CI Mahender Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అరైవ్ అలైవ్ ఉద్యమం కాదని ప్రాణాలను కాపాడే కార్యక్రమమని మహబూబాబాద్ టౌన్ సిఐ గట్ల మహేందర్ రెడ్డి (CI Mahender Reddy) వాహనదారులకు సూచించారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా (Mahabubabad district) కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట వాహనదారులు, ఉద్యోగులు, ప్రజలకు అరైవ్ అలైవ్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… వాహనదారుల ప్రాణాలను కాపాడేందుకే “అరైవ్ అలైవ్” వినూత్నమైన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టి అమలు చేస్తుందన్నారు. రహదారులపై ప్రయాణాలు సాగించేటప్పుడు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అదేవిధంగా కారు డ్రైవింగ్ చేసే వారు కూడా సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. రహదారులపై ప్రయాణాలు సాగించేటప్పుడు తమపై ఆధారపడి కుటుంబం ఉంటుందని గుర్తుంచుకోవాలన్నారు. కుటుంబ పెద్ద ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబమంతా రహదారిపై పడే అవకాశాలు ఉంటాయని గుర్తు చేశారు. ఇలాంటి వాటన్నింటిని గుర్తుంచుకొని రహదారులపై సురక్షితమైన ప్రయాణాలు సాగించాలని వివరించారు.
Also Read: Mahabubabad CI: విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలి.. సిఐ ఆదేశం
ట్రాఫిక్ నిబంధనలు తూ చా తప్పకుండా పాటించాలి
రహదారులపై ప్రయాణాలు సాగించేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు తూ.చా తప్పకుండా పాటించాలని సిఐ మహేందర్ రెడ్డి వివరించారు. రాంగ్ రూటు ప్రయాణం, అతి వేగవంతమైన ప్రయాణం అత్యంత ప్రమాదకరమైందని గుర్తు చేశారు. మైనర్లతో వాహనాలు నడిపించే ప్రయత్నాలను పేరెంట్స్ బాధ్యతగా తీసుకోవాలని స్పష్టం చేశారు. మైనర్లు వాహనాలు నడిపే సమయంలో స్పీడ్ పెంచే అంత శక్తి అదే స్పీడును కంట్రోల్ చేసే శక్తి ఉండదని గుర్తు చేశారు. ఇలాంటి సమయంలోనే ఎక్కువ శాతం ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉందన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే అందుకు పేరెంట్స్ పై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రహదారులపై వెళ్లే వాహనాలను ఆపి హెల్మెట్, సీట్ బెల్ట్, ట్రాఫిక్ నిబంధనలను పాటించి ప్రయాణాలు సాగించాలని వెల్లడించారు. నిత్యం ఉద్యోగాల కోసం వాహనాలపై వెళ్లే ఉద్యోగులు కూడా ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటిస్తే ప్రమాదాల శాతం తగ్గించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ అరుణ్ కుమార్, టౌన్ ఎస్ఐ, సిబ్బంది పాల్గొన్నారు.
Also Read: Drug Awareness: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: గట్ల మహేందర్ రెడ్డి

