Black Jaggery: ఇటీవలనే మహబూబాబాద్ మండలంలోని కురవి రైల్వే గేట్, అనంతరం రైల్వే గేట్, కురవి మండలంలోని పిల్లిగుండ్ల తండ రైల్వే గేట్ ప్రాంతాల్లో రైళ్ల నుంచి నల్ల బెల్లం సరఫరా అవుతుందని కోణంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి 80 కేజీల నల్ల బెల్లం, ఐదు లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని అందుకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులను 14 రోజుల రిమాండ్ కు గత వారం రోజుల క్రితం తరలించారు. ఎక్సైజ్ అధికారులు ఇంత పకడ్బందీగా నల్ల బెల్లం వ్యాపారం, గుడుంబా అరికట్టడంలో విశేష కృషి చేస్తూ నిందితులపై ఉక్కు పాదం మోపుతున్నారు.
100 క్వింటాళ్ల నల్ల బెల్లం దొరికిన వారిపై పోలీసు చర్యలు ఏవి?
మహబూబాబాద్ జిల్లాలో ఎక్సైజ్ అధికారులు (Excise officials) నల్ల బెల్లం (Black Jaggery) రవాణా, విక్రయాలు, గుడుంబా తయారీ విక్రయాలు పై క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి విధులు నిర్వహిస్తూ వారి ఆటలు సాగకుండా కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిసిఎస్, గూడూరు, సిరోలు, డోర్నకల్, బయ్యారం, మరిపెడ, చిన్న గూడూరు, దంతాలపల్లి, నెల్లికుదురు, కేసముద్రం వంటి మండలాల్లో నిత్యం నల్ల బెల్లం రవాణా వాహనాలు స్వైర విహారం చేస్తూనే ఉంటాయి. పోలీసులకు వాహన సదుపాయాలతో పాటు అంగరక్షణ కోసం బాడీగార్డులు, అత్యాధునికమైన ఆయుధాలు అందుబాటులో ఉంటాయి. ఎక్సైజ్ శాఖ అధికారులకు వాహన సదుపాయాలు లేవు. సరైన సిబ్బంది కూడా ఉండదు. వారి వద్ద ఆత్మ రక్షణ కోసం ఆయుధాలు సైతం ఉండవు.
Also Read: Black Jaggery: యథేచ్చగా నల్ల బెల్లం దందా.. పోలీసులు విధులు నిర్వహిస్తారా? భేరసారాలకు తావిస్తారా?
100 క్వింటాళ్ల నల్ల బెల్లం
అయినప్పటికీ నల్లబెల్లం వ్యాపారులపై ఉక్కు పాదం మోపుతూనే వస్తున్నారు. మరి పోలీసులకు అంగ బలం, ఆయుధ బలం, వాహన సదుపాయాలు, అత్యాధునికమైన టెక్నాలజీ, సమాచార ఉపకరణాలు ఉన్నప్పటికీ నల్ల బెల్లం వ్యాపారుల వాహనాలను సమాచారం అందుకున్నప్పటికీ ఎందుకు పట్టుకోలేక పోతున్నారు. అంటే డబ్బులు పోలీసులకు బాధ్యతలు ఎక్సైజ్ అధికారులకా? అంటూ మహబూబాబాద్ జిల్లాలోని ప్రజలంతా విస్తృతంగా చర్చించుకుంటున్నారు. ఇదంతా ఒకటైతే ఇటీవలనే గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మట్టేవాడ గ్రామ సమీప పాఠశాల వద్ద 100 క్వింటాళ్ల నల్ల బెల్లం దిగుమతి చేసుకునేందుకు డిసిఎం వాహనంలో అక్రమ వ్యాపారులు తీసుకొచ్చారు. ఈ విషయం సిసిఎస్ పోలీసులకు తెలిసిపోయింది.
పోలీస్ అధికారులకు ఎందుకు తెలవడం లేదనేది ప్రశ్న?
మరి గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న అక్రమ వ్యాపారాల సమాచారం అక్కడి పోలీస్ అధికారులకు ఎందుకు తెలవడం లేదనేది ప్రశ్న? అంటే ఇక్కడ అక్రమ వ్యాపారులకు పోలీసు అధికారులకు ఏదో రకమైన బాండింగ్ ఉండడంతోనే వారి విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లుగా మట్టేవాడ గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. నాలుగు రోజులు గడుస్తున్న నల్ల బెల్లం వ్యాపారుల ఆచూకీ పోలీసులు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు. కాల్ డీటెయిల్స్ రికార్డ్, లొకేషన్ ఇతర అధునాతన టెక్నాలజీతో అనుకున్న సమయంలో అనుకున్నట్టుగా నిందితులను పట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయినప్పటికీ ఎందుకు నల్ల బెల్లం వ్యాపారులను పట్టుకోలేకపోతున్నారనేది గూడూరు మండలంలో విస్తృతంగా చర్చ సాగుతోంది. అంతేకాకుండా కొంతమంది నల్ల బెల్లం వ్యాపారులను కేసుల నుంచి తప్పించేందుకు బేర సారాలు సాగిస్తున్నట్లుగా కూడా ఇంకా ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే ఇలాంటి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించే అధికారులతో జిల్లా ఉన్నతాధికారులకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నందున సంబంధిత పోలీసు అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని మట్టేవాడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Black Jaggery: యథేచ్ఛగా నల్ల బెల్లం దందా.. సహకరిస్తున్నఎక్సైజ్ అధికారులు?

