Gajwel Congress: గజ్వేల్ కాంగ్రెస్ లో స్పష్టమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నాయకుల మధ్య ఉన్న గ్రూపు తగాదాలను వీడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయాలను ప్రజలకు అందించడానికి సమిష్టిగా పని చేయడానికి ఏకమవుతున్నారు. ముఖ్య నాయకుల మధ్య ఉన్న వర్గపోరు వీడి కలిసి పనిచేయడానికి సిద్ధమవుతున్నారు. గజ్వేల్ సీనియర్ నాయకులు మున్సిపాలిటీ రాజకీయ చతురత కలిగిన ప్రముఖ నేత నాయిని యాదగిరి(Naini Yadagiri), స్థానిక మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జ్ తూంకుంట నర్సారెడ్డి(Thoomkunta Narsareddy)తో కలిసి పార్టీ కోసం పని చేయడానికి చేతులు కలిపాడు. గురువారం పట్టణంలోని సిసి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో నర్సారెడ్డి తో కలిసి నాని యాదగిరి పాల్గొన్నారు. మొన్నటి వరకు ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గు మనే పరిస్థితులు నెలకొని ఉండగా వారిరువురు కలిసిపోవడం త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనుందని తెలుస్తుంది. ఇప్పటికే స్థానిక కాంగ్రెస్ నాయకులు బండారు శ్రీకాంత్(Srikanth) రావు తదితరులు నర్సారెడ్డి తో కలిసి పోయి సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే.
రెండు వర్గాల మధ్య తగాదాలు
గజ్వేల్ కాంగ్రెస్ వర్గ పోరుతో అనేక సందర్భాల్లో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే. కొంతమంది నాయకులు నర్సారెడ్డి తో వ్యతిరేకంగా వ్యవహరించడం రెండు వర్గాల మధ్య తగాదాలు ఏర్పడడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీయడం జరిగింది. గజ్వేల్ పట్టణ సీనియర్ నాయకులు నాయిని యాదగిరి కొన్ని కారణాలవల్ల నర్సారెడ్డికి దూరంగా ఉంటూ వచ్చారు. యాదగిరి, నర్సారెడ్డి తో కలవడంతో ఇక గ్రూపు తగాదాలకు దాదాపు చెక్ పడినట్లే అవుతుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ పార్టీ కోసం నర్సారెడ్డితో కలిసి పనిచేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
Alslo Read: Black Jaggery: ఆ జిల్లాలో జోరుగా నల్లబెల్లం దందా.. 100 క్వింటాళ్లు దొరికిన వారిపై పోలీసుల చర్యలు ఏవి?
పార్టీకి కలిసొచ్చే విజయం
మున్సిపల్ ఎన్నికలకు ముందడుగు త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల ముందు ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిరి ఏకం కావడం ఆ పార్టీకి కొండంత బలం చేకూరుతుందని స్థానిక కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. యాదగిరి గజ్వేల్ పట్టణ రాజకీయ కురువృద్ధుడు, తాను ఉన్న పార్టీ కోసం నిరంతరం కష్టపడి పనిచేసే తత్వం కలిగిన నాయకుడు. పైగా స్థానికంగా ప్రతి ఓటరుకు తెలిసిన వ్యక్తి. ప్రజలతో నిత్యం మమేకమై వారి కష్టసుఖాలలో పాలుపంచుకునే స్నేహశీలి. ఇదే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే విజయంగా స్థానికులు చెప్పుకుంటున్నారు. యాదగిరి తో పాటు గజ్వేల్ పట్టణానికి చెందిన పలువురు కూడా గ్రూపులు వీడి కలిసి పని చేయడానికి ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వర్గ విభేదాలు లేని నాయకత్వంతో గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా మారుతుందని స్థానికులు భావిస్తున్నారు.
Also Read: Yellamma Glimpse : పూనకాలు తెప్పిస్తున్న‘ఎల్లమ్మ’ గ్లింప్స్.. డీఎస్పీని చూస్తే గూస్‌బంప్సే..

