Ponguleti Srinivas Reddy: రైతులకు చుట్టంలా ఉండే భూ భారతి చట్టాన్ని అమలులోకి తెచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy) పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో శిక్షణ పొందిన లైసెన్స్‌డ్ సర్వేయర్లకు మంత్రి శ్రీనివాస రెడ్డి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అంతకంటే ముందు ఖమ్మంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి రాజ్యాంగం ఘనతను వివరించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ, రైతుల చెంతకే భూదార్ సర్వే వ్యవస్థలో నూతన విప్లవాన్ని తీసుకొచ్చి క్షేత్రస్థాయిలోకి లైసెన్స్‌డ్ సర్వేయర్లను పంపించామన్నారు.
యాజమాన్య భద్రత కల్పించడమే ధ్యేయం
రైతుకు సంబంధించిన భూములకు ప్రతి అంగుళాన్ని డిజిటల్లైజేషన్ చేశామన్నారు. యజమానులకు శాశ్వత యాజమాన్య భద్రత కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు. గతంలోని టేపులు, గొలుసుల పద్ధతులకు స్వస్తి పలికి, సెంటీమీటర్ల తేడాతో కచ్చితత్వం వచ్చేలా రోవర్స్ సాంకేతికతను వాడుతున్నామని వెల్లడించారు. ఇప్పటికే 600 రోవర్లను ప్రభుత్వం కొనుగోలు చేసి జిల్లాలకు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ పొందిన 5500 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను మండలాల వారీగా భూ విస్తీర్ణం ప్రాతిపదికన కేటాయించామన్నారు. ఖమ్మం జిల్లాలో రెండో విడుతలో అర్హత సాధించిన 47 మందికి నియామక పత్రాలను అందజేశామన్నారు. వీరందరూ పారదర్శకతతో క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించామని పేర్కొన్నారు.
ధరణి అక్రమాలపై ఉక్కు పాదం
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుపేదల భూములను కొల్లగొట్టేందుకు ధరణి చేపట్టిన అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కు పాదం అవుతుందన్నారు. ధరణిలో జరిగిన లోపాలపై ఇప్పటికే సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తి చేశామన్నారు. ఆ నివేదికలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన 31 జిల్లాల్లోనూ ఆడిట్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని, ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మండిపడ్డారు.

