Hydraa – Kite Festival: హైడ్రా అభివృద్ధి చేసిన చెరువులు ఉత్సవాలకు వేదికలుగా మారుతున్నాయి. గతేడాది బతుకమ్మ ఉత్సవాలకు అంబర్‌పేటలోని బతుకమ్మకుంట వేదికైతే.. కొత్త సంవత్సరంలో కైట్ ఫెస్టివల్‌కు మరి కొన్ని చెరువులు ముస్తాబయ్యాయి. మాధాపూర్‌లోని తమ్మిడికుంట, కూకట్‌పల్లిలోని నల్లచెరువు, పాతబస్తీలోని బమ్-రుక్న్ – ఉద్ – దౌలా చెరువులు ఇప్పుడు కైట్ ఫెస్టివల్‌కు వేదికలయ్యాయి. హైడ్రాతో వచ్చిన మార్పును చూసి నగర ప్రజలు మురిసిపోతున్నారు. ఆక్రమణలకు గురై.. చెరువు ఆనవాళ్లను కోల్పోయిన చెరువులు హైడ్రా చర్యలతో కొత్తగా కనిపిస్తున్నాయి.
11వ తేదీ నుంచి కైట్ ఫెస్టివల్
సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ కైట్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈసారి హైడ్రా బాగు చేసిన చెరువుల వద్ద కైట్ ఫెస్టివల్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 11వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగే కైట్ ఫెస్టివల్‌కు నగరంలోని పలు చెరువులను హైడ్రా సిద్ధం చేసింది. ఆక్రమణలకు గురై 14 ఎకరాలకు కుంచించుకుపోయిన మాధాపూర్‌లోని తమ్మిడికుంట చెరువును 30 ఎకరాలకు హైడ్రా విస్తరించింది. అలాగే కూకట్‌పల్లిలోని నల్ల చెరువు విస్తీర్ణాన్ని కూడా 16 ఎకరాల నుంచి 30 ఎకరాలకు పెంచింది. పాతబస్తీలోని బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువు తాగు నీటి అవసరాలను తీర్చేలా 104 ఎకరాల మేర ఈ చెరువు విస్తరించి ఉందని చరిత్ర చెబుతోంది.
Also Read: 2026 Assembly Elections: ఫుల్ పొలిటికల్ హీట్.. 2026లో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు ఇవే
నయన మనోహరంగా..
కాలక్రమంలో చెరువు విస్తీర్ణం తగ్గుతూ హెచ్ ఎండీఏ బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువును 17.05 ఎకరాలుగా నిర్ధారించింది. చివరికి 4.12 ఎకరాలుగా మిగిలిపోయింది. ఇప్పుడీ చెరువును 17 ఎకరాలకు విస్తరించి నయనమనోహరంగా హైడ్రా తీర్చిదిద్దింది. ఇటీవల గ్లోబల్ సమ్మిట్‌కు హాజరైన పర్యావరణవేత్తలు హైడ్రా అభివృద్ధి చేసిన చెరువులను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హైడ్రాలాంటి వ్యవస్థ దేశవ్యాప్తంగా ఉండాలని అభినందించారు. హైడ్రా మొదట విడత చేపట్టిన 6 చెరువుల్లో బతుకమ్మకుంట ఇప్పటికే ప్రారంభం కాగా.. తమ్మిడికుంట, బమ్-రుక్న్-ఉద్-దౌలా, నల్లచెరువులు ప్రారంభానికి సిద్ధమై ఈ ఏడాది జరగనున్న కైట్ ఫెస్టివల్‌కు వేదికలయ్యాయి. మాధాపూర్‌లోని సున్నం చెరువు, ఉప్పల్‌లోని నల్లచెరువు ఇంకా అభివృద్ధి దశలో ఉన్నాయి.

