Commissioner Sunil Dutt: నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్(Sunil Dhath) తెలిపారు. జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ.. డిసెంబర్ 31 రాత్రి జాతీయ రహదారి, ప్రధాన రహదారులపై వేడుకలు నిషేధించబడ్డాయని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. ముఖ్యంగా మద్యం తాగి వాహనాలను నడపవద్దని, మితిమీరిన వేగంతో ద్విచక్ర వాహనాలు నడిపి ప్రమాదాలకు గురై తల్లిదండ్రులను క్షోభకు గురిచేయవద్దన్నారు.
మహిళల భద్రత
మద్యం దుకాణదారులు నిర్ణీత సమయం వరకే విక్రయాలు చేయాలన్నారు. అర్ధరాత్రి గుంపులు గుంపులుగా తిరుగుతూ.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకునేలా స్నేహపూర్వక వాతావరణంలో శుభాకాంక్షలు తెలుపుకోవాలని విద్యార్థులు, యువతకు సూచించారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ షీ టీమ్స్ ప్రత్యేకంగా పర్యవేక్షణ చేపడతాయని స్పష్టం చేశారు.
Also Read: Shambhala: ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్ కొట్టేశారు.. ‘శంబాల’పై రెబల్ స్టార్!
సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా..
శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ట్రాఫిక్(Trafic), టాస్క్ ఫోర్స్(Task Forve), షీ టీమ్స్(She Teams), పెట్రోలింగ్(Petroling) బృందాలు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తాయని తెలిపారు. డీజేలకు అనుమతి లేదని, బాణసంచా కాల్చడంపై నిషేధం ఉంటుందని తెలిపారు. నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు చేపడతామని, డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. బార్లు, వైన్ షాపులు నిర్దేశిత సమయానికి మూసివేయాలని, మైనర్లకు మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రెస్టారెంట్లు, షాపుల పరిసరాల్లో సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. అసభ్యకర డాన్స్ కార్యక్రమాలు నిర్వహించరాదని హెచ్చరించారు. డ్రంకెన్ అండ్ డ్రైవింగ్ పరీక్షలు కట్టుదిట్టంగా అమలు చేస్తామని, మైనర్లకు వాహనాలు ఇచ్చే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అర్థరాత్రి యువకులు నిర్లక్ష్యంగా అధిక వేగంతో వాహనాలు నడపకుండా, బైక్ రేసులు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు కొనసాగుతుందన్నారు.

