Land Scam: ధరణి భూ భారతి వ్యవస్థలోని లోపాలను అవకాశంగా చేసుకుని కోట్ల రూపాయలు కొల్లగొట్టిన గ్యాంగ్‌ను వరంగల్ పోలీసులు (Warangal Police) అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 15 మందిని పట్టుకోగా మరో 9 మంది పరారీలో ఉన్నట్టుగా కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ చెప్పారు. జనగామ, యాదాద్రి జిల్లాలో ఈ స్కాం జరిగినట్టుగా తెలిపారు. ఇప్పటివరకు జరిపిన విచారణలో నిందితులు ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన 3.90 కోట్ల రూపాయలను కొల్లగొట్టినట్టుగా వెల్లడైందన్నారు. వరంగల్ కమిషనరేట్‌లో జరిపిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
ప్రత్యేకంగా మొబైల్ అప్లికేషన్
రాష్ట్రంలో భూ లావాదేవీలు పారదర్శకంగా జరిగేలా చూసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిలో పలు లోపాలు ఉన్నాయని పేర్కొని వాటిని సరి చేస్తూ భూ భారతి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ తదితర అంశాలను ఆన్ లైన్‌లో పూర్తి చేస్తారు. అయితే, కొంతమంది ముఠాగా ఏర్పడి ఈ వ్యవస్థలోని లోపాలను అవకాశంగా చేసుకుని ప్రభుత్వానికి జమ కావాల్సిన కోట్ల రూపాయలను సొంత జేబుల్లోకి మళ్లించుకున్నారు. దీని కోసం ప్రత్యేకంగా మొబైల్ అప్లికేషన్‌ను డెవలప్ చేశారు. దీని ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజును తక్కువగా చెల్లిస్తూ వచ్చారు. ఆ తరువాత ఫీజు చెల్లించినట్టుగా నకిలీ చలాన్లు తయారు చేసి మధ్యవర్తుల ద్వారా ఆయా తహసీల్దార్ కార్యాలయాల్లో సమర్పించారు. అనంతరం భూముల రిజిస్ట్రేషన్లను పూర్తి చేయించారు.
Also Read: Sahithi Infra Scam: రూ.3వేల కోట్లుగా తేలిన సాహితీ స్కాం.. బాధితులకు న్యాయం ఎప్పుడు?
ఆన్ లైన్ సెంటర్ల ద్వారా
ఈ స్కాంలో పసునూరి బసవరాజు, జెల్ల పాండు కీలకంగా వ్యవహరించినట్టుగా కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. భువనగిరితోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ఆన్ లైన్ సెంటర్లు నడుపుతున్న వారికి ఒక్కో రిజిస్ట్రేషన్ స్లాట్ కోసం 10 నుంచి 30 శాతం మొత్తాన్ని కమీషన్లుగా ఇస్తూ వారి ద్వారా అక్రమంగా స్లాట్లు బుక్ చేయించి రిజిస్ట్రేషన్లను పూర్తి చేశారన్నారు. ఇప్పటి వరకు జనగామ, యాదాద్రి జిల్లాల్లో ఇలా 1,080 రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జరిగినట్టు విచారణలో నిర్ధారణ అయ్యిందన్నారు. అరెస్ట్ చేసిన నిందితుల నుంచి 63 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. బ్యాంకు ఖాతాల్లో ఉన్న లక్ష రూపాయల నగదును ఫ్రీజ్ చేయించినట్టు తెలిపారు. కోటి రూపాయల విలువ చేసే ఆస్తుల డాక్యుమెంట్స్, కారు, 2 ల్యాప్ టాప్స్, సెల్ ఫోన్లతోపాటు డిజిటల్ పరికరాలను సీజ్ చేశామన్నారు.
ఇప్పటివరకు 15 మంది అరెస్ట్
జనగామ జిల్లాలో నమోదైన 7, యాదాద్రి జిల్లాలో నమోదైన 15 కేసుల్లో ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేసినట్టు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. పరారీలో ఉన్న మరో 9 మంది కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయన్నారు. ఈ స్కాంలో ఆయా తహసీల్దార్ కార్యాలయాల్లో పని చేస్తున్న సిబ్బంది పాత్ర ఉన్నదా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్టు తెలిసింది.
Also Read: Medical Scam: సత్తుపల్లి మెడికల్ దందాలో కదులుతున్న డొంక.. ఒప్పందాల వెనుక ఎవరి పాత్ర ఏమిటి..?

