Ban on Drone:
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఈనెల 26న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగనున్న నేపథ్యంలో నిషేధాజ్ఞలు విధిస్తూ (Ban on Drone) మల్కాజిగిరి జోన్ డీసీపీ సీహెచ్ శ్రీధర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రిపబ్లిక్ డేను పురస్కరించుకుని విధ్వంసం సృష్టించటానికి ఉగ్ర సంస్థలు కుట్రలు చేస్తున్న నేపథ్యంలో అలర్ట్‌గా ఉండాలని కేంద్ర నిఘా వర్గాలు ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు అన్ని చర్యలు చేపట్టారు. ఇక, ప్రతిసారి మాదిరిగానే ఈ సంవత్సరం కూడా గణతంత్ర దినోత్సవ వేడకలు పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రోజు ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు బేగంపేట, మార్కెట్, మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ల పరిధుల్లో డ్రోన్లు, పారా గ్లైడర్లు, మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్టులను ఎగుర వేయటంపై నిషేధం విధిస్తూ డీసీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Also- Raakaasaa Glimpse: సంగీత్ శోభన్ ‘రాకాస’ గ్లింప్స్ వచ్చేశాయ్ చూశారా.. నిహారిక రెండో సినిమా
ఉన్నది ఒకే ఒక్క జిందగీ: సైబరాబాద్ కమిషనర్ డాక్టర్ రమేశ్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఉన్నది ఒకే ఒక్క జిందగీ… నిబంధనలకు నీళ్లొదులుతూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సైబరాబాద్ కమిషనర్ డాక్టర్ రమేశ్ సూచించారు. అవతలి వారి బతుకులతో చెలగాటాలాడొద్దని హెచ్చరించారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కూకట్‌పల్లిలోని రంగధాముని చెరువు, ఐడీఎల్ చెరువు వద్ద బసంతి ఫౌండేషన్ తో కలిసి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ స్టార్ట్ ఎర్లీ… గో స్లోలీ… రీచ్ సేఫ్లీ అన్న సూత్రాన్ని ప్రతిఒక్కరూ పాటించాలన్నారు. ఏయేటికాయేడు పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు వేలాది కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిలిస్తున్నాయన్నారు. ఎక్కువగా విద్యార్థులు, యువకులు యాక్సిడెంట్లలో ప్రాణాలు కోల్పోతుండటం బాధాకరమన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించటానికి పోలీసు శాఖ విస్తృత చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అయితే, ప్రజల సహకారం అందినపుడే ఫలితాలు వస్తాయన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. కార్లు నడిపేవారు సీట్ బెల్టు పెట్టుకోవాలని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు అందరూ సురక్షితంగా ఉండేలా చూడటానికే అని చెబుతూ వాటిని పాటించాలని సూచించారు. పరిమితికి మించిన వేగంతో వాహనాలు నడప వద్దన్నారు. ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయవద్దన్నారు. హెల్మెట్ల పంపిణీకి ముందుకొచ్చిన బసంతి ఫౌండేషన్ ప్రతినిధులను అభినందించారు.
Read Also- UP Shocker: ఎంబీబీఎస్ సీటు కోసం.. కాలు నరుక్కున్న విద్యార్థి.. ఇదేం వెర్రితనం!

