేశపెడుతుంది. మునుపెన్నడూ లేని విధంగా మహిళలు సొంతగా ఆర్టీసీకే బస్సులను అద్దె కివ్వటంతో పాటు, తామే పెట్రోల్ బంకులను కూడా నడిపే స్థాయికి ప్రభుత్వం ప్రోత్సహించింది. ఇందిరా జీవిత బీమా పథకం, ఇందిరా రుణ బీమా పథకం శిల్పారామం వద్ద డ్వాక్రా మహిళా బజార్ ఏర్పాటు ఇందిరా మహిళా డెయిరీ ప్రాజెక్టు, మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్ కేంద్రాలు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు. మహిళల భద్రత కోసం టీ-సేఫ్ లాంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రణాళికలు రూపొందిస్తున్నాం.. అన్వేష్ రెడ్డి
ప్రభుత్వం నాణ్యమైన సీడ్స్ ను ఉత్పత్తి చేస్తుంది. మార్కెట్ లోనూ అందుబాటులో ఉంచింది. అయిన సరైన ప్రచారం లేకపోవడం, డీలర్లు ప్రైవేటు విత్తనాల విక్రయానికే మొగ్గుచూపుతుండటంతో టార్గెట్ రీచ్ కాలేకపోతున్నాం. అందుకే మహిళా సంఘాలతో గ్రామాల్లో ప్రభుత్వ సీడ్స్ ను విక్రయించేలా ప్లాన్ చేస్తున్నాం. రైతుల్లోనూ ఒక భరోసా కల్పించేందుకు సిద్ధమవుతున్నాం. ప్రభుత్వ సీడ్ విక్రయిస్తే మహిళా సంఘాలకు కమిషన్ సైతం ఇస్తాం. వారికి ఆర్థిక భరోసాకు దోహదపడుతుంది. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని విక్రయ బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమవుతున్నాం.
