Bulkapur Nala: బుల్కాపూర్ నాలాను బహుళ అంతస్తుల నిర్మాణ కాంట్రాక్టర్లు పూడ్చివేశారు. సంరక్షించాల్సిన ఇరిగేషన్ శాఖ అధికారులు ఎన్‌ఓసీలు జారీ చేసి వారికి వంత పాడినట్లు ప్రచారం సాగుతున్నది. అధికారులు ఇచ్చిన క్లియరెన్స్‌తో ఇష్టానుసారంగా కబ్జాదారులు వ్యవహరిస్తున్నారు. అధికారుల అనాలోచిత చర్యలతో భవిష్యత్తులో ముంపు సమస్యలు తప్పవని స్ధానికులు ఆందళన వ్యక్తం చేస్తున్నారు.
హుస్సేన్‌సాగర్ దాకా నాలా.. కానీ..
శంకర్ పల్లి మండలంలో ప్రారంభమైన బుల్కాపూర్ చెరువు నుంచి గండిపేట, కోకాపేట్ మణికొండ, రాయదుర్గం, షేక్ఏట్, హకీంపేట్, ఫస్ట్ లాన్సర్, చింతల్ బస్తీ, ఖైరతాబాద్ మీదుగా హుస్సేన్‌సాగర్ వరకు నాలా విస్తరించి ఉన్నది. అధికారుల నిర్లక్ష్యంతో అనేక ప్రాంతాల్లో కబ్జాకు గురయ్యింది. ప్రధానంగా రాయదుర్గం, మణికొండ సరిహద్దుల్లో కిలోమీటర్ల పొడువునా 50 ఫీట్ల వెడల్పుతో ఉంటుంది. దీనిని పూర్తిగా పూడ్చి వేసిన పరిస్థితి ఉన్నది. కొంతమంది సిమెంట్ పైపులు వేసి పూర్తిగా మట్టితో కప్పేశారు. దీంతో నూతనంగా నిర్మాణం చేసే ఇండ్లు అన్నీ వరదలకు జలమయం కావడం ఖాయమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: SP Dr P Shabarish: అల్లర్లు తగ్గాయి.. అత్యాచారాలు, హత్యలు పెరిగాయ్.. మహబూబాబాద్ క్రైమ్ రిపోర్ట్
హైడ్రాకు బాధ్యత లేదా?
కబ్జాలకు గురవుతున్న నాలాలు, చెరువులను కాపాడేందుకు హైడ్రా ఏర్పాటైంది. అయితే, బుల్కాపూర్ నాలా విషయంలో నిర్లక్ష్యం తగదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నాలా పక్కనే బహుళ అంతస్తుల భవనం నిర్మాణం చేస్తున్నారు. నిర్మాణదారులు అపార్ట్‌మెంట్ లోపలికి వెళ్లేందుకు రహదారి ప్రాంతం మొత్తం బుల్కాపూర్ నాలానే అని స్థానికులు వివరిస్తున్నారు. ఇంత బహిరంగంగా నాలాను పూడ్చి వేస్తుంటే అధికారులు పట్టించుకోవడం లేదు. హైడ్రా సైతం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 15 రోజుల క్రితం నాలా వచ్చే ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. కానీ, దానిపై క్లారిటీకి రాలేకపోతున్నారని సమాచారం.
ఓ నేత అండదండతోనే..
అమృత కన్‌స్ట్రక్షన్ తన తప్పును కప్పి పుచ్చుకునేందుకు అధికారులను మ్యానేజ్ చేస్తున్నదనే ప్రచారం ఉన్నది. భవన నిర్మాణానికి ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన ఎన్‌ఓసీ ఆధారంగా హెచ్ఎండీఏ అనుమతి ఇచ్చింది. కానీ, అది ఇచ్చిన ఇరిగేషన్ అధికారులు ఏ ప్రామాణికంగా ఇచ్చారు అనేది సస్పెన్స్. నిర్మాణ సంస్థ ఇచ్చిన గిఫ్టుకు ఇరిగేషన్ అధికారులు న్యాయం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా అధికారులు ఎన్ఓసీ ఇచ్చి ఉంటే ఈ వ్యవహారం న్యూస్ అయ్యేది కాదు. ఒక్క అమృత కన్‌స్ట్రక్షన్ యాజమాన్యానికే కాదు బుల్కాపూర్ నాలా వెంట నిర్మాణాలు చేపడుతున్న ప్రతి ఒక్కరికీ ఇరిగేషన్ అధికారులు అండగా నిలబడ్డారు. ఈ విషయం హైడ్రా అధికారులకు తెలిసినప్పటికీ చర్యలు తీసుకునేందుకు ఓ నేత ఆదేశాలతో మౌనం వహిస్తున్నట్లు ప్రచారం సాగుతున్నది.
Also Read: Bandla Ganesh: మరో కొత్త బ్యానర్ స్టార్ట్ చేసిన నిర్మాత బండ్ల గణేష్.. అది ఏంటంటే?

