Khaleda Zia: బంగ్లాదేశ్‌లో అల్లర్లు కొనసాగుతున్న వేళ.. ఆ దేశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ప్రధాన మంత్రి ఖలీదా జియా మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. వచ్చే ఏడాది జరగనున్న బంగ్లాదేశ్ సాధారణ ఎన్నికల్లో ప్రధాన పోటీదారుగా భావించబడుతున్న ఖలీదా జియా మరణం.. అనారోగ్యంతో మృతి చెందడం అక్కడి రాజకీయాలను తీవ్రంగా ప్రభావింత చేసే అవకాశముంది. కాగా ఖలీదా మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంతకీ ఖలీదా జియా ఎవరు? ఆమె హయాంలో భారత్ – బంగ్లాదేశ్ సంబంధాలు ఎలా ఉండేవి? ఆమె భారత్‌కు అనుకూలమా? వ్యతిరేకమా? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
బంగ్లా తొలి ప్రధాని..
గత మూడు దశాబ్దాలుగా బంగ్లాదేశ్ రాజకీయాలను ప్రభావితం చేసిన ఇద్దరు మహిళా నేతల్లో ఖలేదా జియా ఒకరు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) చీఫ్ అయిన బేగం ఖలీదా జియా ఆ దేశానికి తొలి మహిళా ప్రధానిగా వ్యవహరించారు. ఆమె రెండు పర్యాయాలు (1991-96, 2001-06) ఆ దేశానికి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1991లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) ద్వారా దేశంలో అధ్యక్ష పాలనను రద్దు చేసి పార్లమెంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. దీంతో పరిపాలనా అధికారం ప్రధానమంత్రికి చేరింది.
భారత్ వ్యతిరేక వైఖరి
ఖలీదా జియా తొలినాళ్లలో భారత్ వ్యతిరేఖ వైఖరిని అవలంభించారు. మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్ కు స్నేహపూర్వక హస్తం అందిస్తే.. ఆమె మాత్రం భారత్ పట్ల ప్రతికూలంగా వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి.1996-2014 మధ్య ఆమె ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ప్రధాని షేక్ హసీనా అవలంభించిన భారత్ అనుకూల వైఖరిని ఆమె తప్పుబట్టారు. భారత్‌కు భూభాగ మార్గ రవాణా (ట్రాన్సిట్) అనుసంధాన ప్రాజెక్టులను ఖలీదా తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే ఈశాన్య భారత రాష్ట్రాలకు బంగ్లాదేశ్ గుండా రవాణా అనుమతులు ఇవ్వడాన్ని తిరస్కరించారు. భారత్ ట్రక్కులు.. టోల్ లేకుండా బంగ్లాదేశ్ రహదారులను ఉపయోగించడం బానిసత్వంతో సమానమంటూ ఆమె గతంలో తీవ్రంగా మండిపడ్డారు.
1972 ఒప్పందానికి వ్యతిరేకం..
అంతేకాదు 1972లో భారత్ – బంగ్లాదేశ్ మధ్య కుదిరిన స్నేహపూర్వక ఒప్పందాన్ని పునరుద్ధరించడాన్ని ఆమె ఖలీదా జియా తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది తమ దేశాన్ని భారత్ చెరలో బంధించేసిందని గతంలో ఆరోపించారు. 2018లో ఢాకాలో జరిగిన ర్యాలీలో, షేక్ హసీనా ప్రధాని, తాను ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో, భారత్‌కు ట్రాన్సిట్ డ్యూటీల మినహాయింపు ఇచ్చినందుకు హసీనాపై విమర్శలు గుప్పించారు. “బంగ్లాదేశ్‌ను భారత రాష్ట్రంగా మార్చే ప్రయత్నాన్ని మేం నిరోధిస్తాం” అని ఆమె అన్నారు.
Also Read: Bandla Ganesh: మరో కొత్త బ్యానర్ స్టార్ట్ చేసిన నిర్మాత బండ్ల గణేష్.. అది ఏంటంటే?
భారత పర్యటన తర్వాత మార్పు
తాను ప్రధానిగా ఉన్న సమయంలో భారత్ ను కాదని ఆమె చైనాకు దగ్గరయ్యారు. ఆ దేశంలో పలు రక్షణ ఒప్పందాలను కుదుర్చుకున్నారు. యుద్ధ ట్యాంకులు, ఫ్రీగేట్లు తదితర సైనిక సామాగ్రిని బీజింగ్ నుంచి ఢాకాకు దిగుమతి చేసుకున్నారు. 2006లో ప్రధాని హోదాలో భారత్ పర్యటనకు వచ్చిన ఖలీదా జియా.. తమదేశానికి అనుకూలమైన వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో కొంతమేర విజయవంతమయ్యారు. ఆ తర్వాత నుంచి భారత్ పట్ల ఆమె వైఖరిలో కొద్దిమేర మార్పు వచ్చింది. భవిష్యత్తులో బీఎన్‌పీ ప్రభుత్వం ఏర్పడితే బంగ్లాదేశ్ భూభాగం నుంచి భారత లక్ష్యాలపై దాడులు చేసే ఉగ్రవాద గుంపులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ భేటిలో ఆమె హామీ ఇచ్చారు. మెుత్తంగా చూస్తే షేక్ హసీనాతో పోలిస్తే ఖలీదా జియా.. భారత్ తో తన సంబంధాలను ఉద్రిక్తంగానే కొనసాగించారు.

