Gadwal Farmers: రబీలోనూ వరి సాగు చేయడమే వ్యవసాయం అనే పరిస్థితి జిల్లాలోని సాగునీటి వసతులున్న పొలాల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. జిల్లాలో సుమారు 3.95 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తుండగా 95 వేల ఎకరాల్లో వరి సాగు విస్తీర్ణం ఉంటుంది. ప్రతి ఏటా నెట్టెంపాడు, జూరాల ఆయకట్టు కింద సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. మరో వైపు వరిలో తెగుళ్ల బెడద లేకపోవడం తక్కువ పెట్టుబడి కావడం, దానికి తోడు ప్రభుత్వ మద్దతు ధర తోడు కావడంతో రైతులు వరి వైపే మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) ఏర్పడిన తర్వాత వరి ధాన్యానికి బోనస్ రూపంలో సైతం రైతుకు తోడ్పాటు అందిస్తుండడంతో విస్తీర్ణం పెరగడానికి దోహదపడుతున్నది.
తాత్కాలిక లాభాలు దీర్ఘకాలిక నష్టాలు
పంట మార్పిడి విధానాన్ని అవలంబించకుండా కేవలం వరిని మాత్రమే సాగు చేస్తుండటంతో తాత్కాలిక లాభాల కన్నా దీర్ఘకాలిక నష్టాలు ఎక్కువని వ్యవసాయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఏళ్ల తరబడి ఒకే రకం పంట సాగు చేస్తే చీడపీడల ఉధృతి పెరగడంతో పాటు విచ్చలవిడిగా మోతాదుకు నుంచి రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడటంతో భూమి నిస్సారంగా మారుతుంది. పంటల సాగులో సమతుల్యత దెబ్బతిని ఇతర ఆహార పంటల ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల వరి దిగుబడులు తగ్గడం, కూరగాయల ధరలు పెరగడమే ఈ పరిస్థితికి నిదర్శనం.
Also Read: Gadwal Farmers: గద్వాల జిల్లాలో పత్తి రైతుల కష్టాలు.. అధిక వర్షాలతో ఎర్రబారుతున్న పంటలు
కలుషితమవుతున్న వాతావరణం
అధిక విస్తీర్ణంలో వరి సాగుతో పెద్ద మొత్తంలో ప్రమాదకర మిథెన్ వాయు వాతావరణంలోకి కలుస్తుంది. ఇది కార్బన్ డయాక్సైడ్ కన్నా 28 నుంచి 34 రెట్లు అధికంగా గ్లోబల్ వార్మింగ్‌కు కారణం అవుతుంది. దీనికి తోడు విలువైన భూగర్భ జలాలు వేగంగా కరిగిపోతున్నాయి. ఉచితంగా విద్యుత్, రాయితీపై ఎరువులు తదితర కారణాలతో ప్రభుత్వాలపై వేల కోట్ల అదనపు భారం పడుతున్నది.
ప్రభుత్వం మొగ్గు చూపాలి
ఆరుతడి పంటలను ప్రోత్సహించాలి కృష్ణారెడ్డి రైతు మాట్లాడుతూ వరి సాగును తగ్గించేందుకు ప్రభుత్వం ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలి. సూక్ష్మ, బిందు సేద్యం పరికరాల రాయితీకి ప్రభుత్వం మొగ్గు చూపాలి. ఆరుతడి పంటలకు మద్దతు ధర చెల్లించి ప్రభుత్వమే సకాలంలో కొనుగోలు చేయాలి. కూరగాయలు పండించే రైతులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి. విత్తనాలు నాణ్యమైనవి సరఫరా చేయడం ద్వారా ఉత్పత్తులు మరింత పెరిగే అవకాశం ఉంది.
రైతులను చైతన్య పరచాలి
రైతులను చైతన్య పర్చాలి రమేష్, రైతు, మాట్లాడుతూ జిల్లాలో కూరగాయల సాగుకు అవకాశం ఉన్న ప్రతి చోట సాగు చేసేలా ఉద్యానవనం అధికారులు దృష్టి పెట్టాలి. వివిధ రకాల కూరగాయలు పండించేలా ప్రభుత్వం రైతులను చైతన్య పరచాలి. తద్వారా కూరగాయలు మార్కెట్లో సమృద్ధిగా లభించి వినియోగదారులకు తక్కువ ధరలో కూరగాయలు లభించే అవకాశం ఉంటుంది.

