Desk Journalists: వర్కింగ్ జర్నలిస్టులు అందరితో పాటు డెస్క్ జర్నలిస్టులందరికీ కూడా బస్ పాస్‌లతో సహా, ఇతర అన్ని సంక్షేమ పథకాలు వారికి వర్తిస్తాయని టీయూడబ్ల్యూజే (ఐజేయు) సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్, ఎలక్ట్రానిక్ విభాగం జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్(Anil Kumar)), ప్రధాన కార్యదర్శి ఆసిఫ్ పేర్కొన్నారు. ఈ విషయంలో కొంతమంది అనేక అనుమానాలు, అపోహలు కల్పిస్తున్నారని వారు సోమవారం పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి విషయంలో తమ సంఘం ఏనాడు కూడా వెనకడుగు వేయలేదని, రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ ఆధ్వర్యంలో నిరంతర పోరాటం చేస్తున్నామని జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి స్పష్టం చేశారు. తమ సంఘం మడమ తిప్పని పోరాటం చేయడం వల్లనే, గ్రామీణ ప్రాంత జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్ కార్డులు వచ్చిన సంగతిని మరిచిపోరాదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాకుండా బస్సు పాసులను అందరికీ ఇచ్చే విధంగా కృషి చేసింది కూడా తమ సంఘమేనని వివరించారు.
గతంలో పోరాటం..
జర్నలిస్టులకు హెల్త్ కార్డు లు మంజూరు చేయించింది కూడా తమ సంఘమేనని వెల్లడించారు. అర్హులందరికీ ఇంటి స్థలాలు వచ్చే విధంగా కృషి చేసిన సంగతి వర్కింగ్ జర్నలిస్టుల అందరికీ తెలుసునని యాదగిరి పేర్కొన్నారు.252 జీవో ద్వారా 13 వేల మందికి అక్రిడేషన్ కార్డులు తగ్గుతాయని పూర్తిగా అవాస్తవమని అన్నారు. కొందరు పనిగట్టుకొని చేస్తున్నందుకు ప్రచారాన్ని విజ్ఞులైన జర్నలిస్టులు ఖండించాలని కోరారు. 13వేల కార్డులు తగ్గుతాయని ఏ రకంగా లెక్క వేశారో అని ప్రశ్నించారు.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బస్సు పాసులు పనిచేసేందుకు గతంలో పోరాటం చేశామన్నారు. అంతే కాకుండా జర్నలిస్టుల సంక్షేమం కోసం గత 70 ఏళ్లుగా పాటుపడుతున్న తమ సంఘం డెస్క్ జర్నలిస్టులకు ప్రభుత్వం అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. బస్ పాస్ లతో సహా అన్ని సంక్షేమ పథకాలను వారికి వర్తింపజేసేందుకు తన సంఘం రాష్ట్ర నాయకులు భరోసా ఇచ్చారు. డెస్క్ జర్నలిస్టులను ఇతర జర్నలిస్టులను తాము వేరుగా చూడడం లేదని, వారికి కూడా బస్ పాస్ లతో సహా ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటిని తప్పకుండా వర్తింప చేయిస్తామని అన్నారు.
Also Read: Jagapathi Babu: షాకింగ్ లుక్‌లో జగపతిబాబు.. ‘పెద్ది’ పోస్టర్ వైరల్!
డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం
గత 10 ఏళ్ల కాలంలో డెస్క్ జర్నలిస్టులకు కొంతమందికి మాత్రమే అక్రిడేషన్ కార్డులు ఇచ్చారని, కానీ ఇప్పుడు తాము డెస్క్ లో పనిచేసే జర్నలిస్టులందరికీ మీడియా కార్డులు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డుతో పాటు ఇతర సంక్షేమ పథకాలను వర్తింపజేసేలా కృషి చేస్తామన్నారు. అదేవిధంగా నానాటికి జర్నలిజంలో అడుగంటుతున్న విలువలను పెంపొందించేందుకే కొన్ని కట్టుదిట్టమైన నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 252 జీవోను తీసుకొచ్చిందని ఆయన తెలిపారు. ఉనికి చాటుకోవడానికి కొన్ని సంఘాలు, డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందంటూ గగ్గోలు పెడుతున్నాయని బండారు యాదగిరి అన్నారు. అబద్దాలు, కల్పితాలతో కొందరు చేస్తున్న అపోహలు నమ్మవద్దని జర్నలిస్టులను కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జర్నలిస్టులకు ఇచ్చిన అక్రిడిటేషన్ కార్డులు ఎంతవరకు పని చేశాయో..? దానికి కారణం ఎవరన్నది ప్రతి జర్నలిస్ట్ కు తెలుసునన్నారు. జర్నలిస్టులను తీవ్ర నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న సంఘాలే నేడు జర్నలిస్టులకు మేలు జరుగుతోందంటే ఓర్చుకోలేకనే రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగుతున్నారని యాదగిరి ఎద్దేవా చేశారు.
1996 సంవత్సరానికి ముందు..
జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుంటే పోరాటం చేసే ఏ సంస్థలకైనా, ఏ సంఘాల కైనా టియుడబ్ల్యూజే మద్దతు ఉంటుందని, అయితే ఆ పోరాటం సహేతుకమైనది అయి ఉండాలన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రెడిటేషన్ కార్డులు అందేలా చేయడమే టియుడబ్ల్యూజే ప్రధాన ధ్యేయం అన్నారు. 1996 సంవత్సరానికి ముందు ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 3 వేల అక్రిడేషన్ కార్డులు మాత్రమే ఉండేవని, ప్రభుత్వంతో కొట్లాడి గ్రామీణ విలేకరులందరికీ మండలాల వారీగా అక్రెడిటేషన్లు ఇప్పించిన చరిత్ర తమకు ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 3వేల అక్రెడిటేషన్ లను 12వేలకు పెంచిన ఘనత తమ సంఘానిదేనన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా 23 వేల అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చామని గొప్పలు చెబుకుంటున్న మిత్రులు , పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అదే సంఖ్యలో అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చారన్న విషయాన్ని మర్చిపోతున్నారని గుర్తు చేశారు. కార్డుల సంఖ్య ముఖ్యం కాదని, ఆ కార్డులతో ఎన్ని సంక్షేమ పథకాలను అమలు చేసారో, వాటి కోసం ఎన్ని ఉద్యమాలు చేసారో చెబితే బాగుంటుందన్నారు.
252 జిఓలో ఉన్న కొన్ని లోటు పాట్లు..
252 జీవో తెచ్చి జర్నలిస్టులకు అన్యాయం చేస్తున్నారంటూ, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని విమర్శించడం సరైంది కాదన్నారు. కట్టుదిట్టమైన నిబంధనలతో 252 జీవో ను తెచ్చారని ఆయన పేర్కొన్నారు. అక్రెడిటేషన్ కార్డులతో రిపోర్టర్లకు, డెస్క్ జర్నలిస్టులకు ఇంతకాలం ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని చెప్పారు. కనీసం ఇప్పుడైనా సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం పై ఒత్తిడి పెంచి, అక్రెడిటేషన్, మీడియా కార్డులు పొందే వర్కింగ్ జర్నలిస్టులందరికీ ప్రయోజనాలు చేకూర్చేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. 252 జిఓ లో ఉన్న కొన్ని లోటు పాట్లను తమ సంఘ పెద్దలు గుర్తించినారని, వాటిని సవరించేందుకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళనున్నట్లు ఆయన స్పష్టం చేసారు. ఏది ఏమైనా అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు, మీడియా కార్డులు అందించేందుకు తమ సంఘం తీవ్రంగా కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఇటీవల కమిషనర్ కార్యాలయం ముందు రెండు వేల మంది జర్నలిస్టులతో నిర్వహించిన మహా ధర్నాతో ప్రభుత్వం దిగివచ్చి యుద్ధప్రాతిపదికన జీవో జారీ చేసిందన్నారు. తమ సంఘ జాతీయ నాయకుడిపై దుష్ప్రచారం చేస్తూ అలజడి సృష్టించడం సహించరానిదని బండారి యాదగిరి పేర్కొన్నారు.
Also Read: Naga Vamsi: టికెట్ ధరల గురించి నిర్మాత నాగవంశీ ఏం చెప్పారంటే?.. రూ.99 అందుకే కష్టం..

