Indian Woman Murder: అగ్రరాజ్యం అమెరికాలో మరో ఘోరం చోటుచేసుకుంది. మేరీల్యాండ్ (Maryland) నగరంలోని ఓ అపార్ట్ మెంట్ లో భారత సంతతి యువతి హత్యకు గురైంది. చనిపోయిన మహిళను 27 ఏళ్ల నికితా గోదిశాల (Nikitha Godishala)గా పోలీసులు గుర్తించారు. ఆమె ఎల్లికాట్ సిటీ (Ellicott City)కి చెందిన వారని, డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్టుగా పనిచేస్తున్నారని హోవార్డ్ కౌంటీ పోలీసులు తెలిపారు. అయితే నికితా మాజీ ప్రియుడు అర్జున్ శర్మ (26) ఇంట్లోనే ఆమె మృతదేహాం లభించడంతో అతడిపై అనుమానాలు మెుదలయ్యాయి. న్యూయర్ వేడుకల తర్వాత ఈ హత్య జరగ్గా అప్పటి నుంచి అర్జున్ శర్మ కనిపించడం లేదని దర్యాప్తు అధికారులు తెలిపారు.
పోలీసులకు అర్జున్ శర్మ ఫిర్యాదు
దర్యాప్తు సంస్థలు ఇచ్చిన సమాచారం ప్రకారం.. అనుమానితుడు అర్జున్ శర్మ (Arjun Sharma)నే తొలుత నికితా గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. జనవరి 2న పోలీసులకు స్వయంగా ఫోన్ చేసి.. డిసెంబర్ 31న మేరిల్యాండ్ నగరంలోని తన అపార్ట్ మెంట్ లో ఆమెను చివరిసారిగా చూశానని చెప్పారు. దీంతో అమెరికన్ డిటెక్టివ్ లు అపార్ట్ మెంట్ లో జనవరి 3న సెర్చ్ వారెంట్ జారీ చేశారు. అర్జున్ శర్మ ఫ్లాట్ లోకి వెళ్లి తనిఖీ చేయగా.. రక్తపు మడుగులో నికితా మృతదేహాం కనిపించింది. ఆమె శరీరంపై కత్తిపోట్లను అధికారులు గుర్తించారు.
అరెస్టు వారెంట్ జారీ..
అయితే ఫిర్యాదు చేసిన రోజే అర్జున్ శర్మ.. భారత దేశానికి వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 31 రాత్రి 7 గంటల ప్రాంతంలో నికితాను అర్జున్ హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని.. హత్యకు గల కారణాలపై ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదని పోలీసులు స్పష్టం చేశారు. భారత్ కు పారిపోయిన అర్జున్ ను పట్టుకునేందుకు ఫెడరల్ లా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీ (Law Enforcement Agencies)లతో కలిసి పనిచేస్తున్నామని హోవార్డ్ కౌంటీ పోలీసులు (Howard County police) వెల్లడించారు.
Also Read: Phone Tapping Case: హరీశ్ విచారణకు అనుమతివ్వండి.. సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్!
భారత రాయబార కార్యాలయం స్పందన
మరోవైపు భారత యువతి నికితా గోదిశాల మృతిపై భారత రాయబార కార్యాలయం (Indian Embassy) సైతం స్పందించింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. దర్యాప్తునకు సంబంధించి స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుంటున్నట్లు తెలిపింది. నికితా ఫ్యామిలీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఓ ప్రకటనలో తెలియజేసింది. కాగా, క్రిమినల్స్ ను ఇచ్చిపుచ్చుకునే విషయంపై భారత్ – అమెరికా గతంలోనే ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కోర్టు సమీక్షలు, దౌత్యపరమైన సంప్రదింపుల అనంతరం అర్జున్ శర్మను అమెరికాకు తరలించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

