India EU FTA: ఎన్నో ఏళ్లపాటు జరిపిన చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ, భారత్ – యూరోపియన్ యూనియన్ (EU) చారిత్రాత్మకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (India EU FTA) కుదిరింది. భారత్, ఈయూ (EU) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ఖరారైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ మంగళవారం ప్రకటించారు. ఈ డీల్ ‘వాణిజ్య ఒప్పందాలకే మాతృక లాంటిది’ అని ఉర్సులా అభివర్ణించారు. మంగళవారం మధ్యాహ్న సమయంలో ఈ ఒప్పందాన్ని ప్రకటించారు. యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా, ప్రధాని మోదీ ఈ ప్రకటనపై సంతకాలు చేశారు. ఒప్పందాలపై సంతకాలు పూర్తయిన తర్వాత ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు.
సుమారుగా 213 బిలియన్ డాలర్ల విలువైన ఈ ఒప్పందం చరిత్రలోనే అతి పెద్దదని మోదీ అభివర్ణించారు. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య కూటముల మధ్య ఈ ఒప్పందం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. ఇరువైపు ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూర్చే అనేక నిర్ణయాలను తీసుకున్నామంటూ ప్రధానమంత్రి చెప్పారు. భారత్, ఈయూ వాణిజ్య ఒప్పందం పరస్పర వృద్ధికి ఒక బ్లూప్రింట్ లాంటిదని వ్యాఖ్యానించారు. యూరోపియన్ యూనియన్ పరిధిలోని దేశాలలో నివసిస్తున్న సుమారుగా 8 లక్షల మంది భారతీయులకు కూడా ఈ ఒప్పందం గొప్ప ప్రయోజనాన్ని చేకూర్చుతుందని మోదీ చెప్పారు.
చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందం
భారతదేశం తన చరిత్రలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఇవాళ ఖరారు చేసుకుందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘ఇవాళ జనవరి 27.. సరిగ్గా ఇదే సంఖ్యలో యూరోపియన్ యూనియన్‌లో ఉన్న 27 దేశాలతో భారత్ ఈ డీల్‌పై సంతకం చేయడం యాదృచ్ఛికం. ఇది కేవలం ఒక వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదు. సమిష్టి పురోగతి కోసం రూపొందించిన ఒక సరికొత్త ప్రణాళిక. భారత్, ఈయూ మధ్య భాగస్వామ్యం ప్రపంచ శ్రేయస్సుకు సహకారాన్ని ఇస్తుంది’’ అని మోదీ అభివర్ణించారు.
Read Also- Singareni Tenders: పాలేరులో దుమారం లేపుతున్న కోల్ వివాదం.. కన్ఫ్యూజన్లో కీలక నేతలు..?
నమ్మకమైన భాగస్వాములుగా నిలుద్దాం..
ఈ ఒప్పందంపై యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా స్పందిస్తూ, భారత్, ఈయూ పరస్పరం వ్యూహాత్మక, నమ్మకమైన భాగస్వాములుగా నిలుస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించే బలమైన అంతర్జాతీయ వ్యవస్థను నిర్మించేందుకుగానూ ఈ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని ఆయన చెప్పారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. భారత్‌తో కుదిరిన ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం యూరప్‌కు ఎంతో చారిత్రాత్మకమైనదని ఆంటోనియో అభివర్ణించారు. ఈ ఒప్పందంతో దాదాపు రెండు వందల కోట్ల జనాభా కలిగిన అతిపెద్ద మార్కెట్ ఆవిష్కృతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యం ద్వారా భవిష్యత్‌లో గ్రీన్ ఎనర్జీపై కూడా దృష్టి సారించాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. తన భారతీయ మూలాలను చూసి గర్విస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు.
భారత్ ఎదిగింది
ప్రపంచ భద్రతకు భారత వృద్ధి ఎంతో అవసరమని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ అన్నారు. భారతదేశం ఎదిగింది.. ఆ విషయంలో యూరప్ నిజంగా ఎంతో సంతోషిస్తోందని ఆమె హర్షం వ్యక్తం చేశారు. భారతదేశం విజయమైతే, ప్రపంచం మరింత సురక్షితంగా మారుతుందని, అందరికీ మేలు జరుగుతుందని ఆమె ఆకాంక్షించారు. ‘‘మనం అనుకున్నది సాధించాం. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ లాంటి భారీ ఒప్పందాన్ని అందించగలిగాం. ఇది రెండు దిగ్గజాల కథ’’ అని ఉర్సులా వ్యాఖ్యానించారు.
Today is a day that will be remembered forever, marked indelibly in our shared history.
European Council President António Costa and European Commission President Ursula von der Leyen and I are delighted to announce the conclusion of the historic India-EU Free Trade Agreement.… pic.twitter.com/yaSlPm2b2L
— Narendra Modi (@narendramodi) January 27, 2026

