Hindu Family Home Fire: బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఫిరోజ్ పూర్ జిల్లా దుమ్రితాల గ్రామంలో ఒక హిందూ కుటుంబానికి చెందిన ఐదు ఇళ్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. గత కొన్ని రోజులుగా హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడుల్లో భాగంగానే ఇది కూడా జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పది రోజుల క్రితం (డిసెంబర్ 18న) హిందువైన చంద్ర దాస్ పై అల్లరి మూక తీవ్రంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. విపరీతంగా అతడ్ని కొట్టడంతో పాటు చెట్టుకు కట్టేసి అతడి మృతదేహాన్ని తగలబెట్టారు. ఆ తర్వాత నుంచి వరుసగా హిందువులపై దాడులు జరుగుతుండటంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే..
దుమ్రితాల గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన కారణం తెలియరాలేదని స్థానిక అధికారులు చెబుతున్నారు. దుండగులు మండుతున్న గుడ్డను తీసుకొచ్చి ఇంటిలోనికి విసేరేశారని నివేదికలు చెబుతున్నాయి. అవి క్షణాల్లోనే అంతటా వ్యాపించాయని పేర్కొన్నాయి. కాగా బాధితుల కుటుంబాలతో మాట్లాడేందుకు భారత్ కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ప్రయత్నించింది. ఈ క్రమంలో తాము తీవ్ర భయందోళనకు గురవుతున్నట్లు బాధితులు తెలిపారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో తమకు తెలియదని.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని వారు సమాధానం ఇచ్చారు.
🚨 Bangladesh
An attack on Hindu minorities continues to raise serious concern. In Dumritola village of Pirojpur district, a house belonging to a Hindu family was reportedly set ablaze by an extremist Islamist mob.
Authorities have launched an investigation as calls grow louder… pic.twitter.com/Yul4dTf5q5— World News (@World_Breaking_) December 29, 2025
సర్వం కోల్పోయిన బాధితులు
తెల్లవారుజామున ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు బాధితులు తెలిపారు. బయట నుంచి ఎవరో తలుపులకు తాళం కూడా వేశారని చెప్పారు. దీంతో బయటకు రావడం తమకు చాలా కష్టమైందని పేర్కొన్నారు. అతి కష్టం మీద గోడలు దూకి బయటపడినట్లు స్పష్టం చేశారు. ఈ ప్రమాదంలో తమ ఇళ్లు, సామాన్లు, బట్టలు కాలి బూడదయ్యాయని చెప్పారు. అంతేకాకుండా ఇంట్లోని పెంపుడు జంతువులు సైతం మృతి చెందాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ లోని హిందువులపై జరుగుతున్న దాడులతో తాము భయం గుప్పిట్లో బతుకున్నట్లు బాధిత కుటుంబం వాపోయింది.
Also Read: UP Rampur Accident: అయ్యబాబోయ్.. భయంకరమైన యాక్సిడెంట్.. బొలెరోపై బోల్తాపడ్డ లారీ!
పోలీసుల అదుపులో అనుమానితులు
ఫిరోజ్ పూర్ జిల్లా ఎస్పీ మహమ్మద్ మంజూర్ అహ్మద్ సిద్ధిఖీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దాడికి సంబంధించిన ఘటనపై వేగంగా దర్యాప్తు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. స్థానిక పోలీసులు ఇప్పటివరకూ ఐదుగురు అనుమానితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మిగతా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. కాగా, హిందువుల ఇళ్లు తగలబడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
హిందువులపై 71 దాడి ఘటనలు
ఈ ఏడాది జూన్ నుంచి డిసెంబర్ మధ్యకాలం వరకూ హిందూ మైనారిటీలపై 71 దాడి ఘటనలు నమోదైనట్లు బంగ్లాదేశ్ మైనారిటీల కోసం పనిచేసే హ్యూమన్ రైట్స్ కాంగ్రెస్ ఫర్ బంగ్లాదేశ్ మైనారిటీస్ (HRCBM) నివేదిక తెలిపింది. చాంద్‌పూర్, చట్టోగ్రామ్, దినాజ్‌పూర్, లాల్‌మోనిర్‌హాట్, సునాంగంజ్, ఖుల్నా, కొమిల్లా, గాజీపూర్, టాంగైల్, సిల్హెట్ సహా 30కి పైగా జిల్లాల్లో ఈ కేసులు నమోదైనట్లు తెలిపింది. కాగా బంగ్లాదేశ్ లో మైనారిటీల బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారని చెప్పేందుకు ఈ నివేదికే ఒక ఉదాహరణ అని విశ్లేషకులు చెబుతున్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పారిపోయి భారత్ కు వచ్చినప్పటికీ నుంచి మైనారిటీలపై అకృత్యాలు తారాస్థాయికి చేరినట్లు పేర్కొంటున్నారు.

