Groundnut Price: క్వింటాల్ వేరుశనగ ధర రూ.10,011
వనపర్తి,స్వేచ్ఛ: వనపర్తి వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం వేరుశనగ రికార్డు స్థాయి ధర పలికింది. క్వింటాల్ ధర (Groundnut Price) మొట్టమొదటి సారిగా రూ.10,011 పలికిందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వనపర్తి జిల్లా ఖిల్లా ఘణపురం మండలం శాగాపురం గ్రామానికి చెందిన కృష్ణయ్య రెండు ఎకరాలలో పండించిన 59 వేరుశనగ సంచులు అమ్మాడు. మొత్తం 17.73 క్వింటాళ్ల వేరుశనగ విక్రయించగా, ఒక్కో క్వింటా రూ.10,011 ధర పలికింది. దీంతో, రైతు కృష్ణయ్య ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా మార్కెట్ కమిటీ చైర్మెన్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, గత నెలరోజులుగా వనపర్తి వ్యవసాయ మార్కెట్‌కి సుమారు 19,100 క్వింటాళ్ల వేరుశనగ వచ్చిందని తెలిపారు. వేరుశనగ కనిష్ట ధర రూ.4,486, గరిష్ట ధర రూ.10,011గా శుక్రవారం పలికిందని, ఈ స్థాయి గరిష్ఠ ధర ఏర్పడడం వనపర్తి వ్యవసాయ మార్కెట్ ఏర్పడిన 46 సంవత్సరాలలలో ఇదే తొలిసారి అని, ఈ మేరకు రికార్డు సృష్టించిందని చెప్పారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర మార్కెట్‌లో పల్లి ఎగుమతి ధర పెరగడం, వేరుశనగ పంట తక్కువ పండించడంతో ఈ ధర పలికిందని అధికారులు, వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.
Read Also-Akira Nandan: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఏపీ డిప్యూటీ సీఎం కొడుకు.. ఎందుకంటే?

