Minister Ramprasad Reddy: ఏపీ క్యాబినేట్ సమావేశంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా (Annamayya District) కేంద్రంగా ఉన్న రాయచోటి మార్పు అంశంపై కేబినేట్ చర్చిస్తున్న క్రమంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కళ్లమందే కన్నీటి పర్యంతం అయ్యారు. జిల్లా మార్పు కారణంగా ప్రజల్లో తీవ్ర ఆందోళనలు పెరుగుతున్నాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు కలుగజేసుకొని మంత్రిని ఓదార్చారు. జిల్లా మార్పు అంశానికి సంబంధించి ధైర్యం చెప్పారు.
మంత్రి కన్నీరుతో నిశ్శబ్దం..
మంత్రి రాంప్రసాద్ భావోద్వేగంతో కేబినేట్ సమావేశంలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. రాంప్రసాద్ కన్నీరు పెట్టడాన్ని చూసి ఇతర మంత్రులు సైతం షాక్ కు గురయ్యారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు కలుగజేసుకున్నారు. అన్నమయ్య జిల్లా మార్పు చేయకుంటే ఎదురయ్యే సమస్యలను మంత్రికి వివరించారు. అంతేకాదు రాయచోటి అభివృద్ధిని స్వయంగా తానే పర్యవేక్షిస్తానని మంత్రి రాంప్రసాద్ కు హామీ ఇచ్చారు. దీంతో మంత్రి రాంప్రసాద్ కాస్త స్థిమితపడినట్లు తెలుస్తోంది. అయితే కేబినేట్ సమావేశం అనంతరం బయటకొచ్చిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. దీనిపై మీడియాతో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లి పోయారు.
ఏంటీ రాయచోటి వివాదం?
అన్నమయ్య జిల్లా కేంద్రంగా కొనసాగుతున్న రాయచోటిని మదనపల్లె జిల్లాలో విలీనం చేయాలనే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే దీనిపై రాయచోటి ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు నిరసనలు, ఆందోళనకు దిగుతున్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటీనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లా మంత్రి అయిన రాంప్రసాద్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.
Also Read: Allu Sirish Wedding Date: అల్లు ఇంట పెళ్లి భాజాలు.. శిరీష్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. స్పెషల్ వీడియోతో డేట్ రివీల్
అభ్యంతరాలకు కారణాలు..
జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి మార్పు.. అభివృద్ధి ఆకాంక్షించి జరగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం మదనపల్లె జిల్లాలో రాయచోటీని విలీనం చేయాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న రాయచోటీని జిల్లా కేంద్రంగా తొలగించడమంటే తమ ప్రాంత వృద్ధిని అడ్డుకోవడమేనని మండిపడుతున్నారు. విపక్ష వైసీపీ సైతం ఆందోళనకారులకు మద్దతుగా నిలవడంతో రాయచోటి మార్పు అంశం మరింత తీవ్రతరంగా మారుతోంది. దీనిపై రాయచోటీలో బంద్ లు, నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భావోద్వేగానికి గురికావడం గమనార్హం.

