Telangana Govt: చిన్నారుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా పుట్టినప్పటి నుంచి ఐదేళ్ల లోపు పిల్లల్లో తలెత్తే శారీరక, మానసిక ఎదుగుదల లోపాలను ప్రాథమిక దశలోనే గుర్తించి, వారికి సరైన చికిత్స అందించేందుకు వైద్యారోగ్య శాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ఎర్లీ ఇంటర్వెన్షన్’ స్ర్కీనింగ్ పేరిట ప్రోగ్రామ్ చేయనున్నది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
ఏమిటీ ప్రోగ్రామ్?
అనేకమంది పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలు లేదా ఎదుగుదల క్రమంలో వచ్చే మార్పులను తల్లిదండ్రులు సకాలంలో గుర్తించ లేకపోతున్నారు. దీనివల్ల భవిష్యత్‌లో వారు వైకల్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. దీన్ని నివారించేందుకు 0-5 ఏళ్ల మధ్య వయసు ఉన్న ప్రతి బిడ్డను స్ర్కీనింగ్ చేయడమే ఈ ప్రోగ్రామ్ ప్రధాన లక్ష్యం. ఈ పథకంలో భాగంగా జిల్లా కేంద్రాల్లో డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్‌వెన్షనల్ సెంటర్లు కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ కేంద్రాల్లో పిడియాట్రీషియన్లు, ఫిజియోథెరపిస్టులు, స్పీచ్ థెరపిస్టులు, సైకాలజిస్టులు అందుబాటులో ఉంటారు. స్ర్కీనింగ్‌లో లోపాలు ఉన్నట్లు తేలితే, ఆయా సెంటర్లలో పిల్లలకు ఉచితంగా మెరుగైన వైద్యం, థెరపీలు అందిస్తారు. వినికిడి లోపం, మాటలు రాకపోవడం, దృష్టి లోపాలు, బుద్ధిమాంద్యం వంటి 30 రకాల ఆరోగ్య సమస్యలను ఇక్కడ గుర్తిస్తారు.
సమన్వయంతోనే సాధ్యం
ఆరోగ్యశాఖ – అంగన్‌వాడీల తోడ్పాటుతో ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో విజయవంతం కానుంది. ఈ రెండు ప్రధాన శాఖల మధ్య బలమైన సమన్వయంతో ప్రోగ్రామ్‌తో ముందుకు సాగనున్నది. గ్రామాల్లోని పిల్లల వివరాలను సేకరించడం, ఎదుగుదల లోపాలు ఉన్నట్లు అనుమానం ఉన్న పిల్లలను గుర్తించి ఆరోగ్య సిబ్బందికి సమాచారం అందించడం వీరి బాధ్యత. గుర్తించిన పిల్లలకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారిని జిల్లా కేంద్రాల్లోని సెంటర్లకు రిఫర్ చేస్తారు. క్షేత్రస్థాయిలో ఆశాలు, ఏఎన్ఎంలు ఈ ప్రోగ్రాంలో కీళ్లకి పాత్ర పోషిస్తారు. ఎప్పటికప్పుడు పిల్లల బరువు, ఎత్తు, ఇతర ఎదుగుదల సూచీలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తూ ఫాలో-అప్ నిర్వహిస్తారు.
వేలాది మంది పిల్లల జీవితాల్లో వెలుగులు
‘పిల్లల్లో వచ్చే నరాల బలహీనత లేదా శారీరక వైకల్యాలను ఐదేళ్ల లోపు గుర్తిస్తే, వైద్యం ద్వారా 90 శాతం వరకు నయం చేసే అవకాశం ఉంటుంది. ఈ స్ర్కీనింగ్ ప్రోగ్రామ్ వేలాది మంది పిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతుంది’ అని డాక్టర్. రాజీవ్ నాయక్ తెలిపారు. చిన్నారుల ఆరోగ్యమే రాష్ట్ర ప్రగతికి మూలమని నమ్మి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రశంసనీయమన్నారు. ఆరోగ్యశాఖ, అంగన్‌వాడీ కార్యకర్తల అంకితభావంతో తెలంగాణలో ‘వైకల్య రహిత’ బాల్యాన్ని నిర్మించే దిశగా అడుగులు పడుతున్నట్లు డా. రాజీవ్ నాయక్ వివరించారు.
Also Read: Telangana Govt: పాత పద్ధతిలోనే యూనిఫాంలు.. ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు!

