Lucky Draw Scam: సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు అన్న ముసుగులో కొందరు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి పదుల సంఖ్యలో యువకులను బలిగొన్న ఘటనలు ఇటీవల చూశాం. అయితే హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపడంతో పాటు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు నోటీసులు ఇవ్వడంతో బెట్టింగ్ ఆగడాలు కొద్దిమేర తగ్గాయి. అయితే కొందరు ఇన్ ఫ్లూయెన్సర్లు కొత్తగా మరో మోసానికి తెరలేపడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లక్కీ డ్రా పేరుతో ప్రజలను మోసం చేస్తుండటం ఇటీవల కాలంలో పెరిగిపోతోంది. దీనిపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ (V.C. Sajjanar) సైతం ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేయడం.. పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతోంది.
లక్కీ డ్రా పేరుతో చిల్లర వేషాలు!
లక్కీ డ్రా పేరుతో సోషల్ మీడియాలో రీల్స్ షేర్ చేస్తూ కొందరు ఇన్ ఫ్లూయెన్సర్లు అమాయకులను మోసం చేస్తున్నారు. లక్షల్లో దోచుకుంటూ ఫాలోవర్ల జేబులను గుల్ల చేస్తున్నారు. సోషల్ మీడియాలో కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్లు కార్లు, బైకులు, ప్లాట్లు, డీజేలు ఇస్తామంటూ లక్కీ డ్రాల పేరుతో మోసాలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని హైదరాబాద్ సిటీ కమిషనర్ సజ్జనార్ ఎక్స్ వేదికగా తెలియజేశారు. బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ల దందా బంద్ కావడంతో లక్కీ డ్రాలు అంటూ కొత్త వేషాలు వేస్తున్నారని పేర్కొన్నారు. అమాయకపు ప్రజల ఆశలను ఆసరాగా చేసుకొని నిండా ముంచేస్తున్నారని పేర్కొన్నారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మోసాలకు పాల్పడే వారు సెలబ్రిటీలైనా, సోషల్ మీడియా స్టార్లైనా సరే.. ఎవరినీ ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.
రూ.299కే రూ.16 లక్షల కారు!
లక్కీ డ్రా మోసాలకు సంబంధించి హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఓ వీడియోను సైతం షేర్ చేశారు. అందులో కొందరు ఇన్ ఫ్లూయెన్సర్లు ఫ్రాడ్ ప్రమోషన్లు చేయడం కనిపించింది. రూ.299కే రూ.16 లక్షల విలువైన కారును గెలుచుకోండి అంటూ ఓ వ్యక్తి చెప్పడం వీడియోలో చూడవచ్చు. అలాగే రూ.200 కట్టి మెగా లక్కీ డ్రాలో పాల్గొనే వారికి తొలి మూడు బహుమతుల కింద కార్లను ఇస్తామంటూ మరో వ్యక్తి ప్రచారం చేయడం చూడవచ్చు. ఉచితంగా నాలుగు హోండా షైన్ బైక్స్, రూ.200కే రూ.4 లక్షలు ఖరీదైనా డీజే సౌండ్ సిస్టమ్, రూ.999కే 15 కుంటల భూమి, రూ.1000కే డూప్లెక్స్ హౌస్, రూ.249కి 100 చదరపు అడుగుల ఫ్లాట్, రూ.99కే రూ.10,000 డ్రోన్ గెలుచుకునే అవకాశముంటూ వీడియోలో కొందరు ఊదరగొడుతున్నారు. ఇలాంటి రీల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ సూచించారు.
రీల్స్‌లో బిల్డప్.. రియాలిటీలో ఫ్రాడ్!
లక్కీ డ్రా ఇన్ఫ్లుయెన్సర్ల పట్ల జాగ్రత్త!
సోషల్ మీడియాలో కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్లు కార్లు, బైకులు, ప్లాట్లు, డీజేలు ఇస్తామంటూ లక్కీ డ్రాల పేరుతో మోసాలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది.
బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ల దందా బంద్ కావడంతో… pic.twitter.com/m34NzGwIjp
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 17, 2026
Also Read: Assembly Session: ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలు.. ఈసారి జగన్ రావాల్సిందేనా? లేదంటే సీటు గల్లంతేనా?
టీటీడీ పేరుతో లక్కీ డ్రా
తిరుమల వెంకన్న పేరుతో సైతం లక్కీ డ్రా నిర్వహిస్తూ రూ. కోట్ల రూపాయలు దండుకోవడం సంచలనంగా మారింది. ఈ ముఠాపై సినీ నటి కరాటే కళ్యాణి ఏకంగా పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. రూ. 399తో ఫార్చ్యునర్ కారు, ఐఫోన్లు, గెలుచుకోవచ్చని ప్రవీణ్ కాసా, సిద్దమోని మహేందర్ అనే యువకులు మోసం చేస్తున్నారని నటి తన ఫిర్యాదులో పేర్కొంది. అమాయకులను మోసం చేయడానికి తిరుమల ఆలయాన్నే ప్రమోషన్స్ కింద ఉపయోగించుకున్నారని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
టీటీడీ పేరుతో లక్కీ డ్రా మోసం
టీటీడీ పేరుతో లక్కీ డ్రా నిర్వహిస్తూ కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న ముఠాపై సినీ నటి, బీజేపీ నేత కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేవలం 399 రూపాయలతో ఫార్చ్యూనర్ కార్లు, ఐఫోన్లు గెలుచుకోవచ్చని ప్రవీణ్ క్యాసా, సిద్ధమోని మహేందర్ అనే… pic.twitter.com/VMz8A4P9xb— ChotaNews App (@ChotaNewsApp) January 18, 2026

