Hyberabad Police: సంక్రాంతి వస్తుండటంతో త్వరలో సగం సిటీ ఖాళీ కానుంది. ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు పండుగ సెలవుల్లో తమ స్వస్థలాలకు వెళ్లడానికి ప్లాన్లు చేసుకుంటున్నారు. రైలు, బస్ టికెట్లను రిజర్వ్ చేసుకుంటున్నారు. అదే సమయంలో దొంగల ముఠాలు కూడా చోరీలకు ప్లాన్లు వేసుకుంటున్నాయి. ఎక్కడ అదను దొరికినా ఇల్లు గుల్ల చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ఊళ్లకు వెళ్లేవారు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ క్రైం డీసీపీ ముత్యం రెడ్డి హెచ్చరించారు. డిపార్ట్‌మెంట్ తరపున పండుగ సెలవుల్లో దొంగతనాలకు చెక్ పెట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీని కోసం పగలుతోపాటు రాత్రుళ్లు గస్తీని ముమ్మరం చేయనున్నట్టు చెప్పారు.
ఈ జాగ్రత్తలు తీసుకోండి…
జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్ము, సొత్తు దొంగల పాలు కాకుండా చూసుకోవాలంటే ప్రతీ ఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డీసీపీ ముత్యం రెడ్డి తెలిపారు. కాస్త ఖర్చయినా భరించగలిగే వారంతా తమ తమ ఇళ్లల్లో సీసీ కెమెరాలు పెట్టుకోవాలన్నారు. నమ్మకంగా ఉండే ఇరుగుపొరుగుతో ఇంటిపై ఓ కన్నేసి పెట్టమని చెప్పాలన్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లను ఇంటి ఆవరణలోనే పార్క్ చేసుకోవాలని సూచించారు. బీరువా తాళం చెవులను ఇంట్లో పెట్టవద్దని చెప్పారు. తాళం కనిపించకుండా ఉండడానికి తలుపులకు పరదాలు వేయాలని తెలిపారు. బయటకు కనిపించేలా ఇంట్లో ఓ లైట్‌ను వెలిగించి ఉంచాలని తెలిపారు. ఎన్ని రోజులు ఊరికి వెళ్తారో అన్ని రోజులు ఇంటికి దినపత్రికలు, పాల ప్యాకెట్లు తెప్పించుకోవద్దన్నారు. తలుపుల ముందు అవి కనిపిస్తే ఇంట్లో ఎవరూ లేరన్న విషయం దొంగలకు తెలిసిపోతుందని చెప్పారు.
నగదు బ్యాంక్ లాకర్లలో పెట్టండి
ఇంట్లో పని మనుషులు ఉంటే రోజూ వాకిలి ఊడ్వమని చెప్పాలని సూచించారు. బంగారు నగలు, నగదును బ్యాంక్ లాకర్లలో పెట్టుకుంటే సురక్షితంగా ఉంటాయన్నారు. ఎక్కువ రోజులు వెళ్తున్నట్టయితే విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలని సూచించారు. విలువైన సొత్తును బ్యాగుల్లో తీసుకుని ప్రయాణమైతే వాటిని దగ్గర పెట్టుకోవాలన్నారు. ఇంటి తలుపులకు సెంట్రల్ లాకింగ్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇక, సీసీ కెమెరాలను ఆన్‌లైన్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని సూచించారు. సీసీ కెమెరాల డీవీఆర్‌ను రహస్య ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలన్నారు. డోర్‌కు గ్రిల్ పెట్టుకుంటే రెండంచెల రక్షణ ఉంటుందని తెలిపారు. ఇంటి బయట మోషన్ సెన్సర్ లైట్లు పెట్టుకోవాలని చెప్పారు. ఇంటి ముందు ఏదైనా కదలికలు ఉంటే వెంటనే ఆ లైట్లు వెలుగుతాయన్నారు.
Also Read: Bhatti Vikramarka: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈఎంఐల కష్టాలు తీర్చేందుకు ఒకటో తేదీ కొత్త విధానం!
ఈ నెంబర్లకు కాల్ చేయండి
నగరప్రజలు గస్తీ పోలీసులకు సహకరించాలని సైబరాబాద్ క్రైం డీసీపీ ముత్యం రెడ్డి సూచించారు. కొత్తగా అనుమానాస్పదంగా వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. ఊళ్లకు వెళ్లే ముందు ఎన్ని రోజులు పోతున్నారన్న విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. దీని వల్ల ఆయా ప్రాంతాల్లో నిఘా పెట్టే అవకాశం ఉంటుందని చెప్పారు. సోషల్ మీడియాలో ఎలాంటి సమాచారాన్ని షేర్ చేసుకోవద్దన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 9440617444, 100 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని చెప్పారు.

