Ramchander Rao: బీజేపీలో లీకు వీరులు ఉన్నారని, వారు వీక్ కాక తప్పదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchander Rao) హెచ్చరించారు. పార్టీ క్రమశిక్షణ, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబిన్ సిన్హాను(Nithin Nabin Sinha) సోమవారం రాంచందర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే నెలలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ పర్యటన జరగనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. ఈ పర్యటన ద్వారా తెలంగాణలో పార్టీ బలోపేతానికి మరింత వేగం పుంజుకుంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాబోయే కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు చెప్పారు.
నితిన్ నబిన్ సిన్హా..
ఈ సందర్భంగా నితిన్ నబిన్ సిన్హా తెలంగాణ(Telangana)లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, అవసరమైన కార్యాచరణ, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యలపై విలువైన సూచనలు చేశారని రాంచందర్ రావు తెలిపారు. సమిష్టికృషితో మరిన్ని మంచి ఫలితాలు సాధించవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారని వివరించారు. ఇదిలా ఉండగా అసెంబ్లీ సమావేశాలను కనీసం నెల రోజులపాటు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక కీలక అంశాలు, ప్రజా సమస్యలపై లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ప్రజల దృష్టిని మళ్లించేలా కొత్త కొత్త అంశాలను కావాలనే తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు. ఇది ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నమని ఆరోపించారు.
Also Read: January Bank Holidays: జనవరిలో భారీగా బ్యాంక్ హాలిడేస్.. ముందే జాగ్రత్త పడండి మరి.. తేదీలు ఇవే
ఎన్నికల సంస్కరణల్లో భాగంగా..
ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాల్సిందేనని అన్నారు. అసెంబ్లీకి రావడం ఏదో గొప్ప విషయంలా చూపించడం సరికాదని పేర్కొన్నారు. కేసీఆర్(KCR) సభకు రావడంపై గబ్బర్ సింగ్ జైలు నుంచి పారిపోయి వచ్చినట్లుగా హైప్ సృష్టించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ఎస్ఐఆర్(SIR) ప్రక్రియ తెలంగాణలో కూడా అమలవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పాకిస్తాన్(Pakisthan), బంగ్లాదేశ్(Mangaladesh), రోహింగ్యాలకు సంబంధించిన అక్రమ ఓట్లు ఉన్నాయన్న విషయం వాస్తవమని పేర్కొన్నారు. అలాంటి దొంగ ఓట్లను తప్పనిసరిగా తొలగించాల్సిందేనని, స్వచ్ఛమైన ఓటరు జాబితాల ద్వారానే ప్రజాస్వామ్యం బలపడుతుందని వ్యాఖ్యానించారు.
Also Read: Shambhala: ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్ కొట్టేశారు.. ‘శంబాల’పై రెబల్ స్టార్!

