Assembly Session: వచ్చే నెల ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు ఉండొచ్చని డిప్యూటీ స్పీకర్ రఘరామ కృష్ణంరాజు తాజాగా వెల్లడించారు. దీంతో సహజంగానే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) పైకి అందరి దృష్టి వెళ్లింది. గత కొద్ది రోజులుగా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటూ వస్తున్న జగన్.. ఈసారైనా సమావేశానికి హాజరవుతారా? లేదా? అన్న చర్చ ఏపీ రాజకీయాల్లో మెుదలైంది. అయితే ఈసారి ఫిబ్రవరిలో జరిగేది బడ్జెట్ సమావేశాలు కానుండటంతో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడ్డాయి. మరోవైపు జగన్ రాకుంటే అతడి చర్యలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ విషయంలో ద్వంద్వ వైఖరి..!
వాస్తవానికి అసెంబ్లీ విషయంలో విపక్ష వైసీపీ ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. బొత్స సత్యనారాయణ నేతృత్వంలో శాసన మండలికి ఆ పార్టీ ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఎండ గడుతున్నారు. అయితే శాసనసభకు వచ్చేసరికి ఆ పార్టీ పూర్తిగా బాయ్ కాట్ ధోరణిని అవలంభిస్తోంది. 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే అనర్హత పడుతుందన్న నిబంధన దృష్ట్యా.. ఆ పరిమితి దాటకుండా జగన్ సహా ఆ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి సంతకాలు చేసి వెంటనే సభ నుంచి వెళ్లిపోతున్నారు.
వైసీపీ వైఖరిపై రఘరామ ఆశ్చర్యం..
వైసీపీ ద్వంద్వ వైఖరిని తాజాగా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు కూడా ఎండగట్టారు. ఒకే భవనంలో శాసన సభ, శాసన మండలి ఉన్నాయని.. ఒకదానికి వైసీపీ సభ్యులు హాజరై, మరొదానికి గైర్హజరు కావడమేంటో అర్ధం కావడం లేదని పేర్కొన్నారు. రెండు సభల్లో ఒకే తరహా వాతావరణం ఉందని ఆయన పేర్కొన్నారు. మండలికి వచ్చి, శాసన సభకు రాకపోవడం వెనుక కారణాలు వారికే తెలియాలంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలకైనా జగన్ తో సహా వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు వస్తారని ఆశీస్తున్నట్లు రఘురామ పేర్కొన్నారు.
Also Read: AP News: చంద్రబాబు నోటివెంట మళ్లీ ఆ మాట… ఈ డ్రీమ్ ఎప్పుడు నెరవేరుతుందో?
ఈసారి రాకుంటే వేటు తప్పదా?
తాజా ప్రెస్ మీట్ లో రఘురామ కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి రాకుండా సంతకాలు పెడుతున్న వైసీపీ సభ్యులపై త్వరలో చర్యలు ఉంటాయన్న హింట్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ మండలి బుద్ద ప్రసాద్ పరిశీలిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. దీని ప్రకారం సంతకాలు పెట్టి వెళ్లిపోతున్న వారిపై ఎథిక్స్ కమిటీ ఏదైనా నిర్ణయానికి వస్తే జగన్ ఇరాకటంలో పడక తప్పదని పొలిటికల్ వర్గాలు విశ్లేషిస్తున్నారు. సభ్యుల సంతకాలను కాకుండా.. సభలో గడిపే సమయాన్నే పరిగణలోకి తీసుకోవాలని ఎథిక్స్ కమిటీ భావిస్తే.. జగన్ తప్పనిసరిగా అసెంబ్లీకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయినప్పటికీ ఇదే ధోరణిని వైసీపీ అధినేతతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు అనుసరిస్తే వేటు పడే అవకాశం కూడా లేకపోలేదన్న చర్చ ఏపీ రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

