GHMC: జీహెచ్ఎంసీలో అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ హెల్త్ (ఏఎంఓహెచ్)ల విధుల్లో కమిషనర్ ఆర్.వి. కర్ణన్(RV Karnan) భారీ మార్పులు చేపట్టారు. ఇప్పటివరకు శానిటేషన్ పనులు, బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు(Birth and death certificates), ట్రేడ్ లైసెన్సుల జారీ వంటి పౌర సేవలను పర్యవేక్షించిన వీరికి ఇకపై కేవలం ఆరోగ్య సంబంధిత విధులను మాత్రమే కేటాయించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయన సరికొత్త డ్యూటీ చార్ట్‌ను సిద్ధం చేశారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన మెడికల్ ఆఫీసర్లు, తమ అసలు విధులను పక్కనపెట్టి ఇతర పనులపై దృష్టి సారించడం, శానిటేషన్ పనులు అస్తవ్యస్తం కావడం వంటి ఆరోపణల నేపథ్యంలో కమిషనర్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో కర్ణన్ అధికారికంగా ప్రకటించే యోచనలో ఉన్నట్లుగా తెలిసింది.
బాధ్యతలు ఇక ఇంజనీర్లకే..
హైదరాబాద్‌లో ఇమ్యునైజేషన్ ప్రక్రియ ఆశించిన స్థాయిలో జరగడం లేదని గుర్తించిన కమిషనర్ కర్ణన్, ఏఎంఓహెచ్‌లను ఇకపై సర్కిళ్ల వారీగా ఇమ్యునైజేషన్ ఆఫీసర్లుగా నియమించనున్నారు. ప్రజారోగ్యాన్ని ప్రభావితం చేసే సీజనల్ వ్యాధులు, దోమల నివారణ, కుక్క కాట్ల నివారణ వంటి విధులను వీరికి అప్పగించనున్నారు. దేశంలోని ఇతర నగరాల తరహాలోనే జీహెచ్ఎంసీలోని 60 సర్కిళ్లలో ఇకపై శానిటేషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ విధులను పూర్తిగా డిప్యూటీ ఇంజనీర్లు పర్యవేక్షిస్తారు. వారికి సహాయకంగా ప్రతి సర్కిల్‌కు ఒక అసిస్టెంట్ ఇంజనీర్‌ను కేటాయించనున్నారు.
Also Read: New District: మరో కొత్త జిల్లాకు ప్రభుత్వం శ్రీకారం!.. ఎక్కడంటే?
మరో కీలక నిర్ణయం
ప్రజారోగ్యానికి సంబంధించిన విధులను మాత్రమే ఏఎంఓహెచ్‌లు నిర్వహించాలని భావిస్తున్న కమిషనర్, ప్రస్తుతం అదనపు కమిషనర్ (శానిటేషన్) పర్యవేక్షణలో ఉన్న దోమల నివారణ వింగ్ ఎంటమాలజీ, కుక్కలు, కోతుల నివారణ చర్యలు చేపడుతున్న వెటర్నరీ వింగ్‌లను త్వరలోనే అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లు పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిసింది. దోమల నివారణకు వినియోగించే ఫాగింగ్ యంత్రాలు ఎక్కడ, ఎప్పుడు, ఎలా వినియోగించాలన్న నిర్ణయం మెడికల్ ఆఫీసర్లు స్వచ్ఛందంగా తీసుకునే వెసులుబాటు ఉంటే, డెంగీ, మలేరియా నివారణలో ఆశించిన ఫలితాలు సాధించగలమని కమిషనర్ కర్ణన్ భావిస్తున్నట్లు సమాచారం.
ఫుడ్ సేఫ్టీపై నిఘా
ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ప్రబలే సమయానికి ముందే మెడికల్ ఆఫీసర్లు ముందస్తుగా దోమల నివారణకు కావల్సిన ఫాగింగ్ చేయిస్తే, డెంగీ వ్యాధి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లవుతుందని కమిషనర్ భావిస్తున్నారు. దీనికి తోడు జోన్ల వారీగా ఫుడ్ సేఫ్టీ వింగ్‌ను కూడా పటిష్ట పరిచే విషయంపై కమిషనర్ దృష్టి సారించినట్లు సమాచారం. ఫుడ్ సేఫ్టీ వింగ్ స్ట్రాంగ్‌గా పని చేసి, మంచి ఫలితాలు సాధించినప్పుడే ప్రజల ఆరోగ్యాన్ని శాసించే కల్తీ ఆహార విక్రయం, కాలం చెల్లిన సామాగ్రితో తయారు చేసిన ఆహార విక్రయాలకు బ్రేక్ పడుతుందని, ఎక్కడైనా ఆహారం, నీరు కలుషితమైనప్పుడు వాస్తవాలు తేల్చేందుకు కూడా ఏఎంఓహెచ్‌లను వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.
Also Read: Kotha Prabhakar Reddy: దుర్గం చెరువు కబ్జా.. బీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డిపై కేసు

