Dog Guards Dead Body: విశ్వాసం అనే పదం వినిపిస్తే ముందుగా గుర్తొచ్చేది శునకం అనడం ఎలాంటి సందేహం లేదు. మనిషి స్వార్థం కోసం మాటలు, ప్రేమ మార్చుకుంటాడు. కానీ, శునకం తన ప్రాణం పోయేంత వరకు యజమానిని విడవదు. ప్రేమతో తోక ఆడిస్తుంది, మొరుగుతూ రక్షణ కల్పిస్తుంది, ఎంతకాలమైనా నిరీక్షించ గలుగుతుంది. ఇలా ఏం చేసినా యజామాని కోసమే చేస్తుంది. తన కడుపు నింపే యజమాని పట్ల జీవిత కాలం కృతజ్ఞత చూపుతూనే ఉంటుంది. శునకాల విశ్వాసం, యజమానులపై వాటి ప్రేమకు అద్దం పట్టే భావోద్వేగ ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లో వెలుగుచూసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని (Himachal Pradesh) చంబా జిల్లా భర్మూర్ ఏరియాలో ఓ వ్యక్తి చనిపోగా, అతడి పెంపుడు శునకం ఏకంగా 4 రోజుల పాటు మృతదేహం వద్దే (Dog Guards Dead Body) గడిపింది. గడ్డ కట్టే మంచుపై, అత్యంత శీతల వాతావరణాన్ని లెక్కచేయకుండా అక్కడే గడిపింది. తన ఓనర్ కోసం ఏకంగా 4 రోజులపాటు నిరీక్షించింది.
మనుషులు బయట అడుగుపెట్టడానికి ఏమాత్రం ఛాన్స్ లేని వాతావరణం అది. గజగజ వణికిపోయే వాతావరణం. నేలపై కొన్ని అడుగుల మేర పేరుకుపోయిన మంచు. ఇలాంటి కఠిన వాతావరణంలో కూడా ఒక పిట్‌బుల్ డాగ్ తన యజమాని పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు. భారీ హిమపాతం, తీవ్రమైన చలితో యజామాని ప్రాణాలు కోల్పోగా.. శునకం మాత్రం అక్కడే గడిపింది. మృతదేహానికి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగు రోజులు కాపలా కాచింది. ఆఖరికి తన పరిస్థితి దిగజారుతున్న, చలికి వణుకుతున్నా అక్కడి నుంచి అది కదలలేదు.
Read Also- BRS Party Joining: ఎల్లంపేట్లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురు నేతలు
అసలేం జరిగిందంటే?
భర్మార్ ప్రాంతంలో భర్మణి అనే ఆలయం ఉంది. అక్కడికి సమీపంలో వీడియోలు తీయడానికి బిక్షిత్ రాణా, పీయూష్ అనే ఇద్దరు యువకులు వెళ్లారు. కానీ, తీవ్రమైన ప్రతికూల చల్లటి వాతావరణం, భారీ మంచులో చిక్కుకుపోయారు. ఆ వాతావరణానికి ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరూ మిస్సింగ్ అయినట్టు కుటుంబ సభ్యులు గుర్తించారు. సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా, సహాయక బృందాలు వారి ఆచూకీ గుర్తించి, వారి వద్దకు చేరుకోవడానికి ఏకంగా 4 రోజుల సమయం పట్టింది. అయితే, అక్కడికి చేరుకున్న సహాయక సిబ్బంది, స్థానికులను అక్కడ కనిపించిన దృశ్యం కంటతడి పెట్టించింది. ఒకపక్క వరుసకు బంధువులైన ఇద్దరు యువకులు చనిపోగా, మూగజీవి శునకం మాత్రం అమితమైన విశ్వాసంతో అక్కడే ఉంది. తన యజమాని పీయూష్ మృతదేహం మంచు పొరల కింద పూడి ఉండగా, శునకం అతడిని ఆనుకొని అక్కడే కూర్చుంది.
Read Also- Kothagudem CPI: కొత్తగూడెంలో కమ్యూనిస్టులకు హవా.. గెలుపు కోసం వ్యూహంతో దూసుకుపోతున్న నేతలు..?
ఏకంగా, నాలుగు రోజుల పాటు ఆహారం, నీళ్లు లేకుండా శునకం అడ్కడే ఉన్నట్టు గుర్తించారు. శరీరాన్ని గడ్డకట్టించే భయంకరమైన శీతల గాలులు, మంచు తుఫానులను అది తట్టుకుంది. అంతేకాదు, ఆ ప్రాంతంలో సంచరించే అడవి జంతువుల నుంచి తన యజమానికి కాపలా కాసింది. సహాయక సిబ్బంది మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయగా, శునకం తొలుత సహకరించలేదు. ఆ టీమ్‌పై తిరగబడింది. తన యజమానికి ఏదైనా హాని తలపెడుతున్నారేమోనని భావించి మొరిగింది. అయితే, రెస్క్యూ టీమ్ దానిని నెమ్మదిగా సముదాయించారు. కొద్దిసేపటి తర్వాత, సాయం చేయడానికి వచ్చారని అర్థం చేసుకొని అక్కడి నుంచి పక్కకు తప్పుకుంది. ఈ శునకానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగవైరల్గా మారాయి. శునకాల విశ్వాసంపై నెటిజన్లు తమ అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగ కామెంట్లు చేస్తున్నారు.

