Hyderabad Liquor sales: హైదరాబాద్ లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త ఏడాదికి నగరవాసులు సాదర స్వాగతం పలికారు. రహదారులపై ఉత్సాహంగా తిరుగుతూ కేరింతలు కొట్టారు. అటు గ్రేటెడ్ కమ్యూనిటీల్లోనూ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఆటలు, పాటల నడుమ భాగ్యనగరం 2026లోకి అడుగుపెట్టింది. అయితే డిసెంబర్ 31 రాత్రి సందర్భంగా హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు ప్రకటించాయి.
రూ.350 కోట్ల మద్యం సేల్..
న్యూయర్ సందర్భంగా హైదరాబాద్ లో భారీగా మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. డిసెంబర్ 31 రాత్రి నగరవ్యాప్తంగా రూ. 350 కోట్లకు పైగా లిక్కర్ సేల్స్ జరిగినట్లు పేర్కొంది. డిసెంబర్ 25 నుంచే వైన్స్, బార్ షాపుల్లో విక్రయాలు గణనీయంగా పెరిగినట్లు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. మద్యం అమ్మకాల ద్వారా భారీగా ఆదాయాన్ని గడించాయని తెలిపాయి. ఈ క్రమంలో డిసెంబర్ నెలకు గానూ హైదరాబాద్ లో మెుత్తం మద్యం అమ్మకాలు రూ.5050 కోట్లకు చేరినట్లు ఎక్సైజ్ వర్గాలు వెల్లడించాయి.
Also Read: TG ACB Rides: 2025 లో ఏసీబీ దూకుడు.. వందల కోట్ల అక్రమాస్తుల పూర్తి సమాచారం ఇదే..!
చివరి రెండ్రోజుల్లో రూ.750 కోట్లు..
డిసెంబర్ నెలలో మరి ముఖ్యంగా చివరి రెండ్రోజుల్లో (30, 31 తేదీలు) భారీగా మద్యం సేల్స్ జరిగినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఈ రెండ్రోజులు కలిపి రూ.750 కోట్లకు పైగా మద్యం నగరంలో అమ్ముడుపోయినట్లు స్పష్టం చేసింది. 2023, 2024 ఏడాదితో పోలిస్తే ఈ డిసెంబర్ నెలలో గణనీయంగా మద్యం సేల్స్ పెరిగినట్లు తెలుస్తోంది. ఏకంగా రూ. 1300కు పైగా మద్యం అమ్మకాలు పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ నివేదిక పేర్కొంది.
రాత్రి 12 గంటల వరకూ నాన్ స్టాప్..
నగరంలో న్యూయర్ జోష్ ను ముందుగానే అంచనా వేసిన ఎక్సైజ్ శాఖ.. అర్ధరాత్రి 12 గంటల వరకూ మద్యం విక్రయించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రెండ్రోజుల క్రితమే మద్యం షాపులకు ఆదేశాలు వెళ్లాయి. అటు ఒంటిగంట వరకూ బార్ షాపులు తెరుచుకోవచ్చని కూడా సూచించింది. ఈ నేపథ్యంలో మద్యం విక్రయాలు గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి వేళ కూడా మద్యం షాపుల వద్ద మందుబాబుల తాకిడి కనిపించింది.

