Iran Unrest: ఇరాన్‌లో ప్రస్తుతం ఆ దేశ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన నిరసన (Iran Unrest) కొనసాగుతున్నాయి. ఒకపక్క ఆర్థిక సంక్షోభం, రాజకీయ అసంతృప్తి, మరోవైపు ప్రభుత్వ కఠిన నిబంధనలకు వ్యతిరేకంగా ఆ దేశంలోని అన్ని ప్రావిన్సుల్లోనూ జోరుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశాధినేత ఖమేనీ దిగిపోవాలంటూ 2025 చివరిలో ప్రారంభమై నిరసనలు ప్రస్తుతం తీవ్రరూపం దాల్చి కొనసాగుతున్నాయి. అయితే, గత రెండు వారాలుగా కొనసాగుతున్న ఈ నిరసనలు, అణచివేతల్లో భద్రతా సిబ్బందితో పాటు మొత్తం 2000 మంది వరకు ప్రాణాలు కోల్పోయారంటూ ఇరాన్ అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయంటూ ప్రభుత్వాధికారులు అంగీకరించడమే కాకుండా, ప్రకటన కూడా చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఒక కీలక అధికారి ఈ విషయాలు తెలిపారు. నిరసనకారులు, భద్రతా సిబ్బంది ఇరువైపుల మరణాల వెనుక ఉగ్రవాదులు ఉన్నారని సదరు అధికారి ఆరోపించారు. అయితే, మృతులకు సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు.
నిరసనలకు కారణాలివే
ఇరాన్ ప్రజలు ఆర్థిక సంక్షోభ పరిస్థితుల పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ అమెరికన్ డాలర్‌తో పోలిస్తే కనిష్ట స్థాయికి పడిపోవడం, ఫలితంగా సామాన్యుల కొనుగోలు శక్తి పూర్తిగా క్షీణించడం పట్ల గుర్రుగా ఉన్నారు. ఆహార పదార్థాలు, మాంసం, బియ్యం వంటి కనీస అవసరాల ధరలు సుమారుగా 70 శాతానికి పైగా పెరగడంతో, ఓపిక పట్టలేక రోడ్లపైకి వచ్చారు. అసలే రేట్లు పెరిగి ఇబ్బంది అవుతుంటే, ఇంధనంపై సబ్సిడీ తగ్గించి, పెట్రోల్ ధరలను పెంచింది. మరోవైపు, అణు కార్యక్రమాల కారణంగా ఇరాన్‌పై అంతర్జాతీయ ఆంక్షలు, ఒత్తిళ్లు కూడా ప్రజల అశాంతికి కారణంగా ఉన్నాయి. ముఖ్యంగా 2025లో ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడులు దేశ భద్రతను, ఆర్థిక వ్యవస్థను మరింత బలహీనపరిచడం పట్ల ఇరానీయుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. ప్రభుత్వ వ్యతిరేకత మరో కారణంగా కనిపిస్తోంది. 2022 నుంచి మహిళ స్వేచ్ఛ కోసం ఉద్యమం జరుగుతూనే ఉంది. హిజాబ్ నిబంధనలు, మతపరమైన ఆంక్షలపై యువతలో ఆగ్రహానికి కారణమయ్యాయి.
Read Also- YS Sharmila: కోటిన్నర మంది మహిళలకు సీఎం చంద్రబాబు మోసం.. సంక్రాంతి వేళ వైఎస్ షర్మిల ఫైర్
మతగురువుల ప్రభుత్వం.. ద్వంద్వ వైఖరి
1979 ఇస్లామిక్ విప్లవం నాటి నుంచి ఇరాన్‌లో మతగురువుల ప్రభుత్వ యంత్రాంగం నడుస్తోంది. ఈ ప్రభుత్వం నిరసన ప్రదర్శనల పట్ల ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుండడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్థిక సమస్యలపై చేసే నిరసనలు చట్టబద్ధమైనవేనని చెబుతూనే, మరోపక్క భద్రతా దళాలతో కఠిన రీతిలో అణిచివేతకు పాల్పడుతోందని ఇరాన్ ప్రజలు చెబుతున్నారు. దేశంలో ఈ అశాంతి పరిస్థితికి అమెరికా, ఇజ్రాయెల్ కారణమని, తమ పౌరులను ఈ దేశాలు రెచ్చగొడుతున్నాయని ఖమేనీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. నిరసనలను ఉగ్రవాదులు హైజాక్ చేశారంటూ ఆరోపణలు చేస్తోంది.

