Jio IPO 2026: దేశీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీవో (Initial Public Offering) ఏదైనా ఉందా?.. అంటే, నిస్సందేహంగా రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ (Reliance Jio Platforms IPO) అని చెప్పవచ్చు. దాదాపు ఏడాదిన్నర కాలంగా జియో ఐపీవోపై జోరుగా వార్తలు, ఊహాగానాలు వెలువడుతున్నా, ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేదు. అయితే, తాజాగా కీలకమైన అప్‌డేట్ వచ్చింది. ఈ ఏడాది 2026లో ఐపీవో ద్వారా (Jio IPO 2026) జియో ప్లాట్‌ఫామ్స్‌లోని 2.5 శాతం వాటాను విక్రయించాలని కంపెనీ యోచిస్తున్నట్టుగా కంపెనీ వర్గాలు పక్కా సమాచారాన్ని తెలిపాయి. దీని విలువ సుమారుగా 4 బిలియన్ డాలర్లు వరకు ఉంటుందని, అంటే, భారతీయ కరెన్సీలో రూ.36 వేల కోట్ల వరకు ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దేశంలోనే ఇది అతిపెద్ద ఐపీవోగా అవతరించే అవకాశం ఉంటుందని తెలిపాయి. కాగా, భారతదేశంలోనే అత్యంత సంపన్నుడైన ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో దేశంలోనే అతిపెద్ద టెలికం ఆపరేటర్‌గా ఉంది. దేశవ్యాప్తంగా 50 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. దీంతో, జియో ఐపీవోపై ఇన్వెస్టర్లలో ఎనలేని ఆసక్తి నెలకొంది.
విస్తరించిన జియో వ్యాపారం
రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ వ్యాపారం గత ఆరేళ్ల వ్యవధిలో గణనీయంగా విస్తరించింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలోకి కూడా అడుగుపెట్టి, లాభాలు గడిస్తోంది. కేకేఆర్, జనరల్ అట్లాంటిక్, సిల్వర్ లేక్, అబుదాబీ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ వంటి దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. అయితే, జియో వాటాలోని కేవలం 2.5 శాతాన్ని మాత్రమే రిలయన్స్ ఐపీవో ద్వారా విక్రయింవచ్చంటూ కంపెనీ వర్గాలు చెప్పాయి.
వాస్తవానికి పెద్ద కంపెనీలు గతంలో గరిష్ఠం 5 శాతం వరకు వాటాను ఐపీవో ద్వారా విక్రయించుకునేందుకు అవకాశం ఉండేది. కానీ, ఆ పరిమితిని 2.5 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన అనుమతులను ఆర్థిక మంత్రిత్వశాఖ ఇంకా జారీ చేయలేదు. అయితే, కేంద్రం నిర్ణయానికి తగినట్టుగానే 2.5 శాతం మేర వాటాను విక్రయించేలా ఏర్పాట్లు చేస్తుండడం గమనార్హం. కాగా, కొన్ని సంస్థల అంచనా ప్రకారం, జియో వ్యాపార విలువ 200 బిలియన్ డాలర్ల నుంచి 240 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనాగా ఉంది.
Read Also- Ambani-Adani: వామ్మో.. ఒకే రోజు అంబానీ, అదానీలకు చెరో రూ.22 వేల కోట్లకుపైగా నష్టం.. ఎందుకంటే?
జియో ఐపీవో ప్రారంభమైతే, గత కొన్నేళ్లుగా జోష్‌లో ఉన్న ఐపీవో మార్కెట్‌లో మరింత హుషారును పెంచినట్టు అవుతుందని స్టాక్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా, గతేడాది 2025లో అత్యధిక ఐపీవోలు నమోదైన ప్రపంచ టాప్-2 స్థానంలో భారతీయ స్టాక్ మార్కెట్లు నిలిచాయి. డిసెంబర్ 18 నాటికి ఐపీవోల ద్వారా ఏకంగా 21.6 బిలియన్ డాలర్ల మేర నిధులు సమీకరించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కాగా, రిలయన్స్ జియోను ఐపీవోకి తీసుకురావాలని 2019లోనే ముకేష్ అంబానీ భావించారు. 2025లో కచ్చితంగా జరుగుతుందని ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ, జరగలేదు. ఆలస్యమవుతున్నా కొద్దీ కంపెనీ వ్యాల్యూ అమాంతం పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే.

