Telangana Govt: రాష్ట్రంలో మొత్తం 6,24,544 ఎకరాల్లో మొక్కజొన్న సాగు అయిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సాగు పరిస్థితులు మెరుగవ్వడంతో సగటున ఎకరాకు 18.50 క్వింటల్ దిగుబడి వచ్చి, మొత్తం 11.56 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి అవుతుందని అంచనా వేసినట్టు తెలిపారు. మొక్కజొన్న పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి తుమ్మల, అధికారులు గురువారం భేటీ అయ్యారు. మద్ధతు ధరకు మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడంపై చర్చించారు. మొక్కజొన్న పంటకు కేంద్రం మద్ధతు ధర ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు కొనుగోళ్లకు ముందుకు రాకపోవడంతో సీఎం సూచనతో రాష్ట్ర ప్రభుత్వమే మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు తుమ్మల ప్రకటించారు. గతేడాది కూడా కేంద్రం కేవలం మద్ధతు ప్రకటనకే పరిమితమై, ఎలాంటి కొనుగోళ్లు చేయకపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే దాదాపు రూ.535 కోట్లు ఖర్చుచేసి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. ఈ సీజన్‌లో 8.66 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను కొనుగోలు చేయాల్సి ఉంటుందని అంచనా వేశామని తెలిపారు.
ప్రభుత్వంపై రూ.2,400 కోట్ల భారం
సెప్టెంబర్ 3వ వారం నుంచే మార్కెట్‌లోకి భారీగా మొక్కజొన్న పంట రావడంతో ధరలు తగ్గిపోయాయని తుమ్మల తెలిపారు. ప్రస్తుత మార్కెట్ ధరలు కేంద్రం ప్రకటించిన ఎంఎస్పీ రూ.2,400 క్వింటల్ కన్నా రూ.441 తక్కువగా రూ.1,959 ఉందని, దీంతో మొక్క రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. 8.66 లక్షల మెట్రిక్ టన్నులు పంటను కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2,400 కోట్ల భారం పడుతుందని, అయినప్పటికీ రైతుల ప్రయోజనార్థం మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. రైతులు తమ ఉత్పత్తిని సమీపంలోని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి, మద్దతు ధర పొందవలసిందిగా సూచించారు. రాష్ట్రంలోని మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులు ఈ మద్దతు ధర అవకాశాన్ని వినియోగించుకొని, తక్కువ ధరలకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్మకాలు చేయకుండా, మార్క్ ఫెడ్ నిర్వహిస్తున్న ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకోవాలని కోరారు.
25 శాతం సీలింగ్‌తో సమస్య
పీఎస్ఎస్ స్కీం కింద కేంద్రం కొనుగోలు చేసే పెసర, మినుము, సోయా చిక్కుడు, కంది, వేరుశనగ లాంటి పంటలపై కేంద్రం 25 శాతం సీలింగ్ విధించిందని, రైతులు పండించిన పంటలను పూర్తిగా కొనుగోలు చేయడానికి ఇది అడ్డంకిగా మారుతున్నదని ఢిల్లీ పెద్దలకు వివరించినట్లు మంత్రి తెలిపారు. మొక్కజొన్న, జొన్న లాంటి పంటలకు కేవలం మద్దతు ప్రకటనలకే పరిమితం కాకుండా ధరలు పడిపోయినప్పుడు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తే వారు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉండదని అన్నారు.
Also Read: Nobel Peace Prize 2025: 7 యుద్ధాలు ఆపానన్నారు.. అప్లికేషన్ పెట్టడమే చేతకాలేదు.. ట్రంప్‌కి శాంతి లేనట్లే!
రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక – 2035 ఆవిష్కరణ
మరోవైపు, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించిన ‘తెలంగాణ రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక 2035’ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఉద్యాన పంటల ఉత్పత్తిని పెంచేందుకు 2035 వరకు అనుసరించాల్సిన లక్ష్యాలను ఈ ప్రణాళికలో నిర్ధేశించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఈ ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్ రాజిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
