Naga Vamsi: నిర్మాత సూర్యదేవర నాగవంశీ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా టికెట్ ధరల వ్యూహంతో పాటు టాలీవుడ్ భవిష్యత్తు, తన నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ రాబోయే సినిమాల గురించి కీలక విషయాలను పంచుకున్నారు. నాగవంశీ ప్రధానంగా టికెట్ ధరల గురించి మాట్లాడుతూ, ప్రస్తుతం పరిశ్రమలో ఉన్న గందరగోళాన్ని అంగీకరించారు. చిన్న సినిమాలకు తక్కువ ధరలు (ఉదాహరణకు రూ.99 లేదా రూ.112) ఉండాలని, పెద్ద సినిమాలకు వాటి నిర్మాణ వ్యయం మరియు స్కేల్‌ను బట్టి ధరలు పెంచుకునే వెసులుబాటు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ ప్రయోగాత్మక దశలో ఉందని, వచ్చే ఆరు నెలల్లో ప్రేక్షకుల స్పందనను బట్టి టికెట్ ధరల విషయంలో ఒక స్పష్టమైన క్రమబద్ధమైన విధానం (Systematic Approach) అమలులోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతే కాకుండా చిన్న సినిమాలకు ఆ రేట్ కరెక్టే అనిపించినా.. పెద్ద సినిమాల విషయంలో సరిపోదన్నారు. ఆ రేంజ్ లో టికెట్ రేట్లు పెట్టి పెద్ద సినిమా కొనసాగిస్తే ఆ డబ్బులు రావడానికి సంవత్సరాలు పడుతుందన్నారు.
2024లో కొన్ని యాక్షన్ సినిమాలు చేసినప్పటికీ, 2025లో తన బ్యానర్ మళ్లీ “వినోదం, ప్రేమకథల” (Entertainment and Rom-coms) వైపు మళ్లుతోందని తెలిపారు. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేది ప్రధానంగా రిలాక్స్ అవ్వడానికి, నవ్వుకోవడానికి అని, అందుకే కామెడీ కంటెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. సినిమా బాగుంటే ప్రేక్షకులు రేటింగ్స్‌తో సంబంధం లేకుండా ఆదరిస్తారని, ‘టిల్లు స్క్వేర్’ విజయం అందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
ఇదే సందర్భంలో తర్వాత రాబోయే సినిమాల గురించి కూడా వివరించారు. నార్నే నితిన్ తో రాబోతున్న సినిమా పక్కా గ్రామీణ నేపథ్యంలో సాగే వినోదాత్మక చిత్రమన్నారు. ‘మ్యాడ్’ లాగే ఇది కూడా ప్రేక్షకులను ఆద్యంతం నవ్విస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. రవితేజ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. MAD 2: సీక్వెల్ షూటింగ్ దశలో ఉంది. మొదటి భాగంలో కాలేజీ లైఫ్ చూపిస్తే, రెండో భాగంలో కాలేజీ తర్వాత వారి జీవితాలు ఎలా ఉంటాయనేది మరింత ఫన్నీగా ఉంటుందని చెప్పారు. సిద్ధు తన సినిమాల స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడని, క్వాలిటీ కోసం సమయం తీసుకున్నా మంచి అవుట్‌పుట్ ఇస్తాడని ప్రశంసించారు.
Read also-Shambhala: ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్ కొట్టేశారు.. ‘శంబాల’పై రెబల్ స్టార్!
సంక్రాంతి వంటి పెద్ద పండుగల సమయంలో సినిమాల పోటీ గురించి మాట్లాడుతూ.. ప్రతి నిర్మాత తన సినిమాను సరైన సమయంలో విడుదల చేయాలనుకుంటారని, ఎవరినీ సినిమా వాయిదా వేసుకోమని అడిగే హక్కు మనకు లేదని స్పష్టం చేశారు. పోటీని తట్టుకుని నిలబడగలిగే కంటెంట్ ఉంటేనే విజయం సాధ్యమని ఆయన అన్నారు. అలాగే సోషల్ మీడియాలో వచ్చే నెగటివ్ రివ్యూల గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని, కంటెంట్ బలంగా ఉంటే సినిమా కచ్చితంగా ఆడుతుందని చెప్పారు. చివరగా, నిర్మాతగా తన బాధ్యత కేవలం సినిమాలు తీయడమే కాకుండా, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు నష్టపోకుండా చూసుకోవడం కూడా అని నాగవంశీ ఈ ఇంటర్వ్యూలో వివరించారు. 2025 సంవత్సరం సితార ఎంటర్టైన్మెంట్స్ నుండి ఒక “ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీ”లా ఉండబోతోందని ఆయన మాటల ద్వారా స్పష్టమవుతోంది.

