YS Sharmila: నారావారిపల్లెలో జరుగుతున్న సంక్రాంతి పండుగ ఉత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు ఆనందంగా పాల్గొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొన్న వేళ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వం విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నా మహాశక్తి పథకానికి అతి గతి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగల పేరు చెప్పి కాలయాపన చేయడం మినహా మహిళా సాధికారితపై కమిట్మెంట్ లేదని ఆమె మండిపడ్డారు. పథకం కావాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని ఒకరూ, మహిళలు రెడీగా ఉండమంటూ మరొకరు.. దీపావళి, సంక్రాంతికి ఇస్తామని ఇంకొకరు ఆడబిడ్డల మనోభావాలతో ఆటలాడుతున్నారని విమర్శలు గుప్పించారు. ఆడబిడ్డ నిధి పేరుతో కోటిన్నర మంది రాష్ట్ర మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసింది ఘరానా మోసమేనని ఆమె అభివర్ణించారు.
పచ్చి బూటకపు మాటలు
నెలకు ఇచ్చే రూ.1500లను రూ.15 వేలు చేస్తామన్నారని, రూ.15 వేలను లక్షా 50 వేల రూపాయలకు ఆదాయం పెంచే మార్గం చూపుతామంటూ హామీలు ఇచ్చారని షర్మిల విమర్శించారు. మహిళల అభివృద్ధికి పెద్దపీట అంటూ చెప్పినవన్నీ పచ్చి బూటకపు మాటలని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ హామీల్లో ఆడబిడ్డ నిధి ప్రధాన హామీ అని, 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మహిళలకు ఆర్థికంగా భరోసా ఇచ్చే హామీ ఇదని ఆమె గుర్తుచేశారు. ప్రతి ఏడాది రూ.18 వేలు లబ్ధి చేకూరే పథకానికి రెండేళ్లుగా పంగనామాలు పెడుతూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పుకోడానికి కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీకి సిగ్గు ఉండాలని ఆమె ఘాటుగా స్పందించారు. ఆడబిడ్డ నిధి పథకం ఎప్పటినుంచి అమలు చేస్తారో చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు నచ్చినప్పుడు, ఇష్టం ఉన్నప్పుడు అమలు చేసేవి కావని అన్నారు. మహాశక్తి పథకాన్ని తక్షణం అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని, రాష్ట్ర మహిళల పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె స్పందించారు.
Read Also- Samyuktha Menon: బీటెక్ చేయకపోవడం అదృష్టం అంటున్న సంయుక్తా మీనన్.. ఎందుకంటే?
కూటమి ప్రభుత్వంపై వరుస విమర్శలు
కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల వరుసగా పదునైన విమర్శలు చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంపై కూడా ఆమె ఇటీవలే భగ్గుమన్నారు. నూతన సంవత్సరం మొదలై ఆరు రోజులు గడిచినా ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోవడంపై మండిపడ్డారు. ప్రతిఏటా జనవరి నెల వస్తోంది, పోతుందని, కానీ, సంవత్సరాలు మారుతూ క్యాలెండర్ మారుతున్నా.. 1వ తేదీన ఇస్తామని చెప్పిన జాబ్ క్యాలెండర్‌కు మాత్రం దిక్కులేకుండా పోయిందని ఆమె నిలదీశారు. రికార్డు చేసి పెట్టుకోండని ఇచ్చిన వాగ్దానానికి విలువ లేకుండాపోయిందన్నారు.
Read Also- Mahabubabad: రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకే ‘అరైవ్ అలైవ్’.. ఎస్పీ శబరీష్ కీలక సూచనలు ఇవే!
వైసీపీ పూలు పెడితే.. కూటమి క్యాలీఫ్లవర్లు
నిరుద్యోగ యువతను మోసం చేయడంలో ఎవరూ తక్కువ కాదంటూ విపక్ష వైసీపీపై కూడా షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరిట యువత చెవుల్లో పూలు పెట్టిందని, ఇప్పుడేమో కూటమి ప్రభుత్వం ఏకంగా క్యాలీఫ్లవర్లు పెడుతోందని ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2025 జనవరి 1 నుంచి క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, ఎక్కడ? అని షర్మిల నిలదీశారు. రెండేళ్లలో రెండు జాబ్ క్యాలెండర్ల సంగతేంటి అని ఆమె ప్రశ్నించారు. ఇదిగో అదిగో అని ఊరించడం తప్ప ఉద్యోగాల భర్తీ షెడ్యూల్ ఏది? అని అన్నారు. కూటమి ప్రభుత్వ హామీ జాబ్ క్యాలెండర్ కాదు.. ఇదొక జోక్ క్యాలెండర్ అని విమర్శలు గుప్పించారు. నిరుద్యోగ బిడ్డలను దగా చేసిన దగా క్యాలెండర్ అని ఆమె వ్యాఖ్యానించారు.

