Telangana Govt: గ్రామీణ వైద్యులకు ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనున్నది. ఏజెన్సీలో పనిచేసే డాక్టర్లకు స్పెషల్ ఇన్సెటీవ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లోని మెడికల్ కాలేజీలను గుర్తించారు. రాష్ట్రంలో ట్రైబల్ జనాభా ఎక్కువగా ఉన్న 5 జిల్లాల్లోని మెడికల్ కాలేజీల నుంచి డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్ నివేదిక కోరారు. అతి త్వరలోనే భద్రాద్రి కొత్తగూడెం, కొమరం భీం ఆసిఫాబాద్, ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఫ్యాకల్టీకి ఈ 50 శాతం ఇన్సెంటీవ్స్ అందనున్నాయి. అయితే ఇది మంచి నిర్ణయమే అయినప్పటికీ, కేవలం ట్రైబల్ ఏరియానే కాకుండా, రిమోట్ ప్రతిపాదికన ఇన్సెంటివ్ లు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ (టీజీజీడీఏ) అధ్యక్షుడు డాక్టర్ నరహరి, ప్రధాన కార్యదర్వి డాక్టర్ లాలూ ప్రసాద్, ట్రెజరర్ డాక్టర్ రవూప్ లు కోరారు.
గతంలో క్యాబినెట్ సబ్ కమిటీ
రిమోట్ ఏరియాల్లో ఉన్న అన్ని కొత్త మెడికల్ కాలేజీలకు అలవెన్సులు ఇస్తామని గతంలో క్యాబినెట్ సబ్ కమిటీ లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కేవలం ట్రైబల్ అని పేరు చెప్పి సగం మందికి ఎగ్గొట్టడం సరైన నిర్ణయం కాదని మండిపడ్డారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న కష్టాలే మిగతా చోట్ల కూడా ఉన్నాయని, ఈ నేపథ్యంలో మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రామగుండం (పెద్దపల్లి), నాగర్ కర్నూల్ కాలేజీలను కూడా ఈ జాబితాలో చేర్చాలన్నారు. కేబినెట్ హామీ మేరకు 10 కొత్త కాలేజీలకూ 50 శాతం ప్యాకేజీ వర్తింపజేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పెరగనున్న సౌలత్ లు? బేసిక్ పేలో
ఇప్పటి వరకు ఏజెన్సీ ఏరియాల్లో పనిచేయాలంటే డాక్టర్లు వెనకడుగు వేస్తూ వచ్చారు. అర్బన్, రూరల్, ట్రైబల్ ఏరియాల్లో ఒకే విధమైన వేతనాలు ఉండటంతో చాలా మంది డాక్టర్లు అర్బన్, సెమీ అర్బన్ ల వైపే మొగ్గు చూపుతూ వస్తున్నారు. దీని వలన గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు కుంటిపడుతున్నాయి. గతంలో ఇదే అంశంపై డాక్టర్ల సంఘాలు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశాయి. అలవెన్స్ ఇవ్వడం వలన ప్రజలకూ క్వాలిటీ డాక్టర్లు అందుబాటులో ఉంటారని వివరించారు. ఈ అంశంపై ప్రభుత్వం పలు దఫాలుగా అధ్యయనం చేసి తుది నిర్ణయం తీసుకున్నది. గిరిజన జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేసే ప్రొఫెసర్లు, టీచింగ్ ఫ్యాకల్టీకి వారి బేసిక్ పే లో ఏకంగా 50 శాతం అదనంగా ఇన్సెంటివ్ అందనున్నాయి.
