SBI ATM charges: ఎస్‌బీఐ బ్యాంక్ ఖాతాదారులకు కీలకమైన అప్‌డేట్ వచ్చింది. ఏటీఎం (ATM), ఆటోమేటెడ్ డిపాజిట్ కమ్ విత్ డ్రావల్ మెషిన్ (ADWM) ట్రాన్సాక్షన్ ఛార్జీలను సవరించింది. ఫ్రీ లిమిట్ ముగిసిన తర్వాత ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉపయోగించే కస్టమర్లకు ఛార్జీలను (SBI ATM charges) పెంచింది. అయితే, సవరించిన ఈ ఛార్జీలు 2025 డిసెంబర్ 1 నుంచే అమలులోకి వచ్చాయి. ఎస్‌బీఐ ఏతర బ్యాంకుల ఏటీఎంలలో ఉచిత లావాదేవీలు పూర్తయిన తర్వాత, క్యాష్ విత్‌డ్రా చేసిన ప్రతిసారి రూ.23 ఛార్జీతో పాటు జీఎస్టీ చెల్లించాలి. ఇంతకముందు ఛార్జీ రూ.21, అదనంగా జీఎస్టీ పడేది.
నగదు రహిత లావాదేవీలపైనా ఛార్జీలు
నగదు రహిత లావాదేవీలపై కూడా ఛార్జీలు విధిస్తున్నట్టు ఎస్‌బీఐ తెలిపింది. బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్ వంటి ట్రాన్సాక్షన్స్ ఛార్జీ రూ.11, అదనంగా జీఎస్టీ పడుతుంది. గతంలో ఈ ఛార్జీ రూ.10గా ఉండేది. ఇంటర్‌ఛేంజ్ ఫీజులు పెరిగాయని, అందుకే సవరించాల్సి వచ్చిందని తెలిపింది. ఖాతాదారులు ఇప్పటికీ ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు 5 సార్లు ఉచిత లావాదేవీలను ఉపయోగించుకోవచ్చు. అయితే, ఈ పరిమితి దాటిన తర్వాత మాత్రమే కొత్త ఛార్జీలు వర్తిస్తాయి. ఇతర బ్యాంకుల ఏటీఎంలను వాడే సేవింగ్స్, శాలరీ ఖాతాదారులపై ఎఫెక్ట్ చూపుతుంది. అయితే, జనరల్ సేవింగ్స్ ఖాతాదారుల నెలవారీ ఉచిత లావాదేవీల సంఖ్యలో ఎలాంటి మార్పు చేయలేదని ఎస్‌బీఐ క్లారిటీ ఇచ్చింది. గతేడాది 2025 ఫిబ్రవరి తర్వాత ఎస్‌బీఐ ఛార్జీలను సవరించడం ఇదే తొలిసారి.
Read Also- Mahesh Kumar Goud: శ్రీరాముడు బీజేపీలో సభ్యత్వం తీసుకున్నారా?: టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్
శాలరీ ఖాతాదారులకు కొత్త పరిమితులు
శాలరీ ప్యాకేజీ సేవింగ్స్ ఖాతాదారులకు కూడా రూల్స్ మారాయి. గతంలో అన్‌లిమిటెడ్‌గా ఉచిత లావాదేవీలకు అవకాశం ఉండేది. అయితే, ఇకపై ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు 10 ఉచిత లావాదేవీలకు మాత్రమే అనుమతి ఉంటుందని ఎస్‌బీఐ క్లారిటీ ఇచ్చింది. పరిమితి దాటిన తర్వాత, క్యాష్ విత్‌డ్రా చేసిన ప్రతిసారీ రూ.23 ఛార్జీతో పాటు అదనంగా జీఎస్టీ పడుతుంది. నగదు రహిత లావాదేవీలపై రూ.11, జీఎస్టీ అదనంగా పడుతుంది.
Read Also- Maternity Kit: రాష్ట్రంలో గర్భిణీ స్త్రీలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..?
ప్రభావం ఉండని ఖాతాదారులు వీళ్లే
ఏటీఎం సహా కీలక సేవలకు సంబంధించిన సేవలను సవరించినప్పటికీ, కొన్ని కేటగిరీలకు చెందిన ఖాతాదారులపై ప్రభావం ఉండబోదని ఎస్‌బీఐ తెలిపింది. బీఎస్‌బీడీ (బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్) ఖాతాదారులకు పాత ఛార్జీలే యథావిథిగా కొనసాగుతాయని వివరించింది. ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులు ఎస్‌బీఐ ఏటీఎంలను ఉపయోగిస్తే ఎలాంటి ఛార్జీలు ఉండవని, ఉచితమని తెలిపింది. మరోవైపు, కార్డ్‌లెస్ విత్ డ్రావల్ అంటే, కార్డు లేకుండానే ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి ఉచితంగా క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చని వివరించింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ ఖాతాదారులకు ఈ కొత్త ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుందని క్లారిటీ ఇచ్చింది.

