Meenakshi Natarajan: రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నది. ఈ మేరకు ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) పార్టీ ముఖ్య నేతలు, మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికల్లో కేవలం గెలవడమే కాదు, ఏకంగా 90 శాతం సీట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని ఆమె ‘టాస్క్’ ఇచ్చారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల సమయంలో క్షేత్రస్థాయిలో ఎదురైన కొన్ని ఇబ్బందులు, సమన్వయ లోపాలను మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘సర్పంచ్ ఎన్నికల నాటి పరిస్థితులు మున్సిపల్ ఎన్నికల్లో రిపీట్ కావడానికి వీల్లేదు’ అని ఆమె నేతలను గట్టిగా హెచ్చరించినట్లు తెలిసింది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు ఎక్కడా అలసత్వం ప్రదర్శించవద్దని ఆదేశించారు.
Also Read: Meenakshi Natarajan: క్రమ శిక్షణతో పని చేసినోళ్లకే పదవులు: మీనాక్షి నటరాజన్
పార్టీ గుర్తుతోనే అసలైన బలం
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గుర్తుపైనే పోటీ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లడం సులభమవుతుందని ఆమె సూచించారు. పార్టీ గుర్తుపై పోటీ చేయడం వల్ల ఓటర్లలో గందరగోళం ఉండదని, అది పార్టీకి అదనపు మైలేజీనిస్తుందని స్పష్టం చేశారు. మరోవైపు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ, క్షేత్రస్థాయిలో పార్టీ పట్టును నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు. దీని ద్వారా రాష్ట్రంలోని మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై కాంగ్రెస్ జెండా ఎగుర వేయొచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు, కులగణన వంటి అంశాలను ప్రధాన ప్రచార అస్త్రాలుగా మార్చుకోవాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పరిధిలోని మున్సిపాలిటీ బాధ్యతను భుజాన వేసుకోవాలన్నారు.
Also Read: Meenakshi Natarajan: తెలంగాణలో ఏఐసీసీ టాస్క్ ఇదే.. అక్టోబర్ 15 నాటికి పూర్తి చేసేలా టార్గెట్!

